ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమదే పైచేయి అని ఇరాన్ చెప్పుకుంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి తమ భూభాగంలోకే వస్తుందంటూ మ్యాప్ రిలీజ్ చేశారు. అయితే.. తాజా షిప్పింగ్ గణాంకాలు మాత్రం ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తోంది.
గత రెండు వారాల్లో హర్ముజ్ గుండా ప్రయాణించిన నౌకల్లో అత్యధిక శాతం ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకున్నాయి. దీంతో హర్ముజ్‌పై ఇరాన్ గతంలో ఉన్నంత స్థాయిలో నియంత్రణ కొనసాగించడం కష్టమవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అమెరికా నౌకాదళ బలగాల ఉనికి, ఇరాన్ నౌకలపై దాడుల భయం, చమురు రవాణా మార్గాల్లో మార్పులు.. ఈ జలసంధిలో శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.
షిప్పింగ్ డేటా సంస్థ కేప్లర్ గణాంకాల ప్రకారం.. గత రెండు వారాల్లో హర్ముజ్ జలసంధి గుండా వెళ్లిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఉపయోగించాయి. ఈ మార్గాన్ని ఐక్యరాజ్యసమితి అనుమతించినప్పటికీ.. ఇరాన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
నెల రోజుల క్రితం వరకు ఈ మార్గంలో దాదాపు ఎలాంటి నౌకా రాకపోకలు లేవని కేప్లర్ తెలిపింది. ఇప్పుడు మాత్రం పెద్ద సంఖ్యలో వాణిజ్య నౌకలు ఇరాన్ అభ్యంతరాలను పక్కనబెట్టి ఒమన్ వైపు నుంచి ప్రయాణిస్తున్నాయి.
ఇరాన్ ఉత్తర ఒమన్ తీరానికి సమీపంలోని మార్గాలను ఉపయోగించే నౌకలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. అమెరికా నౌకాదళ రక్షణపై ఆధారపడుతూ కొన్ని నౌకలు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.
కేప్లర్ క్రూడ్ ఆయిల్ విశ్లేషణ విభాగం అధిపతి హోమయూన్ ఫలక్‌షాహీ స్పందిస్తూ.. హర్ముజ్‌పై ఇరాన్ కొంతవరకు నియంత్రణ కోల్పోయినట్లు కనిపిస్తోంది అని అంటున్నారు.
ఇరాన్ టోల్ వసూళ్లకూ బ్రేక్!
హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకల నుంచి రవాణా రుసుములు వసూలు చేయాలని ఇరాన్ గతంలో ప్రయత్నించింది. అయితే నౌకలు ఇరాన్ ప్రాధాన్యమిస్తున్న మార్గాన్ని కాకుండా ఒమన్ వైపు ఉన్న మార్గాన్ని ఎంచుకోవడంతో ఆ ప్రయత్నాలను అమలు చేయడం కష్టంగా మారింది. ఇరాన్ టోల్ వసూలు చేయాలన్న ప్రతిపాదనను మధ్యప్రాచ్యంలోని చాలా దేశాలు అంగీకరించడం లేదని పికరింగ్ ఎనర్జీ పార్ట్‌నర్స్ వ్యవస్థాపకుడు డాన్ పికరింగ్ పేర్కొన్నారు.
అంటే.. నౌకల రాకపోకలను బెదిరించడం మాత్రమే కాకుండా వాటి నుంచి తన నిబంధనల ప్రకారం రుసుములు వసూలు చేయాలన్న ఇరాన్ ప్రయత్నానికీ ఇప్పుడు పరిమితులు ఏర్పడుతున్నాయి.
చమురు ట్యాంకర్లలో ‘డార్క్ ట్రాఫిక్’
హర్ముజ్ ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు చమురు రవాణాలో కొత్త మార్గాలను అనుసరిస్తున్నాయి. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈలు వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్‌సీసీ)ను ఉపయోగించి పెర్షియన్ గల్ఫ్ నుంచి హర్ముజ్ మీదుగా చమురును తరలిస్తున్నాయి. ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇతర ట్యాంకర్లకు చమురును బదిలీ చేస్తున్నట్లు సమాచారం.
ఇరాన్ దాడుల ముప్పు నుంచి తప్పించుకునేందుకు కొన్ని ట్యాంకర్లు తమ ట్రాన్స్‌పాండర్లను ఆపివేస్తున్నాయి. కొన్ని నౌకలు వారాలపాటు తమ గుర్తింపు సంకేతాలను నిలిపివేస్తున్నాయి. దీంతో సాధారణ షిప్పింగ్ ట్రాకింగ్ వ్యవస్థలకు అవి కనిపించకుండా పోతున్నాయి. ఈ విధానాన్ని ‘డార్క్ ట్రాఫిక్’గా వ్యవహరిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, ఇతర సాంకేతిక వ్యవస్థలతో కొన్ని నౌకలను గుర్తించగలిగినా.. వాటి కదలికలను పూర్తిస్థాయిలో అంచనా వేయడం కష్టమవుతోంది.
ట్రంప్.. అదే మాట
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హర్ముజ్‌పై అమెరికాదే పైచేయి అని స్పష్టం చేస్తున్నారు. అమెరికా నౌకాదళ బలగాలు ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. హర్ముజ్‌పై తమకు పూర్తి నియంత్రణ ఉందని ట్రంప్ ప్రకటించారు.
మంగళవారం మరింత దూకుడుగా స్పందించిన ఆయన.. హర్ముజ్‌ను అమెరికా నియంత్రణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు.. జలసంధి మ్యాప్‌ను షేర్ చేస్తూ దానిని ‘కొత్త అమెరికా భూభాగం’గా అభివర్ణించారు. అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ స్పందిస్తూ.. హర్ముజ్ గుండా వెళ్తున్న చమురు, హర్ముజ్‌ను తప్పించి ఇతర మార్గాల ద్వారా తరలిస్తున్న చమురు కలిపి ఒక వారంలో రోజుకు సుమారు 1.5 కోట్ల బ్యారెళ్లకు చేరుకుంది.
యుద్ధానికి ముందు హర్ముజ్ ప్రాంతం గుండా రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగేది. ప్రస్తుత ప్రవాహం దానికి దగ్గరగా ఉండటాన్ని చూపిస్తూ.. ఇరాన్ హర్ముజ్‌ను పూర్తిగా మూసివేయడంలో విఫలమైందని అమెరికా వాదిస్తోంది.
అరాఘ్చీ కౌంటర్
ఇరాన్–అమెరికా మధ్య మాటల యుద్ధం కూడా తీవ్రంగా కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని, ప్రస్తుతం ఎలాంటి చర్చలు షెడ్యూల్ కాలేదని చెప్పారు. అమెరికా నౌకాదళ దిగ్బంధం కొనసాగుతోందని, హర్ముజ్‌లోని సముద్రపు గనులను తొలగించినట్లు కూడా ఆయన ప్రకటించారు. దీనికి భిన్నంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఘాటుగా స్పందించారు. అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోవడంతో ఇప్పుడు ఇరాన్ షరతులపై చర్చలు జరపాలని ‘వేడుకుంటోంది’ అని వ్యాఖ్యానించారు.
ఇరాన్–యూఏఈ మధ్యా ఉద్రిక్తత!
హర్ముజ్ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్–యూఏఈ మధ్య కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. వాటిలో ఒక క్షిపణి యూఏఈ ప్రాదేశిక జలాల్లో పడిందని.. మరో క్షిపణి ఆ జలాలకు వెలుపల సముద్రంలో పడిందని తెలిపింది.
అయితే ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఖండించారు. అవి నిరాధార ఆరోపణలని.. ఇలాంటి వ్యాఖ్యలు ఇరుగు పొరుగు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసి ప్రాంతీయ నమ్మకాన్ని బలహీనపరుస్తాయని అన్నారు.
మరోవైపు.. ఇరాన్‌తో వాణిజ్యం, వాణిజ్య మార్పిడి, ఆర్థిక లావాదేవీలన్నింటినీ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు నిలిపివేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.
చమురు ధరలపై ప్రభావం
హర్ముజ్ ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 59 సెంట్లు లేదా 0.7 శాతం పెరిగి బ్యారెల్‌కు 91.46 డాలర్లకు చేరాయి. మూడు వారాల తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి చేరడం గమనార్హం. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) ధర 75 సెంట్లు లేదా 0.9 శాతం పెరిగి 85.25 డాలర్లకు చేరింది. హర్ముజ్ మీదుగా చమురు రవాణాకు అంతరాయం కొనసాగితే.. సరఫరా భయాలు మరింత పెరిగి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.
ఇరాన్–ఒమన్ చర్చలపై ఆశలు
హర్ముజ్‌లో నౌకాయానాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్, ఒమన్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరుదేశాలకు జలసంధి తీర ప్రాంతాలు ఉండటంతో స్వేచ్ఛాయుత నౌకాయానంపై ఒక ఒప్పందం కుదిరే అవకాశాలపై ఆసక్తి నెలకొంది. అమెరికా ప్రత్యక్ష భాగస్వామ్యం లేకుండా ఈ చర్చలు జరగడం ట్రంప్‌కు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది.
ఇరాన్–ఒమన్ మధ్య హర్ముజ్ రవాణా ఒప్పందం కుదిరిన తర్వాతే అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలను పునఃప్రారంభించేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ప్రయత్నించే అవకాశం ఉందని ఖతార్ విదేశాంగశాఖ ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ తెలిపారు.
‘షరతులు నెరవేర్చే వరకు క్లోజ్’
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ మాత్రం తమ వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, ఆంక్షలను తొలగించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం వంటి షరతులను అమెరికా నెరవేర్చే వరకు హర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఆయన ప్రకటించారు. దీంతో హర్ముజ్ కేవలం నౌకాయాన సమస్యగా కాకుండా.. ఇరాన్–అమెరికా మధ్య రాజకీయ, సైనిక, ఆర్థిక పోరాటానికి ప్రధాన వేదికగా మారింది.
ఎవరి పట్టు ఎంత?
ఇరాన్ దాడుల ముప్పుతో కొన్ని వాణిజ్య నౌకలు తమ కదలికలను గుర్తించే ట్రాన్స్‌పాండర్లను ఆపేస్తున్నాయి. మరికొన్ని నౌకలు ప్రమాదకర మార్గాలను వదిలి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. అదీ అమెరికా రక్షణ నడుమ. అయితే 80 శాతానికి పైగా నౌకలు ఒమన్ మార్గాన్ని ఎంచుకోవడం మాత్రం హర్ముజ్‌పై ఇరాన్ సంప్రదాయ ఆధిపత్యానికి గట్టి సవాలుగా మారింది. అదే సమయంలో చమురు రవాణా యుద్ధానికి ముందు స్థాయికి ఇంకా చేరుకోకపోవడం అమెరికా పూర్తి నియంత్రణ వాదనకూ పరిమితులు ఉన్నాయని చెబుతోంది. అందుకే ప్రస్తుతం హర్ముజ్‌లో కనిపిస్తున్నది ఒకరి సంపూర్ణ విజయం కాదనేది విశ్లేషకుల మాట.


