పర్యావరణ యోధులకు రక్షణ ఏది? | Hyderabad Drain Tragedy Highlights Plight Of Waste Pickers | Sakshi
Sakshi News home page

పర్యావరణ యోధులకు రక్షణ ఏది?

Aug 4 2026 4:14 AM | Updated on Aug 4 2026 4:14 AM

Hyderabad Drain Tragedy Highlights Plight Of Waste Pickers

హైదరాబాద్‌లోని తెరిచి ఉన్న ఒక డ్రైన్లో పడి కొట్టుకుపోయిన 70 ఏళ్ల చెత్త ఏరుకునే కార్మికుడు బాలయ్య ఉదంతం– సమాజంలో అట్టడుగున ఉన్న ఈ కార్మికుల నిస్సహాయతకు, దుఃస్థితికి ప్రత్యక్ష నిదర్శనం. స్మార్ట్‌ సిటీల పర్యావరణ పరిరక్షణలో చెత్త ఏరుకునేవారి సేవలు అత్యంత కీలకమైనవి. ప్రతిరోజూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్, కాగితం, లోహాల వంటి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా వీరు డంపింగ్‌ యార్డులపై పడే భారాన్ని భారీగా తగ్గిస్తున్నారు. వాస్తవానికి, అధికారిక వ్యవస్థల కంటే వీరు తరచుగా అధిక స్థాయిలో వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగం చేయడంలో సఫలమవుతున్నారు.

పర్యావరణానికి విశేషమైన మేలు చేస్తున్నా గుర్తింపుకు నోచుకోని ఈ ‘పర్యావరణ యోధుల’ ఆరోగ్యం మాత్రం నిత్యం గాల్లో దీపంగానే మారుతోంది. కనీస రక్షణ లేకుండానే విషపూరిత వ్యర్థాలు, పగిలిన గాజు పెంకులు, ఆసుపత్రి వ్యర్థాలు, కుళ్ళిన చెత్త మధ్య వీరు పనిచేస్తుంటారు. చేతులకు గ్లోవ్స్, ముఖానికి మాస్కులు, కాళ్లకు బూట్లు లాంటి రక్షణ పరికరాలు లేకపోవడంతో చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, విష జ్వరాలు, ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు.

‘ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు– 2016’ ప్రకారం, చెత్త ఏరుకునేవారు పట్టణ స్థానిక సంస్థల నుండి గుర్తింపు కార్డులు పొందవలసి ఉన్నది. కానీ, బడ్జెట్‌ పరిమితులు లేదా అధికారుల అయిష్టత కారణంగా కొన్ని స్థానిక సంస్థలు వీటిని జారీ చేయడంలో విఫలమయ్యాయి.

సేవకు ‘నమస్తే’!
ఈ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యాంత్రిక పారిశుధ్య పర్యావరణ వ్యవస్థ జాతీయ కార్యాచరణ (నమస్తే) పథకం’ ఒక ఆశాకిరణం. 2024–25 నుండి, చెత్త ఏరుకునేవారిని ఈ పథకంలో అధికారికంగా చేర్చడం ముఖ్యమైన మార్పు. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1.52 లక్షల మంది చెత్త ఏరుకునే వారిని గుర్తించగా, ఇందులో 48.7 శాతం మహిళలు ఉండటం గమనార్హం. వ్యర్థాల సేకరణ, పునరుద్ధరణలో వారి కృషిని గుర్తించి, అధికారిక ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలలో వారిని విలీనం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా వారికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆరోగ్య బీమా, వారి పిల్లలకు ప్రీ–మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, ఈ–శ్రమ్‌ పోర్టల్లో నమోదు, అలాగే అవసరమైన శిక్షణ, పరికరాలు లభిస్తాయి.

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు ఇప్పటికే ‘రాష్ట్ర సఫాయి కర్మచారి కమిషన్‌’లను ఏర్పాటు చేసి పారిశుద్ధ్య, చెత్త ఏరుకునే కార్మికుల హక్కులను పరిరక్షిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలలో అటువంటి సంస్థాగత వ్యవస్థ లేకపోవడం గమనార్హం. అత్యంత ప్రమాదకర వాతావరణంలో పనిచేస్తున్న ఈ అట్టడుగు వర్గాల భద్రతను పునరుద్ధరించడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి హక్కులు కల్పించాలి. దీనితో పాటుగా పట్టణ స్థానిక సంస్థలు గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, ప్రతి ఒక్కరికీ గ్లోవ్స్, మాస్కులు, రెయిన్‌ కోట్లు, సేఫ్టీ బూట్లు కలిగిన కిట్లను అందించాలి. డ్రై వేస్ట్‌ కలెక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి వీరి శ్రమను వ్యవస్థీకృతం చేయాలి. పర్యావరణాన్ని, నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో వారు చేస్తున్న సేవలను గుర్తించి, గౌరవప్రదమైన స్థానం అందించడం సామాజిక బాధ్యత.
– శ్రీనివాస్‌ మాధవ్‌, సమాచార హక్కు పరిశోధకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement