వెస్టిండీస్‌తో సిరీస్ 1–1తో సమం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ (ట్రినిడాడ్): బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల క్రమశిక్షణ తోడవడంతో వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమంగా ముగించింది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 103/6తో బుధవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ చివరకు 46.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. కవెమ్ హెడ్జ్ (71 బంతుల్లో 34; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తేజ్‌నారాయన్ చందర్‌పాల్ (17), అమిర్ జంగూ (13), కెప్టెన్ రోస్టన్ చేజ్ (17), షై హోప్ (15), సీల్స్ (0), గ్రీవ్స్ (3) విఫలమయ్యారు.
పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్, సాజిద్ ఖాన్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం 75 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 23.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి గెలుపొందింది. అజాన్ అవైస్ (18), ఇమాముల్ హక్ (9) ఎక్కువసేపు నిలవలేకపోగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అబ్దుల్లా షఫీఖ్ (24 నాటౌట్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులు చేయగా... పాకిస్తాన్ జట్టు 387 పరుగులు చేసింది. 2023 తర్వాత విదేశాల్లో పాకిస్తాన్‌కిదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం.


