breaking news
Family stories
-
కళ్ళకు కట్టిన ఓ మహనీయ జీవితం
సమకాలీనులైన ప్రముఖుల జీవితాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం... తెర మీదైనా, వేదిక మీదైనా ఎప్పుడూ కత్తి మీద సామే. ఒక బయోగ్రఫీని బయోపిక్ సినిమా, లేదా డ్రామాగా మలచాలంటే... అప్పటి సాంఘిక వాతావరణాన్ని పునఃసృష్టించడంలో చిక్కులతో సహా దర్శక, రచయితలకు సవాలక్ష సవాళ్ళు ఉంటాయి. వాటిని అధిగమించి, ప్రేక్షకులతో శభాష్ అనిపించుకోవడంలోనే సృజనశీలురైన ప్రయోక్తలు, నటులకు అపరిమితమైన ఆనందం కలుగుతుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభవం మిగులుతుంది. సరిగ్గా అలాంటి నాటకమే... శతవసంత సేవామూర్తి, సాంస్కృతిక దీప్తి మండలి వెంకట కృష్ణారావు జీవితకథగా రంగభూమిపై ప్రదర్శితమైన ‘మహాపురుషుడు... మండలి’.చిన్ననాటి నుంచి చివరి వరకు విలువలతో కూడిన జీవితం గడిపిన మండలి వెంకట కృష్ణారావు జీవన ప్రస్థానాన్ని రంగస్థలంపై చూపేందుకు చేసిన అద్భుత ప్రయత్నం ఇది. వర్తమాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ మాజీ సంచాలకులు, ప్రముఖ నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ ఈ అపూర్వ నాటక రచన చేశారు. ప్రసిద్ధ నటుడు – నాటక ప్రయోక్త ‘గంగోత్రి’ సాయి ఈ ప్రదర్శనలో కీలకమైన మండలి వారి పాత్రను పోషించడమే కాక, సమర్థంగా దర్శకత్వం వహించారు. సాయి దర్శకత్వంలో విజయవాడ సమీపంలోని తాడేపల్లికి చెందిన అరవింద ఆర్ట్స్ నాటక సమాజం వారు ఈ నాటకాన్ని మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభ సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శించారు. ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి కె.వి. రమణాచారి సారథ్యంలోని ప్రసిద్ధ ‘రసరంజని’ నాటక సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన సాగింది. దాదాపు రెండు గంటల పైచిలుకు నిడివి గల నాటకం నిలబడి మరీ చూసిన ప్రేక్షకులతో ఆద్యంతం అలరించింది.కళకు టెక్నాలజీ తోడ్పాటు... రంగభూమిపై ఏఐ దృశ్యాల వినియోగంసినిమాలోని ‘స్టార్ట్... కట్’ లకు భిన్నంగా అక్కడికక్కడ ఆగకుండా సాగే నాటకంలో దృశ్యాలను పండించాలంటే రంగాలంకరణ కీలకం. మరి, వందేళ్ళ క్రితం నాటి పరిస్థితుల్ని వేదికపై మళ్ళీ సృష్టించాలంటే ఎంతో శ్రమ. అందుకే, ‘మహాపురుషుడు... మండలి’లో ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇప్పటి దాకా మనం తెర మీదే చూస్తున్న కృత్రిమ మేధ (ఏఐ)ను రంగస్థలంపై దృశ్యనేపథ్యాలకు సహాయంగా వినియోగించుకోవాలనే ఆలోచన చేశారు. రంగస్థలిపై ఎల్ఈడీ తెరపై చూపుతున్న అప్పుడెప్పుడో ఆ కాలానికి చెందిన ఫోటోలు – దృశ్యాలు - పాటల చలనచిత్రాన్నీ, వేదికపై నటీనటులు ఇప్పటికిప్పుడు చూపుతున్న హావభావాల రంగస్థల ప్రదర్శననూ తెలివిగా మిళితం చేశారు. చలనచిత్రాన్నీ, రంగస్థలాన్నీ... ఒకదానికొకటి పరిపూరకంగా మార్చారు. మంత్రిగా కారు సౌకర్యం ఉన్నా అది వద్దని, సామాన్యులతో కలసి బస్సులో ప్రయాణిస్తూ మండలి కృష్ణారావు వారు చూపిన నిరాడంబరత, గడిపిన ఆదర్శ జీవనాన్ని ప్రస్తావించారు.అధిక ఖర్చుతో కూడిన సెట్లకు బదులు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక సౌలభ్యాన్ని వాడుకోవడం రంగస్థలంపై కొంతకాలంగా ఉన్నదే. గతంలో చాలా ఏళ్ళ క్రితమే గుమ్మడి గోపాలకృష్ణ లాంటి నాటక ప్రముఖులు ఇలా టెక్నాలజీని వినియోగించుకున్నారు. రంగస్థలంపై ‘శ్రీకృష్ణ రాయబారం’ లాంటి పౌరాణిక నాటకాలకు కౌరవ సభ లాంటి వాటిని ప్రత్యేకంగా సెట్ వేయకుండా, వీడియో ప్రొజెక్షన్ ద్వారా నేపథ్యంగా చూపుతూ, దాని ముందు పురాణ పాత్రలు నటించడమనే టెక్నిక్‌ను వాడారు. ఆ తర్వాత కాలంలో ఆచార్య కోట్ల హనుమంతరావు లాంటివారు ‘జయ జయహే తెలంగాణ’ లాంటి నృత్య నాటకాలకూ, ‘ప్రతాపరుద్రం’ నాటక త్రయానికీ ఆ పద్ధతిని వినియోగించారు. ఇటీవలి కాలంలో పలువురు యువకులు కొత్తగా వచ్చిన ఏఐని నేపథ్య దృశ్యాలకు వాడడం మొదలుపెట్టారు. తాజాగా విజయవాడకు చెందిన రంగస్థల నట - దర్శకుడు పి.వి.ఎన్. కృష్ణ లాంటి వారు తమ ‘ఛత్రపతి శివాజీ’ నాటకానికి సైతం ప్రదర్శనలో ఈ తరహా ప్రయోగాన్ని సమర్థంగా నిర్వహిస్తున్నారు.అయితే, ఎల్ఈడీ తెరల ఖర్చు, శ్రమతో కూడిన ఈ ప్రయోగం అన్నిచోట్లా సులభసాధ్యం కాదు. సన్నివేశానికి తగ్గట్టు అమరకపోతే నాటకానికీ నగుబాటే. తాజా ‘మహాపురుషుడు... మండలి’ నాటకంలో మాత్రం నేపథ్యంలో వాడిన ఏఐ సృష్టి దృశ్యాలలో ఒకటీ అరా చిన్న లోటుపాట్లున్నా సమయ సందర్భాలకు తగ్గట్టు సమర్థంగా ఉపయోగించారు. సామాన్యుల్ని మెప్పించారు. ఈ వినూత్న ప్రయోగంతో... ప్రదర్శన పద్ధతుల్లో తెలుగు నాటకరంగాన్ని మరో కొత్త పుంత తొక్కించారు. ప్రేక్షకుల మనఃఫలకంపై వేదికను అపూర్వంగా వెలిగించారు. నాటకంగా... తెలుగు వెలుగుల జీవితంరచన విషయానికొస్తే – గాంధీ, అంబేద్కర్ లాంటి జాతీయ నాయకులపై నాటక రచనలు, ప్రదర్శనలు కొత్త కాదు. అయితే, తెలుగు సమాజంలోని త్యాగపురుషులు, జాతీయోద్యమ నాయకులపై మాత్రం అవి చాలా అరుదే. ‘ఆంధ్ర కేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులుపై చాలాకాలం క్రితం ఆచార్య మొదలి నాగభూషణశర్మ ‘ప్రజానాయకుడు ప్రకాశం’ అంటూ నాటక రచన చేశారు. అప్పట్లో ‘రసరంజని’ సంస్థ దాన్ని పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఇప్పుడు మండలి వెంకట కృష్ణారావుపై తాజా నాటకం ‘మహాపురుషుడు... మండలి’ ఆ అరుదైన ప్రయత్నాల వరుసలో తాజా చేర్పు. తెలంగాణ ప్రాంతం నుంచి సుప్రసిద్ధులైన తెలుగు తేజాలు సురవరం ప్రతాపరెడ్డి, కొత్వాల్ రాజా బహదూర్ వెంకట రామారెడ్డి లాంటి ప్రసిద్ధులపై నాటక రచన చేసిన అనుభవం దీర్ఘాసి విజయభాస్కర్‌ది. ఆ అనుభవంతో పాటు మండలి వారిపై అభిమానం, ఆయన సేవాతత్పర జీవితంపై లోతైన అవగాహనతో ఆనాటి పరిస్థితుల్ని అక్షరాక్షరంలో నింపుకొని విజయభాస్కర్ ఈ రచన చేశారు. అది ఈ నాటక ప్రదర్శనలో అడుగడుగునా ప్రస్ఫుటమవుతుంది.‘మండలి’ వంశ చరిత్ర మొదలు కృష్ణారావు బాల్యం, స్వాతంత్ర్యోద్యమ కాలప్రభావం, బ్రిటీషు పాలకులపై సాగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమం, రైతుల పక్షాన చేపట్టిన పోరాటాలు, స్వాతంత్ర్యానంతర రాజకీయాల్లో అవిస్మరణీయమైన కాంగ్రెస్ నేతగా కృష్ణారావు ఎదిగిన తీరు, పార్లమెంట్ సభ్యుడి నుంచి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దాకా చేపట్టిన పదవులు, చేసిన సత్కార్యాలు, తెలుగు అధికార భాషా సంఘం – ఉర్దూ అకాడెమీ – బాలల అకాడెమీ – వివిధ కార్పొరేషన్లు ఆదిగా అనేక మౌలిక సంస్థల ఏర్పాటులో ఆయన కృషి, అవనిగడ్డలో ‘గాంధీ క్షేత్రం’ స్థాపన, పులిగడ్డ వంతెన సహా చివరి వరకు ప్రజాక్షేమం కోసమే పలవరించిన తీరు, రాజకీయాల్లో ఆయన తాత్విక భావధారకు కొనసాగింపుగా మండలి బుద్ధప్రసాద్ ముందుకు రావడం... ఇలా దాదాపు కొన్ని దశాబ్దాల సమీప కాలపు సమకాలీన చరిత్రను ఈ నాటకంలో కళ్ళ ముందుకు తెచ్చారు రచయిత. ముఖ్యంగా, తెలుగు భాషా, సాంస్కృతిక వికాసానికి మండలి వారు చేసిన కృషి, 1977 నవంబర్‌లో వేలమందిని పొట్టనబెట్టుకున్న దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన సాగించిన అనుపమానమైన సేవను ఈ నాటకం మరోసారి గుర్తు చేసింది. మళ్ళీ ఈ తరానికి పరిచయం చేయడంలో అన్నివిధాలా కృతకృత్యమైంది.విజయవంతమైన రచనా భాస్వరంపి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు లాంటి రాజకీయ ఉద్దండుల పాత్రలు నాటకంలో కనిపించడం, కీలక సందర్భాల్లో వారు మండలి వారికి ఇచ్చిన తోడ్పాటును చూపించడం ప్రేక్షకులలో పురా జ్ఞాపకాల పేటికలను తెరుస్తుంది. ప్రధాన నాటక అంశాన్ని నేపథ్యంగా తీసుకొని, ఆ పరిధిని దాటకుండానే సమయం, సందర్భాన్ని బట్టి ఎప్పటికీ వెంటాడే డైలాగులు కొన్ని రాశారు. “మనసులో మలినం లేని ప్రతి మనిషీ మాధవుడే...”, “భాష చచ్చిపోతే... జాతి సగం చచ్చినట్టే”, “జనంతో కలసి నడిచేవాడు మామూలు మనిషి, జనానికి ముందుండి నడిపించేవాడు నాయకుడు”, “శ్వాస కన్నా ఆశ పెద్దది”, “అటు శవాలు... ఇటు జీవచ్ఛవాలు” లాంటి అనేక సంభాషణలే అందుకు ఉదాహరణ. అలాగే, నాటకాన్ని నడిపే సూత్రధారుల సంభాషణల్లో సందర్భానుసారం సమకాలీన కలుషిత రాజకీయ వాతావరణాన్ని స్ఫురింపజేస్తూ, బలంగా మాటల కొరడా ఝళిపించడం మరో విశేషం.రచనతో పాటు ప్రదర్శనలోనూ వివిధ పాత్రధారులు, నేపథ్య సంగీతం సహా పలువురు సాంకేతిక నిపుణుల సాయంతో రక్తికట్టిన నాటక ప్రదర్శన ఇది. సామాన్య రైతుల పాత్రల నుంచి మండలి వారి సహధర్మచారిణి పాత్ర దాకా అందరూ బాగా చేయడంతో చిన్నపాటి లోపాలేవీ కనిపించకుండా పోయాయి. గరిష్ఠ భూపరిమితి చట్టం కింద భూములు ఇవ్వబోమన్న కామందుల సందర్భంలో ఓ పాత్ర పదే పదే చెప్పే ఒక్క డైలాగుతో హాస్యం పండితే... స్వాతంత్ర్య కాలంలో సాగుభూములను ఇతర అవసరాలకు కేటాయించిన ప్రభుత్వ నిర్ణయ వేళ భూమికీ – రైతుకూ మధ్య అనుబంధాన్ని చెబుతూ బడుగు రైతులు బాధపడే సందర్భం మనసును మెలిపెడుతుంది. ఏడున్నర ఎకరాల భూమిలో అయిదున్నర ఎకరాలను నిరుపేదలకు అందించిన మండలి వారి త్యాగనిరతిని చూసినప్పుడు మన కాలంలో మన మధ్యనే ఇలాంటి ఓ నిస్వార్థ జీవి నడయాడాడనే భావనతో తీయటి బాధతో గుండె అంతా నిండిపోతుంది. కన్నీరు పెట్టించిన అపూర్వ అభినయంఇంత నాటకంలోనూ దాదాపుగా ద్వితీయార్ధమనిపించే చివరి గంట హైలైట్. మధ్యవయసు మండలి పాత్రను పోషించిన ‘గంగోత్రి’ సాయి అక్కడ నాటకాన్ని పూర్తిగా తన భుజాలపై నడిపించారని చెప్పక తప్పదు. తమిళ రాజకీయ నేత కామరాజ్‌ను తలపించే పొడుగు చేతుల హాఫ్ హ్యాండ్స్ ఖాదీ చొక్కా నుంచి హిట్లర్ మీసకట్టు, ఎడమ చేతితో పంచె చెరగును పట్టుకొని నడిచే నడక, నిరాడంబరమైన నడత, మాట తీరులో మార్దవం, మానవీయత... వీటన్నిటితో అక్షరాలా మండలి కృష్ణారావును అణువణువునా శరీరంలో ఆవాహన చేసుకొని ‘గంగోత్రి’ సాయి నటించారు. అందులోనూ, 1975 నాటి ‘తొలి ప్రపంచ తెలుగు మహాసభల’ నిర్వహణ – ప్రసంగ సందర్భం, అలాగే 1977 నాటి ప్రకృతి విలయతాండవ వేళ తల్లడిల్లిన ఆ మానవతా మూర్తి హృదయాన్ని రంగస్థలంపై అభినయించిన తీరు, నాటక పతాక సన్నివేశం లాంటివి మరీ ప్రత్యేకం. చిమ్మచీకటిలో టార్చిలైటు వేసుకొని, శవాల దిబ్బల మధ్య కొన ఊపిరితో కొట్టుకుంటున్న అభాగ్యుల కోసం మండలి వారు అన్వేషించే సన్నివేశం, కాళ్ళకు పుండ్లు అయినా కట్లు కట్టుకొని మరీ తిరుగాడే దృశ్యం లాంటివి ఎంతటివారినైనా కన్నీళ్ళు పెట్టించక మానవు. “మండలి వారి పాత్ర పోషించిన ‘గంగోత్రి’ సాయి కాళ్ళకు దణ్ణం పెట్టాలనుంది” అని కవి – గాయకుడు, తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ సభ్యుడు గోరటి వెంకన్న అన్నారంటే వేదికపై వెలిగిన అభినయ దీప్తిని అర్థం చేసుకోవచ్చు.జీవితపు చివరి క్షణాల ఘట్టంలో... ఇటు భార్యాబిడ్డలతోనూ, అటు ప్రజాక్షేమం కోసం రాజకీయ నాయకులతోనూ మండలి వారి పాత్ర సంభాషించే సందర్భం నాటకాన్ని మరో మెట్టు పైకి ఎక్కించింది. అటు రచయిత రచనా సామర్థ్యం, ఇటు ప్రధానపాత్రధారి అభినయ నైపుణ్యం... పరస్పరం పోటీ పడ్డాయి. ఒకటికొకటి జతకలసి, ప్రేక్షక హృదయాలను తడిపేశాయి. సాత్వికాభినయంతో, నెమ్మదిగానే అయినా స్థిరంగా సాగే సంభాషణా శైలితో, శాంత - కరుణ రసాలను ‘గంగోత్రి’ సాయి పండించిన తీరు ప్రేక్షకులు కళ్ళారా చూసి అనుభవించదగ్గ వైయక్తిక అనుభూతి. “అనేక సందర్భాల్లో ఈ నాటకం అప్రయత్నంగా కన్నీరు పెట్టించింది. ఇది మరిచిపోలేని అనుభవం” అని ప్రముఖ రంగస్థల – సినీ రచయిత తనికెళ్ళ భరణి లాంటి వారు అభిప్రాయపడింది అందుకే! ఒక రకంగా ఈ నాటక ప్రేక్షకులందరి సార్వజనీన అనుభవం కూడా అదే!!అక్షరాలా... అంతిమ పరమార్థంనిజాయతీ, నిరాడంబరత, నిస్వార్థం, కార్యదీక్ష, ప్రజాసంక్షేమమే పరమావధి తదితర సుగుణాలు రాశి పోసిన ఇలాంటి నాయకుల జీవితాలు వర్తమాన సమాజానికీ, సందర్భానికీ అత్యంత అవసరం. ఆ ఉద్దేశంతోనే ఈ నాటకాన్ని సొంత ఖర్చుతో డాక్యుమెంటరీగా చిత్రీకరించడానికి మాజీ ఎమ్మెల్యే వి. ప్రభాకర చౌదరి ముందుకు వస్తానన్నది. మరో అడుగు ముందుకేసి, “ఈ ప్రదర్శనను నేటి తరం రాజకీయ నాయకులు చూసేలా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శాసన సభ, శాసన పరిషత్తుల్లో ఈ నాటకాన్ని ప్రదర్శించాలి. ఈ నాటకం చూసి కనీసం 20 మంది రాజకీయ నాయకులు మారినా ఈ దేశం బాగుపడుతుంది" అని దర్శకుడు శివనాగేశ్వరరావు అన్న మాటలు ఆలోచించాల్సినవి. తప్పకుండా ఆచరించి తీరాల్సినవి. ఇప్పటికే అవనిగడ్డలో మొదలుపెట్టి విశాఖపట్నం మీదుగా ముచ్చటగా మూడో ప్రయత్నంగా హైదరాబాద్‌లో అలరించిన ‘మహాపురుషుడు... మండలి’ లాంటి రచన, ప్రదర్శనల అంతిమ పరమార్థం అదే కదా!- రెంటాల జయదేవ -
బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు..
ఈర్ష్య, అసూయ, ద్వేషం – ఈ మూడు దుర్గుణాలు మూర్తీభవించినవాడు చలమ దీప్తుడు. తానే పెద్ద తత్వవేత్తననీ, తనకంటే గొప్ప ప్రబోధకుడు ఎవరూ లేరని, తాను గురువులకే గురువని భ్రమించేవాడు. ఇతరుల్ని ఎవ్వరినీ గౌరవించేవాడు కాదు. అతని శిష్యుడు అహితుడు అన్నింటా గురువుని మించిన శిష్యుడే! రాజగృహ నగరానికి ఉత్తర దిక్కులో ఉన్న ఒక పర్వతంపై అతని నివాసం. తనకంటే బుద్ధునికి ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలగడం అతనిలో కోపాన్ని పెంచింది. కుటిలత్వాన్ని రేపింది. బుద్ధుణ్ణి ఇబ్బందుల పాలు చేయాలనీ, అపకీర్తి కలిగించాలనీ పథకం వేశాడు. అలా చేస్తే తనకు అధిక గౌరవ మర్యాదలు కలుగుతాయని నమ్మాడు. వెంటనే తన ప్రియ శిష్యుడు అహితుణ్ణి పిలిచి, తన మనస్సులోని పథకాన్ని చెప్పాడు. అహితుడు అందుకు అంగీకరించి, నగరంలోకి నడిచాడు. ఆరోజు ఒక రాజపురోహితుడు బుద్ధునికీ, బుద్ధ సంఘానికీ ఆతిథ్యం ఇచ్చాడు. బుద్ధుడు భిక్ష స్వీకరించాక ధర్మోపదేశంప్రారంభించాడు. ఆ సమయానికి అహితుడు అక్కడికి చేరాడు. ఉపదేశానంతరం బుద్ధునికి నమస్కరించి‘‘భగవాన్! నన్నూ మీ భిక్షుసంఘంలో చేర్చుకోండి’’ అని వేడుకున్నాడు. బుద్ధుడు అంగీకరించాడు. కొన్నాళ్ళు గడిచింది. ఒకరోజు బుద్ధుడు తన భిక్షుసంఘంతో కలసి నగరంలో భిక్షార్థం బయలు దేరాడు. తన భిక్షా పాత్రను తీసుకోవడానికి చేశాడు. అది కనిపించలేదు. ఆరామం బయట ద్వారం దగ్గర నిలబడిన అహితుడు అటూ ఇటూ చూస్తూ–‘‘భగవాన్! మీ భిక్షాపాత్ర కోసం నేను వెదకనా?’’ అని అడిగి ఆరామం నలుమూలలా చూశాడు. బుద్ధుడు అతని వంక చూసి, చిరునవ్వు నవ్వాడు.‘‘అహితా! వెదకనవసరం లేదు. పద’’ అంటూ బయటకు నడచాడు. బుద్ధుని వెనకే అహితుడు నడచాడు. భిక్షు సంఘం రాజగృహ నగరానికి వెళ్ళే దారిలో ఒక తటాకం ఉంది. బుద్ధుడు ఆ తటాకం వైపు నడచాడు. అది చూసి అహితుడు. ‘నేను ఆ భిక్షాపాత్రను, పగులగొట్టి, ఈ తటాకంలో పడవేసిన విషయం బుద్ధునికి తెలిసింది’ అని భయపడ్డాడు. బుద్ధుడు తటాకం లో దిగి విశాలమైన తామరాకుని తుంచి, దాన్ని, శుభ్రపరిచాడు. దాని అంచులు గిన్నెలా మలిచాడు. ఆరోజు బుద్ధుని భిక్షాపాత్ర అది! మరో రెండు రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి బుద్ధుడు పడుకోడానికి తన సంఘాటి (దుప్పటి) కోసం చూశాడు. అది కనిపించలేదు. బుద్ధుడు అలా వెదకడం గమనిస్తూనే, లోలోపల నవ్వుకుంటున్నాడు అహితుడు. అంతలో... ‘‘అహితా!’’ అనే బుద్ధుని పిలుపు విని ఉలిక్కిపడ్డాడు అహితుడు. ‘‘భగవాన్! సెలవియ్యండి’’ అన్నాడు అతివినయం గా ‘‘నీకు సంఘాటి ఉందిగా’’ అని అడిగాడు. ‘‘భగవాన్! ఉంది’’ ‘‘నీవు పక్క పరుచుకొని పడుకో’’ అని, నేలను శుభ్రం చేసుకుని, తన చీవరాన్ని పక్కగా పరచుకుని బుద్ధుడు పడుకున్నాడు. ఆ రాత్రి బుద్ధునితో సహా భిక్షువులందరూ హాయిగా నిద్ర΄ోయారు. అహితునికి కంటిమీద కునుకే రాలేదు. వేకువ కాకముందే లేచి, తన గురువు చలమదీప్తుని దగ్గరకు వెళ్లి చేరాడు. తెల్లారింది. ‘‘అహితుడు ఏమయ్యాడు?’’అని అందరూ ఆలోచించసాగారు. ఇంతలో... ‘‘అదిగో... అటు చూడండి. అహిత భిక్షు ఎవరినో తీసుకుని వస్తున్నాడు అన్నాడు ఒక భిక్షువు. అహితుడు తన గురువును వెంటబెట్టుకుని వచ్చాడు. ఇద్దరూ బుద్ధుని పాదాలకు నమస్కరించారు.‘‘భగవాన్! మీ మీద క్రోధంతో, అసూయ తో వచ్చాను. మీ భిక్షాపాత్ర నేనే పగులగొట్టాను. మీ సంఘాటిని తుప్పల్లో దాచాను. ఆ విషయం మీరు గ్రహించారు. అయినా నన్ను మందలించలేదు. అందరిముందు అవమానం చేయలేదు. ఈ పనులు చేసిన రెండుసార్లూ నేను నిద్రకు దూరమయ్యాను. మనశ్శాంతి కోల్పోయాను. తప్పు తెలుసుకున్నాను. ద్వేషం కంటే ప్రేమ గొప్పదని తెలుసుకున్నాను. వెళ్ళి మా గురువు గారికి విషయం చెప్పాను. మేమిద్దరం తప్పు తెలుసుకున్నాం. మీ శరణు వేడుకుంటున్నాం’’ అన్నాడు అహితుడు. బుద్ధుడు ప్రేమతో వారిని దగ్గరకు పిలిచి భిక్షు దీక్ష ఇచ్చాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: స్నాతక పాఠం అంటే..? -
వీడుతున్న వాహబంధం
వారిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అందరి అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఏడాది తిరిగేసిరికి మగబిడ్డ జన్మించాడు. తొలుచూరు కాన్పులోనే తమ వంశానికి వారసుడు వచ్చాడని అందరూ వేడుకలు జరుపుకున్నారు. చూస్తుండగానే పిల్లాడికి మూడేళ్లు నిండాయి. బడికి పంపించే ముందు ఏ గుడిలోనో అక్షరాభ్యాసం చేయించడం ఆనవాయితీ కదా! ఇంటివద్దనే అక్షరాభ్యాసం చేయిద్దామని ఇంట్లో నిర్ణయించగా, అమ్మమ్మ తాతయ్యలు బాసర సరస్వతీ దేవాలయంలో అక్షర శ్రీకారం చేయించాలని పట్టుబట్టారు. భర్త అలా కాదన్నందుకు ‘మా పుట్టింటివారు చెప్పినట్లు చేయకుండా ఎదురు మాట్లాడతావా’ అంటూ ఒకరికొకరు గొడవపడ్డారు. మా వాళ్లను గౌరవించని ఇంట్లో క్షణం కూడా ఉండనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమె ఏకంగా విడాకులు కావాలంటూ కోర్టులో కేసు వేసింది. ఇలా చిన్న చిన్న కారణాలకే వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్న తీరు ఇటీవల కాలంలో పెరిగిపోతోంది. కరీంనగర్‌లీగల్: ‘మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్’ అంటారు పెద్దలు. అంటే పెళ్లిల్లు స్వర్గంలోనే నిర్ణయించబడుతాయని పెద్దల నమ్మకం. కలిసి మెలిసి ఉండి మాంగళ్య బంధాన్ని ఆనందమయం చేసుకోవాల్సిన దంపతులు తృణప్రాయంగా వివాహ బంధాలను తెంచేసుకుంటున్నారు. చిన్న చిన్న కారణాలు, అర్థంలేని పట్టుంపులు కుటుంబ తగాదాలతో పాటు వివిధ కారణాలతో విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీరిలో ఎక్కువగా విడాకులు, భరణం ఇప్పించాలని కోర్టుకు వస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2013 నుంచి ఇప్పటివరకు 776 మంది విడాకులు, భరణం కావాలని కోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రస్తుతం 81 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్దుబాటు ధోరణి లేకనే... భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు చినికి చినికి వానగాలిగా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను పంతాలు, పట్టింపులకుపోయి పెద్దవి చేసుకొని విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తూ వీధులకు ఎక్కుతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకుంటున్న జంటలు భావోద్వేగాల వలలో చిక్కి విడిపోయేందుకు సిద్ధమవుతూ పచ్చని కాపురాలను ముక్కలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఏటేటా విడాకులు కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రేమించుకొని ఇరువురి కుటంబ పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్న వారు, పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటైన దంపతులైనా సర్దుబాటు ధోరణి లేక వివాహ బంధాన్ని వీడటానికి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. చిన్నపాటి గొడవలను పట్టింపులకు పోయి కాపురాలను కూల్చుకుంటున్నారు. దంపతులిద్దరు అవగాహన లోపంతో విడాకులు తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు పిల్లలు ఏమైపోతారో అని వారికి జన్మించిన సంతానం గురించి ఏ కోశానా ఆలోచించడం లేదు. విడాకులు అనే మాట వింటేనే అదోలా చూసే సమాజంలో ఇపుడు ఆ పదం సాధారణమైపోయింది. 2013 నుంచి ఇప్పటివరకు భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకులు, భరణం వంటివి కోరుతూ ఫ్యామిలీ కోర్టులో 776 మంది కేసులు వేశారు. ఈ కేసులను ఎప్పటికపుడు కేసులు పరిష్కరించగా.. ప్రస్తుతం కోర్టులో 181 కేసులు నడుస్తున్నాయి. విడాకులకు దారితీస్తున్న కారణాలు తను చెప్పిన మాటను గౌరవించాలని ఇద్దరు పట్టింపులకు పోవడం. అత్యసవర వేళల్లో తల్లి దండ్రులకు డబ్బులు పంపడాన్ని అదేదో పెద్దనేరం అన్నట్లుగా భర్త, అత్తింటివారి నుంచి సూటిపోటి మాటలు తాను సంపాదించిన డబ్బును తానే పొదుపు చేసుకుంటానని చెప్పడం. అత్తమామలు, ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండననే భావన ఈతరం గృహిణిల్లో ఉండటం, ఈ కారణంగా ఇతర పట్టింపులు పండగలు, వేడుకల్లో తమ వారిని పట్టించుకోలేదని భార్యాభర్తలు గొడవలు పడటం. పండగల సమయాల్లో పుట్టింటికి వెళ్లవద్దని భార్యను అడ్డుకుంటూ పట్టుబట్టడం పుట్టిన పుల్లలకు పెట్టే పేరు నుంచి వారిని చేర్పించే స్కూలు ఎంపిక విషయంలోనూ తగాదాలు ఉద్యోగం చేసే భార్య బ్యాంక్ పాస్‌బుక్, ఏటీఎం వంటివి తన వద్దనే ఉండాలని భర్త వేధించడం ఫలితమివ్వని కౌన్సెలింగ్ మనస్పర్థలతో విడాకులు కోరు తూ కేసులు వేస్తున్న వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తుంటారు. అయితే కౌన్సెలింగ్‌కు హాజరైన వారు కలిసి ఉంటా మని చెప్పి వారం తిరగకముందే గొడవలు పడుతున్నారు. దీంతో ఇరువర్గాలకు రెండు మూడుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం ఉండటం లేదు. కౌన్సెలింగ్ కేంద్రాల్లో మహిళల పక్షాన మాత్రమే ఆలోచించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపణలు ఉంటున్నాయి. దీంతో కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ కొంతకాలానికి కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. -
అత్త లేని కోడలు... ఉత్తమురాలే!
ఏడుగురు మగవాళ్లు ఉండే ఇల్లు అది. తాత... తండ్రి... ఐదుగురు కొడుకులు. పెద్ద కొడుకు భార్య వల్ల వచ్చిన సమస్యలతో మనసు వికలమైన తండ్రి... తన ఇంటి మీద ఎప్పటికీ ఆడనీడ పడకూడదనుకుంటాడు. ఇక ఎవ్వరినీ పెళ్లి గురించి ఆలోచించవద్దంటాడు. కానీ రెండో కొడుకైన హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. తండ్రికిష్టం లేక పోయినా ఎలాగో పెళ్లాడి భార్యను ఇంటికి తీసుకొస్తాడు. అత్త కూడా లేని ఆ ఇంటికి తను అమ్మ అవుతుంది హీరోయిన్. అందరికీ సేవలు చేస్తుంది. అందరి మనసుల్లోనూ స్థానం సంపాదిస్తుంది. కానీ ఆమెలా మరొకరు ఉండరు కాబట్టి ఇంకెవరికీ పెళ్లిళ్లు చేయనంటాడు తండ్రి. అయినా మిగతావాళ్లూ ప్రేమలో పడతారు. వాళ్లందరికీ ఆ కోడలు ఎలా పెళ్లిళ్లు చేసింది, బావగారి కాపురాన్ని ఎలా చక్కదిద్దింది, సమస్యలన్నీ ఎలా పరిష్కరించింది అనేది ‘సాస్ బినా ససురాల్’ సీరియల్లోని మిగతా కథ. ఈ సీరియల్ ఇటీవలే ‘అత్త లేని కోడలు ఉత్తమురాలు’గా తెలుగులో మొదలైంది. చక్కని కుటుంబ కథనాలను మనవాళ్లు ఎంతో ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా వాళ్ల మనసులను గెలుచుకునే అవకాశమూ ఉంది. మరీ ముఖ్యంగా ఆదర్శనీయంగా ఉండే హీరోయిన్ పాత్ర అందరికీ నచ్చి తీరుతుంది.


