సమాన పనికి సమాన వేతనమివ్వాల్సిందే
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆవేదన
30న కలెక్టరేట్ ముట్టడికి పిలుపు
తిరుపతి ఎడ్యుకేషన్ : రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి నడుం బిగించారు. దశాబ్దాలుగా వెట్టిచాకిరీ చేస్తున్నా ఏ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్న బాధతో రగిలిపోతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా పనిచేస్తున్నప్పటికీ వారికిచ్చే వేతనంలో పావు వంతు సైతం తమకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి ఎన్ని దఫాలుగా వేడుకుంటున్నా పెడచెవి పెట్టడం బాధాకరమంటున్నారు. ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూటమి ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా. తమ న్యాయమైన సమస్యల పరిష్కారినికి ఉద్యమం ఒక్కటే శరణ్యమని పేర్కొంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వానికి గుర్తు చేయాలని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
జిల్లా వ్యాప్తంగా 20 వేల మంది
తిరుపతి జిల్లా వ్యాప్తంగా యూనివర్సిటీలు, విద్యాసంస్థలు, ఎస్‌ఎస్‌ఏ, అటవీ, టూరిజం, ఆస్పత్రులు, టీటీడీ, ఈఎస్‌ఐ వంటి రంగాల్లో సుమారు 20 వేల మందికిపైగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది 20 నుంచి 30 ఏళ్ల సీనియారిటీ కలిగి ఉన్నారు. ఎప్పటికై నా రెగ్యులర్ కాకపోతామన్న ఆశతో అప్పటి నుంచి చాలీచాలని వేతనంతో ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబానికి లాక్కొస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదంటూ నిట్టూరుస్తున్నారు.
30న కలెక్టరేట్ ముట్టడి
ఎన్ని మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఈ నెల 30వ తేదీన కలెక్టరేట్ ముట్టడికి శ్రీకారం చుట్టారు. సీఐటీయూ అనుబంధమైన ఏపి రాష్ట్ర కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమ బాట కొనసాగించనున్నట్లు చెబుతున్నారు.
ఎన్నికల హామీని నెరవేర్చాలి
డిమాండ్లు ఇవే
సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, కనీస వేతనంగా రూ.26వేలు చెల్లించాలి. హెచ్‌ఆర్ పాలసీని అమలుచేయాలి. రెగ్యులరైజ్ చేయాలి కానిపక్షంలో మినిమం టైం స్కేలును వర్తింపజేయాలి. ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో పాటు పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించాలి. ఉద్యోగ భద్రతతో పాటు పెన్షన్, ఈఎస్‌ఐ, పీఎఫ్, ఈసీఐ సదుపాయాలను కల్పించాలి. తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. డీఎస్సీ, ప్రభుత్వ రెగ్యులర్ పోస్టుల నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలి. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలుచేయాలి.
ఎన్నికల హామీని నెరవేర్చండి
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తామని హామీలిచ్చింది. యువగళం పాదయాత్రంలో నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన వెంటనే సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత, రెగ్యులర్ కానిపక్షంలో మినిమమ్ టైం స్కేలు వంటి పలు సమస్యల పరిష్కారినికి హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా తమ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. పలుమార్లు సీఎంకు, విద్యాశాఖమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలువురు మండిపడుతున్నారు.


