టీటీడీకి రూ.10 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

టీటీడీకి రూ.10 లక్షల విరాళం

Jul 29 2026 2:16 AM | Updated on Jul 29 2026 2:16 AM

తిరుమల: హైదరాబాద్‌కు చెందిన వెంకటగణేష్‌ గంగాధర్‌ దాసిక అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.

1న అండర్‌–17 టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ జిల్లా జట్ల ఎంపిక

తిరుపతి ఎడ్యుకేషన్‌ : తిరుపతి జిల్లా టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ అండర్‌–17 బాలబాలికల జట్లను ఆగస్టు 1వ తేదీ ఎంపిక చేయనున్నారు. ఆ మేరకు తిరుపతి జిల్లా టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి బి.మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక పోటీలను తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటు క్రీడా మైదానంలో ఉదయం 9 నుంచి 11గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు 2009, జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న జట్టు ఆగస్టు 8, 9 తేదీల్లో బాపట్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 94902 52821 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.

యువతకు

ఉచిత డిజిటల్‌ నైపుణ్య శిక్షణ

తిరుపతి కల్చరల్‌: ప్రభుత్వ యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నాన్‌కమ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ప్రైమ్‌ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని యువతకు ఆదునిక డిజిటల్‌ నైపుణ్యం కల్పిస్తున్నట్లు సెట్వెన్‌ సీఈవో డాక్టర్‌ పి.యశ్వంత్‌ తెలిపారు. డిజిటల్‌ నైపుణ్యాలతో పరిశ్రమలకు సిద్ధమైన యువత ‘లక్షల మంది యుత మిషన్‌’ లక్ష్యంతో 2026–27 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షమంది యువతకు శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేధస్సు(ఏ1) , సైబర్‌ భద్రత, డేటా విశ్లేషణ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, అభివృద్ధి చెందుతున్న సాంకేతికలు వంటి ఆధునిక కోర్సుల్లో శిక్షణ కల్పిస్తున్నట్టు వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణతో పాటు సర్టిఫికేషన్లు, ఇంటర్నషిప్‌లు, ఉపాధి అవకాశాలకు కల్పిస్తామని తెలిపారు. 17 ఏళ్లు నిండిన యువత కార్యక్రమంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు తమ సమీపంలోని జిల్లా ఎస్‌ఎస్‌టీఈపీ కార్యాలయం, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు లేదా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

గాయపడిన

యువకుడి మృతి

చంద్రగిరి: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 24వ తేదీన అగరాల సమీపంలోని పెట్రోల్‌ బంకు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, చంద్రగిరి బీడీ కాలనీకు చెందిన సయ్యద్‌ బాషా(21) తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో క్షతగాత్రుడిని తిరుపతి రుయాకు తరలించారు. అయితే సయ్యద్‌ బాషా ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు చైన్నెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్సను అందించారు. ఈ నేపథ్యంలో అక్కడ సయ్యద్‌ బాషా మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, మూడు నెలల కుమారుడు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

దాసుకుప్పంలో చోరీ

సత్యవేడు: సత్యవేడు పంచాయతీలో నివసిస్తున్న వెంకటేశ్‌ ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. విధుల నిమిత్తం టీవీఎస్‌ కంపెనీకి వెళ్లాడు. బీరువా పగులగొట్టి 20 గ్రాముల బంగారం దోచుకెళ్లారు. సమీపంలోని మరో దుకాణం షటర్‌ పగుల గొట్టేందుకు ప్రయత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సాయినాథ్‌చౌదరి తెలిపారు.

కాలువలో మహిళ మృతదేహం

చంద్రగిరి: కాలువలో వివస్త్రగా మహిళ మృతి చెంది ఉండడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని మహిళ నూర్‌ జంక్షన్‌ బ్రిడ్జి సమీపంలోని కాలువలో వివస్త్రగా మృతి చెందింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. అయితే మహిళపై లైంగికదాడి చేసి కాలువులో పడేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement