తిరుపతిలో మూడు వైద్యకళాశాలల్లో ఫుడ్ పాయిజనింగ్
ఎస్వీ ఆయుర్వేద కాలేజీలో 28 మందికి..
స్విమ్స్, పద్మావతి వైద్య కళాశాలల్లో 50 మందికిపైగా..
వాంతులు, విరేచనాలతో బాధపడిన విద్యార్థులు
తిరుపతి తుడా: తిరుపతిలో మూడు వైద్యకళాశాల్లో ఆహారం కలు షితం కావడంతో 78 మందికిపైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, శ్రీవేంకటేశ్వర వైద్యకళాశాల (స్విమ్స్), శ్రీ పద్మావతి మహిళా వైద్యకళాశాలలో విద్యార్థులు సోమవారం అర్ధరాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో అస్వస్థులయ్యారు. ఈ మూడు కాలేజీల్లోని విద్యార్థులకు స్విమ్స్‌లోని సెంట్రల్ క్యాంటీన్ నుంచి ఆహారం సరఫరా అవుతుంది. సోమవారం మధ్యాహ్నం ఆకుకూర పప్పు వడ్డించిన క్యాంటీన్ నిర్వాహకులు రాత్రిపూట కూడా అదే వడ్డించారు.
ఆకుకూరను సరిగా శుభ్రపరచకుండా వండారని, మధ్యాహ్నం వండినదాన్నే రాత్రికి కూడా పెట్టటంతో అప్పటికే కలుషితమైన దాన్ని తిని తమకు వాంతులు, విరేచనాలు అయ్యాయని పలువురు విద్యార్థులు తెలిపారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో 20 మంది విద్యారి్థనులు, ఎనిమిది మంది విద్యార్థులు.. మొత్తం 28 మంది అస్వస్థులయ్యారు. స్విమ్స్, శ్రీ పద్మావతి కళాశాలల్లో 50 మందికిపైగా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు.ఆయుర్వేద విద్యార్థుల్లో 17 మందిని అంబులెన్స్‌లో టీటీడీ సెంట్రల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు.
చికిత్స పొందుతున్నవారిని టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ అవడంతో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండడంతో తిరిగి వసతిగృహాలకు పంపించినట్లు తెలిపారు. స్విమ్స్, పద్మావతి కాలేజీల్లో అస్వస్థులైనవారికి పద్మావతి ఆస్పత్రిలో గోప్యంగా వైద్యం అందించినట్లు తెలిసింది.
అబ్బే అదేం లేదు.. ముగ్గురే అస్వస్థులయ్యారు..
స్విమ్స్, పద్మావతి విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు నిరాధారమని స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్విమ్స్ హాస్టల్లో మొత్తం 1,147 మంది వైద్యవిద్యార్థులు ఉన్నారని తెలిపారు. 27వ తేదీ రాత్రి సమయంలో ఎంబీబీఎస్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. విద్యార్థులు అస్వస్థులయ్యారని అంగీకరిస్తూనే.. ఫుడ్ పాయిజనింగ్ అయిందనటం సరికాదని ఆయన పేర్కొనడం గమనార్హం. మరోవైపు స్విమ్స్, పద్మావతి కాలేజీల్లో 70 మందికి పైనే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారని స్విమ్స్ వర్గాలు తెలిపాయి.


