ఇప్పటి వరకు 10 లక్షల ఎకరాల్లో సాగుకు విఘాతం
వ్యవసాయ అనుబంధ శాఖలపై సమీక్షలో సీఎంతో అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్రమంతా తీవ్ర కరువు ముంచుకొచ్చిందని, ఇప్పటివరకు పదిలక్షల ఎకరాల్లో సాగుకు విఘాతం కలిగిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మంగళవారం సచివాలయంలో కరువు పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో రాష్ట్రంలోని పరిస్థితుల గురించి సీఎంకు వారు వివరించారు. ఎల్‌నినో వల్ల ఊహించినదానికంటే అధికంగా నష్టం జరగనుందని పేర్కొన్నారు. కరువు నేపథ్యంలో ఆగస్టు 3 నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
వచ్చే మూడునెలల్లో 40 శాతం లోటు వర్షపాతం
అధికారులు మాట్లాడుతూ జూలై నెలలో 69 శాతం లోటు వర్షపాతం నమోదైందని, వచ్చే 3 నెలల్లో సరాసరి 35 నుంచి 40 శాత మేర లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని సీఎంకు చెప్పారు. జూన్ – నవంబర్ మధ్య 844 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 551 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రభావం కన్పిస్తోందన్నారు. ఇప్పటికే దాదాపు 6.95 లక్షల ఎకరాల్లో పత్తి 2.68 లక్షల ఎకరాల్లో వరిపై, మొత్తం పది లక్షల ఎకరాలపై కరువు ప్రభావం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 15.90 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలకు రైతులు బీమా చేయించుకున్నారని వివరించారు.
బీమా నమోదు చేయించే బాధ్యత కలెక్టర్లదే
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కరువు పరిస్థితులను సవాల్‌గా తీసుకుని అధికారయంత్రాంగం పనిచేయాలన్నారు. ప్రతిపంటకూ బీమా నమోదు చేయించే బాధ్యత కలెక్టర్లదేనని పేర్కొన్నారు. తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని పేర్కొన్నారు. కరువు తీవ్రతను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని చెప్పారు.
మంత్రి మొదలుకుని అధికార యంత్రాంగం మొత్తం క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రజల్లోనే ఉండాలని పేర్కొన్నారు. ధరలు పెరగకుండా చర్యలు చేపట్టాలని, మొబైల్ రైతు బజార్లను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
విజయవాడ, గుంటూరుతో కలిపి రాజధానిగా చూడాలి
రాజధాని నిర్మాణ పనుల సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి అంటే కేవలం 29 గ్రామాల సమాహారంగా కాకుండా విజయవాడ, గుంటూరుతో కలిపి చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారు. అందుకనుగుణంగా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల ప్రాజెక్ట్ పనులు జరగాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో మంగళవారం రాజధాని నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని, నిర్దేశించిన సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. 95 ప్రాజెక్టులకు సంబంధించి రూ.50,999 కోట్ల విలువైన పనులు చేపట్టామని, నెలకు కనీసం 7.92 శాతం పనులు పూర్తి చేయాలని సూచించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు, డిజైన్లు వంటి అంశాల్లో అన్ని శాఖలు, ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.


