బలవంతంగా లాక్కోవద్దు | Demands of intellectuals and farmers in land acquisition awareness program | Sakshi
Sakshi News home page

బలవంతంగా లాక్కోవద్దు

Jul 29 2026 5:44 AM | Updated on Jul 29 2026 5:44 AM

Demands of intellectuals and farmers in land acquisition awareness program

సమావేశంలో మాట్లాడుతున్న విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ హితవు 

రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన భూముల్లో ఏం అభివృద్ది చేశారు? 

రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు ఎక్కడిచ్చారు? 

పర్యావరణంపై పడుతున్న ప్రభావానికి మీ సమాధానమేంటి? 

బీడు భూములు ఉన్నాయో లేదో ముందు చూడాలి 

భూముల్లో అభివృద్ధి జరిగే వరకూ వ్యవసాయం చేసుకోనివ్వాలి 

రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలి 

భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి 

భూసేకరణ అవగాహనా కార్యక్రమంలో మేధావులు, రైతుల డిమాండ్‌ 

సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంత రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించవద్దని,  ఇప్పటికే సేకరించిన భూముల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత న్యాయ­మూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. రాజధాని ప్రాంతంలోని  ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, యర్రబాలెం గ్రామాల్లో భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతుల విజ్ఞప్తి మేరకు జస్టిస్‌ చంద్రకుమార్‌ నేతృత్వంలోని ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక కన్వీనర్‌ డా.యెరసూరి మహాదేవ్, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సి.రామచంద్రయ్య, సామాజిక కార్యకర్త డా.వసుంధర కుర్రా బృందం ఇటీవల ఆయా గ్రామాల్లో పర్యటించింది. రైతులతో మాట్లాడి వారు పలు అంశాలను తెలుసుకున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో ‘బలవంతపు భూ సేకరణ–చట్టపరమైన అంశాలు’పై విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం  వారు విలేకరులతో మాట్లాడారు. వారేమన్నారంటే..

సామాజిక, పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాలి– జస్టిస్‌ చంద్రకుమార్
రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన భూముల్లో ఏం అభివృద్ది చేశారని ప్రశ్నభూసేకరణకు ముందు సామాజిక,  పర్యావరణం, రైతులు, వ్యవసాయ కార్మికులపై చూపే ప్రభావంపై అంచనా చేపట్టాలి. ఎంత అవసరమో అంతవరకే భూములు తీసుకోవాలి. రైతులకు ప్రత్యామ్నాయ స్థలాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి. బీడు, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించకుండా పంట భూములను తీసుకోకూడదు. నష్టపరిహారం ఇస్తున్నా­మనే కారణంతో రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం సరికాదు. 

ఇప్పటికే రైతుల నుంచి తీసుకున్న భూముల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు వ్యవసాయం చేసుకునేందుకు అనుమతించాలి. రైతులకు ఇచ్చే కమర్షియల్, ఇళ్ల స్థలాల విలువ వారి భూమి ప్రస్తుత మార్కెట్‌ విలువకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. భూములు ఇవ్వడానికి అంగీకరించని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదు. రైతులు తమ డిమాండ్ల సాధన కోసం గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఉద్యమించాలి. ఇందుకోసం రైతు సంక్షేమ సమితిని ఏర్పాటు చేసుకోవాలి.

న్యాయం కోసం సాయం చేయండి
కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగా సెల్ఫీ వీడియో తీసి, ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్‌ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరావు (ఎ­మ్మా­ర్పీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు) జస్టిస్‌ చంద్రకుమార్‌­ను ప్రెస్‌క్లబ్‌లో కలిశారు. తన కుమారుడికి జరి­గిన దారుణాన్ని ఆయనకు వివరించారు. తమ­కు న్యాయం చేసేందుకు అండగా నిలవాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు.

ఇష్టానుసారం భూములు లాక్కుంటే కుదరదు– డా.యెరసూరి మహాదేవ్‌
రైతుల నుంచి ఇష్టానుసారం భూములు లాక్కుంటే కుదరదని పలు కేసుల్లో సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. రైతులకు కారణాలు, ప్రజా ప్రయోజనాలను వివరించిన తరువాత వారు అంగీకరిస్తేనే పరిహారం చెల్లించి తీసుకోవాలి. కానీ ఏపీలో అలా జరగడం లేదు. రైతుల భూముల విలువను సైతం తగ్గించి చూపిస్తున్నారు. రైతులకు బిక్ష వేస్తామంటే కుదరదు. ఆ ప్రాంతంలో అత్యధికంగా ఉన్న ధరను చెల్లించాల్సిందే.

సర్వనాశనం అవుతారు – రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ సి.రామచంద్రయ్య  
అమరావతి ప్రాంతంలో భూ సేకరణ పేరుతో రైతులను ఎన్ని విధాలుగా ఒత్తిళ్లకు గురి చేస్తున్నారనేది చాలా ఏళ్లుగా చూస్తున్నాం. వ్యవసాయం మీద ఆధారపడ్డ వారు భూములు లేకపోతే ఏం చేస్తారు. వారు అక్కడ నివశించే అవకాశం కూడా లేకుండా, విద్యుత్, తాగునీటి సరఫరా నిలిపివే­స్తున్నారు. సామాజిక ప్రభావంపైనే కాకుండా పర్యావరణ ప్రభావం పైనా ఎలాంటి సర్వే చేయ­లేదు. తనకుతానే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసేసు­కుంది. చేతికొచ్చిన పంటను నోటికందకుండా బుల్డోజర్లతో నాశనం చేసి, బలవంతంగా భూములు లాక్కుంటే, ప్రకృతి చూస్తూ ఊరుకోదు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు సర్వనాశనం అవుతారు.

రైతుల బాధలు వర్ణనాతీతం – సామాజిక కార్యకర్త డా.వసుంధర కుర్రా
రాజధాని ప్రాంతంలో మా బృందం పర్యటించింది. అక్కడి రైతులకు జరుగుతున్న అన్యాయాలు వింటుంటే చాలా బాధ కలిగింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయి. అందుకే కొత్తగా ఇచ్చేందుకు భయపడిపోతున్నారు. భూ సేకరణలో ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు ముందుగా నోటీసులు ఇవ్వడం, వారి అభిప్రాయాలను స్వీకరించడం, ప్రజా ప్రయోజనాన్ని స్పష్టం చేయడం, న్యాయమైన పరిహారం నిర్ణయించడం వంటి ప్రక్రియలను అమలు చేయాలి.

హడావిడిగా రాజధాని కట్టేయలేరు – గుంటక ఉజ్వల్‌ కుమార్‌రెడ్డి, ఉండవల్లి రైతు
హైదరాబాద్‌ ఒక్క రోజులో నిర్మాణం కాలేదు. అదే విధంగా అమరావతికి కూడా సమయం పడుతుంది. కానీ ఐదేళ్లలోనే కట్టేయాలనుకుంటూ హడావిడిగా భూములు లాక్కుంటున్నారు. అలా కట్టినా కూడా అది ఎక్కువ కాలం నిలబడదు. రాజధాని ప్రాంతంలో మూడు రిజర్వాయర్లు తవ్వారు. బ్యాక్‌ వాటర్‌ వస్తోంది. వాటిలో కాలుజారి మునిగిపోయిన వారెందరో. హుస్సేన్‌ సాగర్‌లా కృష్ణానదిని కూడా కలుషితం చేసేస్తారా? అమరావతి ప్రజారాజధాని అంటున్నారు కాబట్టి భవిష్యత్తులో భూముల విలువ పెరిగితే రైతులకు ఇస్తారా?. ఇలాగే చేస్తే రాబోయే తరం భవిష్యత్తు నాశనం అవుతుంది. 

నిపుణుల కమిటీ నివేదికనుపట్టించుకోలేదు – వెంకటరెడ్డి, తాడేపల్లి రైతు
రాజధాని నిర్మాణానికి సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పాలకపక్షం పట్టించుకోలేదు. రాజధాని ఎక్కడ పెట్టాలనేది అందరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయించారు. ప్రపంచంలోనే ఎక్కడా ఇన్ని వేల ఎకరాల భూములు తీసుకున్నట్లు నేను ఇంత వరకూ చూడలేదు. 5 వేల ఎకరాల్లో అభివృద్ధి చేసి ఉంటే సరిపోయేది. రైతులకు ఇచ్చే కౌలు ఏమాత్రం సరిపోదు. రైతుల బాధలు వర్ణనాతీతం. భవిష్యత్తులో ఆహార ధాన్యాల కొరత రాకుండా ప్రభుత్వం పరిరక్షించాలి. రాజధాని ప్రాంతంలో ఇకపై పంట భూములను తీసుకోకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement