చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం చాలా వాటిని కోల్పోయేలా చేస్తుంది. కానీ ఆమె విషయంలో అలా కాదు..ఆ విషాదం పట్టుదల, సహనం వంటి వాటిని అందించి..తన కలల మార్గంలో దూసుకుపోయేలా చేసింది. అదే ఆమెపూ దేశసేవ వైపు నడిపించి ఏ మహిళ చేయని సాహసాలకు పురొకొల్పింది. పైగా మంచుతో కూడిన అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో అడుగుపెట్టిన మహిళా సైనికురాలిగా ఘనత సృష్టించింది. ఆ లేడి సింగం ఎవరంటే..
ఆ మహిళే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కెప్టెన్ శివ చౌహాన్. ఆమె తండ్రి మరణించినప్పుడు శివ వయసు కేవలం 11 ఏళ్లు. ఇంటి పెద్దదిక్కుని కోల్పోవడంతో కుటుంబం ఆర్థికంగా, మానసికంగా ఎన్నో కష్టాలు ఎదుర్కోవల్సి వచ్చింది. ఆమె తల్లి కుటుంబానికి అండగా నిలవడమే గాక..ఎలాంటి పరిస్థితుల్లోనైనా..ఇద్దరు కుమార్తెలను పాఠశాల చదువుకు దూరం చేయకుండా బాధ్యత తీసుకుందామె.
పరిస్థితులు కఠినంగా మారినప్పుడల్లా ఆమె అక్క ముందుకు నడిపించే శక్తిగా నిలిచింది. ఇంట్లో డబ్బు కొరత తీవ్రంగా ఉండేది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్న శివ మాత్రం ఆర్మీ అధికారి కావాలనే లక్ష్యంపైనే దృష్టిసారించేది. ఆ విధంగా ఆమె పాఠశాల విద్య పూర్తి అయిన తదనంతరం సివిల్ ఇంజనీరింగ్ చదివింది. అది సైనికి వృత్తికి ఉపయోగపడుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఆ తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి-టెక్) మార్గం ద్వారా సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూకు హాజరైంది.
అలా ఆమె 19వ ఎస్‌ఎస్‌బి అలహాబాద్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించి..ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందింది. ఆ తర్వాత 2021లో కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్‌లో నియమితురాలైంది. ఇది ఆర్మీకి సంబంధించిన అత్యంత సాంకేతిక సవాలుతో కూడిన విభాగాలలో ఒకటి. ఇక్కడ ఆర్మీ అధికారులు వంతెనలు నిర్మించడం, మందుపాత్రలు తొలగించడం, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, అత్యంత కఠినమైన భూభాగాలలో కార్యకలాపాలకు మద్దుతి ఇవ్వడం వంటివి చేస్తారు.
ఆ తర్వాత ఆమెను లడఖ్‌లోని భారతదేశ ఉత్తర సరిహద్దులకు కాపలాగా ఉండే ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్‌కు నియమించారు. కెప్టెన్ శివ తన శారీరక సామర్థ్యాన్ని ప్రదర్శించడం జియాచెన్‌తో మొదటిసారి కాదు. జూలై 2022లో, కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా, ఆమె "సురా సోయ్ సైక్లింగ్ యాత్ర"కు నాయకత్వం వహించారు. ఆ యాత్రలో శివ సియాచిన్ యుద్ధం స్మారక చిహ్నం నుంచి కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వరకు 11 రోజుల్లో దాదాపు 508 కిలోమీటర్లు ప్రయాణించారు.
ఆ ప్రదర్శనే ఆమెను సియాచిన్ పోస్టింగ్ రేసులో నిలబెట్టింది. ఇది సైన్యం ఇచ్చే అత్యంత కఠినమైన నియామకాలలో ఒకటి. ఆమె వెళ్ళడానికి ముందు, కెప్టెన్ శివ ఇతర అధికారులతో పాటు సియాచిన్ యుద్ధ పాఠశాలలో ఒక నెల గడిపారు. అదంతా పూర్తి చేసిన తర్వాతే ఆమెకు మోహరించడానికి అనుమతి లభించింది. అలా ఆమె ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో అడుగుపెట్టిన తొలి మహిళా సైనికురాలిగా చరిత్ర సృష్టించింది.
ఇంతవరకు ఏ మహిళా అధికారి చేయని సాహసం ఆమె చేయడం విశేషం. సియాచిన్ హిమానీనదంపై సుమారు 15,600 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్‌కు బదిలీ అయ్యారు. అక్కడ కార్యాచరణ పాత్రలో పనిచేసిన తొలి మహిళా అధికారిగా నిలిచింది. ఈ నియామకం మూడు నెలల పాటు కొనసాగింది. మహిళలను సైన్యంలో మరింత మందిని చేర్చుకునేందుకు జరుగుతున్న మార్పుకి ప్రతీకగా శివ సాహసం నిలిచింది. అక్కడ కెప్టెన్ శివను కుమార్ పోస్ట్‌లోని ఒక ఇంజనీరింగ్ బృందానికి ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ ఘనత భారత సాయుధ దళాలలో మహిళలకు పెరుగుతున్న అవకాశాలు, కేవలం ప్రతిభ ఆధారంగానే అవకాశాలు తెరుచుకుంటాయనే విషయాన్ని ఎలుగెత్తి చాటింది.
(చదవండి: కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!)


