మంచుకొండల్లో విద్యుత్తు కాంతులు!  | Siachen glacier base camp to get power supply from national grid in September | Sakshi
Sakshi News home page

మంచుకొండల్లో విద్యుత్తు కాంతులు! 

Jun 30 2026 5:05 AM | Updated on Jun 30 2026 5:05 AM

Siachen glacier base camp to get power supply from national grid in September

లద్దాఖ్‌: ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ ఇక విద్యుత్తు ధగధగలతో మెరిసిపోనుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి డీజిల్‌ జనరేటర్ల ద్వారా జరుగుతున్న విద్యుదుత్పత్తికి ఇంకో రెండు నెలల్లో ముగింపు పలకనున్నారు. సియాచిన్‌తోపాటు నుబ్రా, జన్‌స్కార్‌ ప్రాంతాలకూ ఈ ఏడాది సెపె్టంబర్‌ నుంచి గ్రిడ్‌ ఆధారిత విద్యుత్తు అందుతూండటం దీనికి కారణం. ఫలితంగా మంచు కొండల మధ్యన దేశ సరిహద్దులను కాపాడుతున్న భారతీయ సైనికులకు కొంతమేరౖMðనా ఉపశమనం కలుగుతుందని అంచనా. 

భారత్, పాకిస్తాన్‌ల మధ్య దశాబ్దాలుగా రగులుతున్న యుద్ధానికి సియాచిన్‌ ప్రత్యక్ష సాక్షి. సముద్రమట్టానికి సుమారు 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ నిర్మానుష్య ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భారత్‌ ఏటా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతంలో జవాన్లకు విద్యుత్తు, కమ్యూనికేషన్ల అవసరం చాలా ఉంది. అయితే వీటన్నింటినీ ఇప్పటివరకూ డీజిల్‌ జనరేటర్ల సాయంతోనే తీర్చుకునే వారు. సోలార్‌ ఎనర్జీ, స్టోరేజ్‌ వ్యవస్థల ఏర్పాటుకూ కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ వాటితో పూర్తిస్థాయి ఫలితాలైతే దక్కలేదు. 

ఈ నేపథ్యంలో ప్రధాని అభివృద్ధి ప్యాకేజీ కింద సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌ను జాతీయ విద్యుత్తు గ్రిడ్‌తో అనుసంధానించాలని నిర్ణయించారు. మొత్తం రూ. 1,925 కోట్ల వ్యయంతో ద్రాస్‌ నుంచి పదుమ్‌ వరకు 189 కిలోమీటర్ల 220 కేవీ లైన్, ఫ్యాంగ్‌ నుంచి డిస్కిట్‌ వరకు 79 కిలోమీటర్ల 220 కేవీ లైన్‌ నిర్మిస్తున్నారు. ఈ పనులన్నింటినీ సెపె్టంబర్‌ నాటికి పూర్తి చేసి బేస్‌క్యాంపును గ్రిడ్‌ విద్యుత్తు వెలుగుల్లో నింపాలని లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ఇటీవలే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సెపె్టంబర్‌ 15వ తేదీలోగా ముఖ్యమైన పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

తీవ్రమైన మంచు, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు, కష్టతరమైన రవాణా పరిస్థితులు ఉన్న సియాచిన్‌ వంటి ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా పెద్ద సవాలే. ఇప్పటివరకు ఇంధనాన్ని రవాణా, జనరేటర్ల నిర్వహణ, వాతావరణ ప్రభావాల కారణంగా వ్యయం ఎక్కువగా ఉండేది. గ్రిడ్‌ విద్యుత్‌ రాకతో ఇది గణనీయంగా తగ్గనుంది. సైనికుల వసతి, వేడినీరు, వైద్య సహాయం, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు బలోపేతం కానున్నాయి. జవాన్ల జీవన పరిస్థితులు మెరుగు కానున్నాయి. వ్యూహాత్మకంగానూ ఈ పరిణామం చాలా కీలకం. నిరంతర విద్యుత్తు మన రక్షణ వ్యవస్థలు అన్నివేళల్లోనూ సిద్ధంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement