‘ఎఫ్‌పీపీసీఏ’ పేరుతో మరో షాక్‌కు రెడీ
రూ.555.30 కోట్ల బాదుడుకు రంగం సిద్ధం
దీనికి క్యారీయింగ్ కాస్ట్ అదనం
ఏపీఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన
రెండేళ్లలోనే బాబు సర్కారు రూ.21,628.12 కోట్ల విద్యుత్తు బిల్లుల బాదుడు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.15,485.36 కోట్ల విద్యుత్తు చార్జీల భారాన్ని మోపి బాదుడుకు శ్రీకారం చుట్టింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేసింది. ఇక 2025– 26లో రాష్ట్ర ప్రజల నుంచి రూ.2,800.28 కోట్లు వసూలు చేశారు. ఈ లెక్కన ఇప్పటి వరకూ వేసిన భారం రూ.21,072.82 కోట్లు. ఇది కాకుండా మరో రూ.555.30 కోట్ల భారం వేసేందుకు రంగం సిద్ధంగా ఉంది. ఈ లెక్కన మొత్తం రూ.21,628.12 కోట్ల విద్యుత్ చార్జీల షాక్‌లిచ్చింది. ఇందులో రూ.923.55 కోట్లను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించడంతో గత్యంతరం లేక యూనిట్‌కు 0.13 పైసలు చొప్పున వెనక్కు ఇస్తూ అదేదో ఊరికే ఇస్తున్నట్లు చంద్రబాబు సర్కారు మభ్యపెడుతోంది.
మరో పిడుగు..
విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు... అబ్బే పెంచలేదని ఎన్నికల తరువాత చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. మరోవైపు ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు ఛార్జీలు (ఎఫ్‌పీపీసీఏ) పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపే యత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ తూ ర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎఫ్‌పీపీసీఏ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి సోమ వారం సమర్పించాయి. డిస్కంలు చెబుతున్న లెక్కల ప్రకా రం.. ఇప్పటికే యూనిట్‌కు రూ.0.40 పైసల చొప్పున రూ.2,800.28 కోట్లు వసూలు చేశా యి.
కానీ వాస్తవంగా ఏపీఈఆర్‌సీ అనుమతించిన విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.1,918.32 కోట్లు మాత్రమే. అంటే వినియోగదారుల నుంచి రూ.881.96 కోట్లు ఎక్కువ వసూలు చేసేశారు. క్యారీయింగ్ కాస్ట్ రూ.58.11 కోట్లతో కలిపి సర్దుబాటు రూ.940.07 కోట్లు అదనంగా లాగేశారు. న్యాయంగా అయితే దీనిని ప్రజల కు తిరిగి ఇవ్వాలి. అయితే మూడు డిస్కంలలో తూర్పు డిస్కం మాత్రమే క్యారీయింగ్ కాస్ట్‌తో కలిపి రూ.1,495.37 కోట్లు వసూలు చేసిందని... దక్షిణ డిస్కం (ఏపీఎస్పీడీసీఎల్)లో రూ.532.78 కోట్లు, మధ్య డిస్కం (ఏపీసీపీడీసీఎల్)లో రూ.22.52 కోట్లు ఇంకా వసూలు చేయాల్సి ఉందని లెక్కల్లో చూపించారు. అంటే ఈ మొత్తం రూ.555.30 కోట్ల అదనపు భారం వినియోగదారులపై పడనుంది.
అభ్యంతరాలు కోరిన ఏపీఈఆర్‌సీ..
నెలకు 150 నుంచి 300 యూనిట్లు వినియోగించే కుటుంబాలకు విద్యుత్ బిల్లు ఇప్పటికే భారీగా వస్తోంది. దానికి అదనంగా ఎఫ్‌పీపీసీఏ, ట్రూఅప్, ఇతర సర్దుబాటు చార్జీలు చేరడంతో బిల్లులు మరింత పెరుగుతున్నాయి. ప్రతి నెల బిల్లు ఎందుకు మారిపోతోందో సాధారణ వినియోగదారుడికి అంతుబట్టని పరిస్థితి నెలకొంది. విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేయడంలో విఫలమవడం, మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం, ఖరీదైన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం లాంటి కారణాలతో డిస్కంల వ్యయం పెరుగుతోందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
కాగా డిస్కంల ప్రతిపాదనలపై వినియోగదారులు, ప్రజాసంఘాలు, పరిశ్రమలు తమ అభ్యంతరాలు, సూచనలను ఏపీఈఆర్సీకి పంపవచ్చని కమిషన్ తెలిపింది. ఆగస్టు 3వ తేదీలోగా కర్నూలులోని కమిషన్ కార్యాలయానికి నేరుగా, పోస్టు ద్వారా లేదా ఈ–మెయిల్ రూపంలో తెలియజేయాలని ఏపీఈఆర్‌సీ సూచించింది. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయాలను పరిశీలించిన తర్వాత తుది ఉత్తర్వులు జారీ
చేయనుంది.
మూడు డిస్కంల విద్యుత్ అమ్మకాలు : 70,884.71 మిలియన్ యూనిట్లు
వసూలుకు అనుమతి : రూ.1,918.32 కోట్లు
ఇప్పటికే వసూలు చేసిన మొత్తం : రూ.2,800.28 కోట్లు
అదనంగా వసూలు చేసింది : రూ.881.96 కోట్లు
క్యారీయింగ్ కాస్ట్ : రూ.58.11 కోట్లు
మొత్తంగా అదనపు వసూలు : రూ.940.07 కోట్లు
2024 నవంబర్ బిల్లుల నుంచి రూ.6,072.86 కోట్లు వసూలు ప్రారంభం
2025 జనవరి బిల్లుల నుంచి రూ.9,412.50 కోట్లు వసూలు మొదలు
2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,787.18 కోట్లు వసూలు
(ఇందులోరూ.923.55 కోట్లు వెనక్కి ఇవ్వాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది)
2025–26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే రూ.2,800.28 కోట్లు వసూలు
డిస్కంల వారీగా సర్దుబాటు లెక్కలు
ఏపీఎస్పీడీసీఎల్
విద్యుత్ అమ్మకాలు : 28,678.57 మిలియన్ యూనిట్లు
వసూలుకు అనుమతి: రూ.1,630.90 కోట్లు
ఇప్పటికే వసూలు : రూ.1,112.04 కోట్లు
ఇంకా వసూలు చేయాల్సింది : రూ.518.86 కోట్లు
క్యారీయింగ్ కాస్ట్ : రూ.13.92 కోట్లు
మొత్తం అదనపు భారం : రూ.532.78 కోట్లు
ఏపీసీపీడీసీఎల్
విద్యుత్ అమ్మకాలు : 15,587.68 మిలియన్ యూనిట్లు
వసూలుకు అనుమతి : రూ.645.42 కోట్లు
ఇప్పటికే వసూలు : రూ.623.51 కోట్లు
ఇంకా వసూలు చేయాల్సింది : రూ.21.91 కోట్లు
క్యారీయింగ్ కాస్ట్ : రూ.0.61 కోట్లు
మొత్తం అదనపు భారం : రూ.22.52 కోట్లు
ఏపీఈపీడీసీఎల్
విద్యుత్ అమ్మకాలు : 26,618.45 మిలియన్ యూనిట్లు
2024–25లో ఎక్కువ వసూలు : రూ.358.00 కోట్లు
2025–26లో ఇప్పటికే వసూలు : రూ.1,064.74 కోట్లు
అదనంగా వసూలు చేసింది : రూ.1,422.74 కోట్లు
క్యారీయింగ్ కాస్ట్ : రూ.72.64 కోట్లు
మొత్తంగా అదనపు వసూలు : రూ.1,495.38 కోట్లు


