టీడీపీ నేతల అరాచకాలు.. తమ మాట వినని బీఎల్‌వోపై దాడులు | TDP leaders anarchy at Kapada | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల అరాచకాలు.. తమ మాట వినని బీఎల్‌వోపై దాడులు

Jul 14 2026 12:56 AM | Updated on Jul 14 2026 5:55 AM

TDP leaders anarchy at Kapada

ఖాళీ ఫారానికి ఆధార్‌ జతచేసి నింపాలంటూ వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ మురళీపై దౌర్జన్యం 

అధికార మదంతో చెంపపై కొట్టి, కాలితో తన్నిన టీడీపీ నేత ‘మాసాపేట శివ’ 

సీసీ ఫుటేజీ తీస్తే బయటపడనున్న వాస్తవాలు 

కేసు పెట్టకుండా అధికారుల ‘రాజీ’కీయాలు   

బాధితుడికి అండగా నిలిచిన సచివాలయ సంఘ నేతలు 

మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు  

కడప కార్పొరేషన్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఉ­ద్యోగులకు రక్షణ కరువైంది. తాజాగా ఓటర్ల ప్ర­త్యేక సమగ్ర సవరణ సర్వే(సర్‌) విధి నిర్వహణలో ఉన్న బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌(బీఎల్‌వో)పై తెలుగుదేశం పార్టీ నాయకుడు దాడికి పాల్పడడం కడప నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఉ­ద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.    

నిబంధనలు చెబితే కాలితో తంతారా! 
కడప నగరం 26వ వార్డు సచివాలయంలో సమగ్ర ఓటర్ల సర్వే(సర్‌) కార్యక్రమం జరుగుతోంది. అక్కడ బీఎల్‌వో విధి నిర్వహణలో ఉన్న వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీ మురళి వద్దకు టీడీపీ నాయకుడు చేవలమూడి శివ అలియాస్‌ మాసాపేట శివ వచ్చారు. కేవలం ఫొటో అతికించిన ఒక ఖాళీ ఎన్యుమరేషన్‌ ఫారాన్ని, దానికి ఒక ఆధార్‌ కార్డును మాత్రమే జతచేసి మురళికి ఇచ్చారు. నిబంధనల ప్రకారం ఆ ఫారాన్ని పూర్తిగా నింపి ఇవ్వాలని, దీంతో పాటు మరో సహాయక పత్రాన్ని (డాక్యుమెంట్‌) జత చేయాలని బీఎల్‌వో మురళి సూచించారు. దీంతో ఆగ్రహించిన మాసాపేట శివ.. ‘మేము చెప్పిందే చేయాలి‘ అంటూ అధికార మదంతో మురళితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా విచక్షణ కోల్పోయి బీఎల్‌వో మురళి చెంపపై బలంగా కొట్టి, కాలితో తన్ని కింద పడేశాడు. 

సీసీ ఫుటేజీ దాచేందుకు యత్నం..  
సచివాలయంలో అందరి ముందూ ఈ దాడి జరిగింది. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే దాడికి సంబంధించిన పూర్తి వాస్తవాలు, టీడీపీ నే­త రౌడీయిజం బహిర్గతమయ్యే అవకాశాలు స్ప­ష్టంగా ఉన్నాయి. అయితే, దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన కొందరు ఉన్నతాధికారులు (అడిషనల్‌ కమిషనర్, తహసీల్దార్‌) బాధితుడికి న్యాయం చేయాల్సింది పోయి, నిందితుడితో రాజీ కుదిర్చేందుకు రాయబారాలు నడపడం గమనార్హం. ‘ఇప్పు­డు వారు అధికారంలో ఉన్నారు.. కేసు పెడితే రేపు మీకే ఇబ్బందులొస్తాయి‘ అంటూ బాధితుడిని బెదిరిస్తూ, ఒత్తిడి తెచ్చి కేసును నొక్కేసేందుకు తెర­వెనుక తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

సచివాలయ సంఘాల ఆగ్రహం.. కమిషనర్‌కు ఫిర్యాదు 
ఈ దాడిపై  సచివాలయ ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. బాధితుడు మురళికి అండగా నిలిచిన సంఘ నేతలు సాయంత్రం కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడి చేసిన టీడీపీ నేత మాసాపేట శివపై తక్షణమే క్రిమినల్‌ కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. లేకుంటే విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement