సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ అధిష్టానంపై ప్రభుత్వ విప్, గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తిరుగుబావుటా ఎగరేశారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలో ఆదివారం జరిగిన ఒక సభలో పార్టీ అధిష్టానంపై బహిరంగానే విమర్శలు చేశారు. ‘గత ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యరి్థతో కలిసి పనిచేసిన కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి రూ.కోటి–రూ.2 కోట్ల విరాళాలు తీసుకుని కాంట్రాక్టులు, ఆరి్థక ప్రయోజనాలు చేకూర్చుతున్నారు.
ఇప్పుడు ప్రతి వాడూ టీడీపీ అంటున్నాడు. పార్టీకి సపోర్ట్ చేశామని ఇప్పుడు చెబుతున్న కొంత మంది.. నేను గన్నవరం ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ కలవలేదు. గన్నవరం విమానాశ్రయం కాంట్రాక్ట్‌కు సంబంధించి కేఏంవీ ప్రాజెక్ట్ నిర్వాహకులు ఎవరో కూడా నాకు తెలియదు. ప్రత్యర్థికి పనిచేసిన వారికి కాంట్రాక్ట్ రావడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
పార్టీ గెలుపు కోసం నేను యుద్ధం చేసి.. నా రెక్కల కష్టం ఖర్చు పెడితే.. మీరు ఇలా అవమానాల పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. నా ప్రత్యర్థులతో కలిసి పనిచేసిన పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేయడాన్ని ఒప్పుకోను’ అని హెచ్చరించారు. నా ప్రత్యర్థి మీద యుద్ధం చేసినందుకు నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా? అంటూ ప్రశ్నించారు. కార్యకర్తలతో త్వరలో సమావేశం ఏర్పాటుచేసి ప్రస్తుత పరిణామాలపై చర్చిస్తానన్నారు.
రగిలిపోతున్న ఎమ్మెల్యే
యార్లగడ్డ తొలి నుంచి పారిశ్రామికవేత్తలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు పార్టీ అధిష్టానంతో కలుస్తున్నారని, తనను కలవటం లేదని ఆయన రగిలిపోతున్నట్లు సమాచారం. ఆయన చెప్పిన వారికి ఎయిర్ పోర్ట్ కాంట్రాక్టు దక్కలేదన్న అక్కసు ఆయన తాజా మాటల్లో వ్యక్తం అవుతోందని టీడీపీ వర్గాలే విశ్లేషించడం గమనార్హం.


