సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరసన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తితో.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. సోమవారం నగరంలో ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.
రెండేళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. బాబు సర్కార్‌పై వాళ్లు ఆగ్రహం వ్యకక్తం చేశారు.
ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని ఫెడరేషన్ ఆరోపించింది. పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఐఆర్ విషయంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని నేతలు విమర్శించారు. సరెండర్ లీవ్‌లకు సంబంధించిన చెల్లింపులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు.
నెలకు రూ.1500 కోట్లు క్షవరం..
ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఫెడరేషన్ నేతలు మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఉద్యోగులకు కూడా పూర్తిగా తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని(క్షవరం చేస్తోందని) విమర్శించారు.
వలంటీర్ల హామీలపైనా ప్రశ్నలు
ఉద్యోగులతో పాటు వలంటీర్లకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఫెడరేషన్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.


