సైన్యానికి హైదరాబాదీ డ్రోన్లు | Hyderabad aerospace firm delivers drones to Indian Army | Sakshi
Sakshi News home page

సైన్యానికి హైదరాబాదీ డ్రోన్లు

Jun 16 2026 3:30 AM | Updated on Jun 16 2026 3:30 AM

Hyderabad aerospace firm delivers drones to Indian Army

జేకే–250ఈ రకానికి చెందిన 41 డ్రోన్లను తొలివిడతగా అందించిన డ్రోగో ఏరోస్పేస్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశ రక్షణ సాంకేతికత అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌కు చెందిన డ్రోగో ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే–250ఈ రకం డ్రోన్లను అందజేసింది. రూ. 72 కోట్ల విలువైన రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ డ్రోన్లను నాసిక్‌లోని సదరన్‌ కమాండ్‌ అధికారులకు అందించినట్లు సంస్థ సీఈవో యశ్వంత్‌ బొంతు సోమవారం తెలిపారు. మిగిలిన డ్రోన్ల సరఫరాను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు దేశీయ రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేయనుంది.

డ్రోగో ఏరోస్పేస్‌ రూపొందించిన జేకే–250ఈ రకం డ్రోన్లు ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 3 గంటలపాటు నిరంతరాయంగా గగనతలంలో ప్రయాణించగలవు. నిఘా, పర్య వేక్షణతోపాటు ఇతర సైనిక అవసరాలకు ఇవి ఉప యోగ పడతాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రోగో డ్రోన్స్‌ ఇటీవల తన పేరును డ్రోగో ఏరోస్పేస్‌గా మార్చుకుంది. డ్రోన్‌ తయారీ సంస్థ నుంచి సమగ్ర రక్షణ, ఏరోస్పేస్‌ సాంకేతికతల అభివృద్ధి, విమానాలు, ఉపగ్రహాలు, డ్రోన్లు, అంతరిక్ష నౌకల రూపకల్పన, తయారీ, నిర్వహణకు అవసరమైన సాంకేతిక పరిష్కారాలను అందించే సంస్థగా విస్తరించింది.

రక్షణ, నిఘా వ్యవస్థలు, తదుపరి తరం మానవరహిత వైమానిక వ్యవస్థల అభివృద్ధిపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌లో డ్రోన్‌ తయారీ కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం డ్రోగో ఏరోస్పేస్‌కు నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించింది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ అత్యాధునిక తయారీ కేంద్రం ద్వారా డ్రోన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం సంస్థలో 300 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా కొత్త ప్లాంట్‌ ప్రారంభంతో మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు యశ్వంత్‌ బొంతు వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement