చండీగఢ్: చండీగఢ్‌లోని బరిల్ ప్రాంతంలో వరుసగా సంభవించిన ఎల్‌పీజీ సిలిండర్ పేలుళ్లు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. సోమవారం సాయంత్రం ఒక నివాస గృహంలో జరిగిన ఈ వరుస పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇళ్ల గోడలకు పెద్ద ఎత్తున పగుళ్లు
ప్రమాదం జరిగిన ఇంటితో పాటు సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి ఇళ్ల గోడలకు పెద్ద ఎత్తున పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు జరిగిన స్థలంలో సుమారు 10 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ రీఫిల్లింగ్‌పై అనుమానాలు
ఈ పేలుళ్లకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, ప్రమాదం జరిగిన ఇంట్లో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల రీఫిల్లింగ్ జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ గుర్జీత్ కౌర్ మాట్లాడుతూ, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ కోణంలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
నివాస ప్రాంతాల్లో సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, రీఫిల్లింగ్ చేయడం బరిల్ ఏరియాలో సర్వసాధారణంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇరుకైన సందుల్లో ఇలాంటి కార్యకలాపాలు సాగించడం వల్ల అత్యవసర సమయంలో అగ్నిమాపక వాహనాలు కూడా లోపలికి రాలేని పరిస్థితి ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


