హ్యాట్రిక్ ఓటముల తర్వాత.. చరిత్ర సృష్టించిన కీకో | After a Hat-Trick of Defeats Keiko Fujimori Makes History in Peru | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ ఓటముల తర్వాత.. చరిత్ర సృష్టించిన కీకో

Jul 4 2026 2:00 PM | Updated on Jul 4 2026 2:15 PM

After a Hat-Trick of Defeats Keiko Fujimori Makes History in Peru

పెరూ రాజకీయాల్లో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కీలక మలుపు చోటుచేసుకుంది. ఎన్నో సంవత్సరాల పోరాటం.. మూడు వరుస అధ్యక్ష ఎన్నికల ఓటములు, వివాదాలు, ఆరోపణల మధ్య నిలిచిన కీకో ఫుజిమోరి Keiko Fujimori.. ఎట్టకేలకు దేశ అత్యున్నత పదవిని దక్కించుకుని చరిత్ర సృష్టించారు.

నెలల తరబడి సాగిన ఉత్కంఠభరిత కౌంటింగ్ ప్రక్రియ తర్వాత పెరూ ఎన్నికల కోర్టు అధికారికంగా కీకో ఫుజిమోరి(51)ని అధ్యక్ష ఎన్నిక విజేతగా ప్రకటించింది. జూన్ 7న జరిగిన రెండో దశ ఎన్నికల్లో ఆమె 50.135 శాతం ఓట్లతో స్వల్ప ఆధిక్యం సాధించగా, ప్రత్యర్థి వామపక్ష నేత రోబర్టో సాంచెజ్ 49.865 శాతం ఓట్లతో పరాజయం పాలయ్యారు. దాదాపు 1.8 కోట్ల ఓట్లలో 50 వేల కంటే తక్కువ తేడా ఈ ఎన్నికను దేశ చరిత్రలో అత్యంత ఉత్కంఠభరిత పోటీల్లో ఒకటిగా నిలిపింది.

ఫలితాలపై సాంచెజ్ వర్గం అక్రమాల ఆరోపణలు చేస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఎన్నికల అధికారులు అన్ని ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత ఫలితాన్ని ధృవీకరించారు. దీంతో కీకో ఫుజిమోరి అధికారికంగా పెరూ అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

కీకో ఎవరంటే..
కీకో ఫుజిమోరి పెరూ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేత. మాజీ అధ్యక్షుడు అల్బర్టో ఫుజిమోరి (Alberto Fujimori) పెద్ద కుమార్తె. 1990 నుంచి 2000 వరకు పెరూ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, దేశంలో ఉగ్రవాదంపై కఠిన చర్యలతో ప్రసిద్ధి పొందినప్పటికీ, తరువాత అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించారు.

అల్బర్టో అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కీకో చాలా చిన్న వయసులోనే దేశ రాజకీయ వాతావరణాన్ని దగ్గరగా చూసారు. తండ్రి అధ్యక్షుడిగా ఉన్న చివరి సంవత్సరాల్లో.. కేవలం 19 ఏళ్ల వయసుకే ఆమె ‘‘ఫస్ట్ లేడీ’’ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఇది ఆమెను రాజకీయాల్లోకి ప్రవేశించడానికి దారి తీసిన కీలక దశగా భావిస్తారు. తర్వాత ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి పాపులర్ ఫోర్స్ పార్టీకి నాయకత్వం వహించారు. 2011, 2016, 2021 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా పోటీ చేసి ప్రతి సారి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 

ఈ పరాజయాలు ఆమె రాజకీయ ప్రయాణాన్ని ఆపలేదు, కానీ మరింత బలమైన మద్దతు బేస్ నిర్మించుకునేలా చేశాయి. అదే సమయంలో ఆమెపై ఎన్నికల నిధుల అక్రమాల కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసుల కారణంగా కొంతకాలం జైలు జీవితం గడపాల్సి రావడం ఆమె రాజకీయ జీవితంలో పెద్ద మలుపుగా నిలిచింది. అయినప్పటికీ రాజకీయాల నుంచి తప్పుకోకుండా మళ్లీ పునరాగమనం చేశారు.

విజయం.. రాజకీయ ప్రాధాన్యం
ఈసారి ఎన్నికల్లో కీకో “కఠిన చట్టాలు, నేరాల నియంత్రణ, పెట్టుబడుల ఆకర్షణ” వంటి అంశాలపై ప్రచారం నిర్వహించారు. దేశంలో పెరుగుతున్న నేరాలు, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో ఆమె వాదనలు ఓటర్లలో గణనీయంగా ప్రభావం చూపించాయి. విజయం అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ముందున్న సవాళ్లు..
అయితే కొత్త అధ్యక్షురాలిగా ఆమె ముందున్న సవాళ్లు పెద్దవి. పెరూ గత దశాబ్దంలో అనేక రాజకీయ సంక్షోభాలను చూసింది. వరుస ప్రభుత్వ మార్పులు, సామాజిక విభేదాలు, ఆర్థిక ఒత్తిడులు దేశాన్ని ప్రభావితం చేశాయి. ఈ పరిస్థితుల్లో స్థిరమైన పాలన అందించడం ఆమెకు ప్రధాన పరీక్షగా మారనుంది. అయినప్పటికీ దీర్ఘకాల పరాజయాల తర్వాత చివరకు అధికారం దక్కించుకున్న కీకో ఫుజిమోరి విజయం, పెరూ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement