ప్రయాగ్‌రాజ్: ఆగ్రాలోని తాజ్ మహల్ ఒక సమాధా లేక ఆలయమా? తాజ్ మహల్ నిజంగానే తేజో మహాలయమా? ఈ ప్రశ్నలు చాలా కాలంగా తలెత్తుతున్నాయి. ఈ వివాదం కూడా సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి తాజ్ మహల్ ప్రాంగణంలో సర్వే నిర్వహించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
జిల్లా కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ..
సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్‌ను నియమించడానికి నిరాకరిస్తూ ఆగ్రా జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ పిటిషన్‌లో సవాలు చేశారు. తాజ్ మహల్ ప్రాంగణంలో ఆలయం ఉందనే వాదన ఆధారంగా ఈ పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో ఈ కేసు విచారణ సజూలై 6న జరగనుంది. భగవాన్ ‘శ్రీ అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ విరాజమాన్ తేజో మహాలయ ఆలయం’ తరఫు న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో ఒక దావా దాఖలైంది. ఈ కేసు ఆగ్రా సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వద్ద పెండింగ్‌లో ఉంది. సదరు ప్రాంగణంలో ఆలయం ఉందని ప్రకటించాలని ఈ కేసులో కోరారు.
తిరస్కరించిన రెండు కోర్టులు
ఈ కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలో, సర్వే కోసం అడ్వకేట్ కమిషనర్‌ను నియమించాలని కోరుతూ అదనపు జిల్లా న్యాయమూర్తి ముందు ఒక దరఖాస్తు దాఖలు చేశారు. అయితే, రెండు జిల్లా కోర్టులు ఈ పిటిషన్‌ను తిరస్కరించాయి. ప్రస్తుత పిటిషన్‌లో భారత ప్రభుత్వం, భారతీయ పురాతత్వ శాఖ, మరో ఇద్దరిని ప్రతివాదులుగా చేర్చారు.
మహాదేవ ఆలయం ఉందంటూ వాదన
ఆగ్రాలో ఉన్న ప్రపంచ వారసత్వ సంపద అయిన తాజ్ మహల్ ప్రాంగణంలో భగవాన్ శ్రీ అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ విరాజమాన్ తేజో మహాలయ ఆలయం ఉందని పిటిషన్‌లో వాదించారు. సివిల్ రివిజన్ సంఖ్య 03/2020లో ఆగ్రా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి (ADJ) 2026 ఏప్రిల్ 4న జారీ చేసిన ఆదేశాలను, అలాగే అంతకుముందు ఒరిజినల్ సూట్ సంఖ్య 356/2015లో సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) 2019 జూలై 18న జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని పిటిషనర్లు అలహాబాద్ హైకోర్టును అభ్యర్థించారు. ఈ రెండు ఆదేశాల్లోనూ పిటిషన్ తిరస్కరణకు గురైంది.


