నెతన్యాహు అధికారం కోల్పోక తప్పదా? | israel election surveys netanyahu eizenkot | Sakshi
Sakshi News home page

నెతన్యాహు అధికారం కోల్పోక తప్పదా?

Aug 16 2026 9:54 AM | Updated on Aug 16 2026 10:09 AM

israel election surveys netanyahu eizenkot

టెల్‌ అవీవ్‌: ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న మారణహోమంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ పాత్ర ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇరాన్‌పై దాడికి, ఆయతుల్లా ఖమేనీ హత్యకు అమెరికాను బెంజిమిన్ ఉసిగొల్పాడు అనేది తెలిసిన విషయమే.. అయితే ఇజ్రాయెల్‌ను రక్షిస్తానంటూ ఇంత విధ్వంసం సృష్టించిన నెతన్యాహును ఇప్పుడు ఆ దేశ ప్రజలే తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో ఆ విషయాలు తేట తెల్లమయ్యాయి.

ఈ ఏడాది అక్టోబర్‌ 27న ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికలలో నెతన్యాహూ కూటమి అధికారం చేజిక్కించుకోవడం దాదాపు కష్టంగానే కనిపిస్తోంది.  తాజా సర్వేల ప్రకారం, ప్రస్తుత ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు మాజీ ఆర్మీ చీఫ్ గాడి ఐజన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష 'యషార్' పార్టీ నుండి గట్టి సవాలు ఎదురవుతోంది. ఈ సర్వేలో ప్రతిపక్ష యషార్ పార్టీ 25 స్థానాలు సాధిస్తుందని అంచనా వేయగా, నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ 21 స్థానాలకే పరిమితం కానుంది.

గత కొన్ని వారాలుగా  నిర్వహించిన  సర్వేలలో రెండు పార్టీల మధ్య కేవలం 1 లేదా 2 సీట్ల తేడా మాత్రమే ఉండగా, తాజాగా యషార్ పార్టీ స్పష్టంగా 4 సీట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్) లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 61 స్థానాల మద్దతు అవసరం. సర్వే ప్రకారం యషార్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, అక్కడ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. నెతన్యాహు వ్యతిరేక పార్టీల కూటమి 'చేంజ్ బ్లాక్' 58 స్థానాలు సాధించే అవకాశం ఉంది, అంటే ఇది మెజారిటీకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలవనుంది.

మరోవైపు, నెతన్యాహు మద్దతుదారుల కూటమి 50 స్థానాలు, అరబ్ పార్టీలు 12 స్థానాలు (రామ్ పార్టీ 6, హదాష్-తాల్ 6) గెలుచుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఎన్నికల ముందే ఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల తర్వాత 61 మంది అంతకంటే ఎక్కువ మంది ఎంపీల మద్దతు కూడగట్టిన నేత మాత్రమే ప్రధానమంత్రి అవుతారు. కాగా  నెతన్యాహు వ్యతిరేక కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ప్రతిపక్ష కూటమిలో ఏ పార్టీకైతే ఎక్కువ సీట్లు వస్తాయో, ఆ పార్టీ నాయకుడికే ప్రధాని అయ్యే అవకాశం దక్కాలని అక్కడ పార్టీలు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతిపక్షం నుండి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ష ‘యషార్’ పార్టీ అధినేత గాడి ఐజన్‌కోట్‌కే ఉన్నట్లు తెలుస్తోంది. 

కాగా ఇజ్రాయెల్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించాయి. నెతన్యాహుకు అధికారిక ప్రభుత్వ భద్రత ఉన్నప్పటికీ, ఐజన్‌కోట్‌కు ఇంకా పూర్తి స్థాయి భద్రత లేదు, దీంతో ఆయనకు సాయుధ భద్రత కల్పించాలని అంతర్గత భద్రతా సంస్థ 'షిన్ బెట్' భావిస్తోన్నట్లు సమాచారం. కాగా, ఇజ్రాయెల్‌లో ప్రజలు నేరుగా ప్రధానికి కాకుండా పార్టీలకే ఓటు వేస్తారు. 

ఇరాన్‌పై దాడులు

కాగా ప్రస్తుతం ఇరాన్‌పై దాడుల విషయంలో నెతన్యాహూ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. ఇరాన్ ఎట్టిపరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను సాధించకుండా అడ్డుకుంటామనిఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో  నెతన్యాహు కుండబద్దలు కొట్టారు. ఒకవేళ దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధం నుండి అమెరికా వైదొలగాలని చూసినా, ఇజ్రాయెల్ అవసరమైతే ఒంటరిగానే  దాడులు చేయడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తోన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement