గుజరాత్‌లో తల్లిదండ్రులు 23 ఏళ్ల కన్న కొడుకును అతి దారుణంగా హత్య చేసి, ఆ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన దిగ్భ్రాంతికర ఉదంతం వెలుగులోకి వచ్చింది. మొదట ఆత్మహత్యగా భావించినప్పటికీ, ఇది అతని తల్లిదండ్రులు చేసిన హత్య అని తరువాత విచారణలో తేలింది. అయితే పెళ్లైన నాలుగు నెలలకే కొడుకును సొంత తల్లిదండ్రులే కిరాతకంగా ఎందుకు హతమార్చారు? అసలేం జరిగింది?
ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా, గోండల్ తాలూకా పరిధిలోని గుండాల గ్రామంలో జూన్ 30న జరిగింది. మరణించిన వ్యక్తిని రామ్ బాబుభాయ్ బాంభవాగా గుర్తించారు. కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని కథలల్లారు నిందితులు. కానీ పోస్ట్‌మార్టం నివేదికలో అసలు విషయం తేలింది. ఇది హత్యకాదు ఆత్మహత్య అని నిర్ధారణ అయింది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత, బాధితుడి భార్య తన అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల విచారణ ప్రకారం, రామ్‌కు విపరీతమైన తాగుడు అలవాటు ఉండేది. దీనివల్ల అతని తండ్రి బాబుభాయ్ (అతుల్‌భాయ్ ఘుఘాభాయ్ బాంభవా) తల్లి మనీషాబెన్ (అలియాస్ మోటిబెన్)తో తరచుగా గొడవలు జరిగేవి. మృతుడు తల్లిదండ్రులను నిత్యం వేధించేవాడు. ఈ కోవలోనే ఘటన జరిగిన రోజున కూడా ఇదే విషయంలో తల్లిదండ్రులు అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వివాదం ముదరడంతో, తల్లి రామ్ చేత బలవంతంగా యాసిడ్ తాగించగా, తండ్రి అతనిపై దాడి చేసి గొంతు నులిమి చంపేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఈ నేరాన్ని కప్పిపుచ్చి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి తండ్రి బాబుభాయ్ స్థానిక రాజకీయ పలుకుబడిని ఉపయోగించడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అనుమానం రాకుండా గోండల్ సివిల్ ఆసుపత్రిలో హడావిడిగా ప్యానెల్ పోస్ట్‌మార్టం నిర్వహించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు, పలువురు స్థానిక నాయకులను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!
అయితే, పోలీసుల సమగ్ర విచారణ, పోస్ట్‌మార్టం నివేదికలోని వివరాలు ఈ కుట్రను బయట పెట్టాయి. విషప్రయోగం , గొంతు నులిమి చంపడం వల్లే అతను మరణించాడని తేలింది.బాధితుడి భార్య బన్షీబెన్ బాంభవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గోండల్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి, తల్లిదండ్రులు బాబుభాయ్, మనీషాబెన్‌లను అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. కాగా రామ్ నలుగురు తోబుట్టువులలో పెద్దవాడు. తండ్రి స్థానికంగా టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్ మదర్ సునీత సక్సెస్ స్టోరీ


