శ్రీనగర్: బమ్‌బమ్ భోలె, హరహర మహాదేవ నినాదాలు శుక్రవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని హిమాలయ సానువుల్లో ప్రతిధ్వనించాయి. హిమాలయాల్లో కొలువైన సహజసిద్ధ మంచు స్పటిక శివలింగాన్ని దర్శించుకునే అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra 2026) మొదలైంది.
అత్యంత కఠినమైన 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న శివలింగాన్ని మొదటి రోజు 12,100 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఆగస్ట్ 28వ తేదీ వరకు, 57 రోజులపాటు కొనసాగే ఈ యాత్ర కోసం అధికార యంత్రాంగం కనీవినీ ఎరుగని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. భక్తులకు అన్ని రకాల వసతులను కల్పించింది.
శుక్రవారం ఉదయాన్నే ఓ వైపు భారీ వర్షం కురుస్తుండగానే 48 కిలోమీటర్ల సంప్రదాయ హహల్గాంలోని నున్వాన్ మార్గంతోపాటు, 14 కిలోమీటర్ల సోనామార్గ్ ప్రాంతంలోని బాల్టాల్ మార్గాల్లో భక్తులు ముందుకు కదిలారు.
తీర్థయాత్రికులను వారి కేటాయించిన తేదీల్లోనే తీసుకెళ్తామని, అప్పటి వరకు ఓపికతో ఎదురు చూడాలని అధికారులు కోరారు.


