ఫలకాల కదలికల వల్లే | Explanation of Tectonic Plates and Plate Boundaries | Sakshi
Sakshi News home page

ఫలకాల కదలికల వల్లే

Jun 26 2026 2:58 AM | Updated on Jun 26 2026 2:58 AM

Explanation of Tectonic Plates and Plate Boundaries

ఒకే రోజు 4 భారీ భూకంపాలు.. చాలా అరుదు

20000+! ఏడాది కాలంలో భూమ్మీద సంభవించే భూకంపాల సంఖ్య ఇది. అంటే సగటున రోజుకు 55 వరకూ భూకంపాలు చోటు చేసుకుంటూ ఉంటాయన్నమాట. సాధారణంగా వీటిల్లో చాలావరకూ తక్కువ తీవ్రత ఉన్నవే. మనుషులు గుర్తించలేనివి కూడా. కానీ...బుధవారం అటు అమెరికాలోని కాలిఫోర్నీయాలో... దక్షిణ అమెరికాలోని వెనెజువెలా, తూర్పున ఉన్న జపాన్‌లో వచ్చిన భూకంపాలు మాత్రం కొంచెం ప్రత్యేకమని చెప్పాలి. 

కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్‌ వ్యాలీలో సుమారు 5.6 తీవ్రతతో భూకంపం రాగా.. ఏడు గంటల తరువాత వెనెజువెలాలో 7.2 తీవ్రతతో ఒకసారి.. 39 సెకన్ల తరువాత 7.5 తీవ్రతతో రెండోసారి భూమి కంపించింది. ఈ డబుల్‌ భూకంపాల తరువాత 25 నిమిషాలకే జపాన్‌లోని కుజి వద్ద సముద్రంలో మరోసారి భూమి సుమారు 6.9 తీవ్రతతో కంపించింది. ఇలా 24 గంటల వ్యవధిలో ఇంత ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు రావడం అరుదైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ ఘటనలకు కారణం ఆయా ప్రాంతాల్లోని టెక్టానిక్‌ ఫలకాల కదలికలు కావడం.  

భూమి పొరల కదలికలు... 
భూమి ఉపరితలం నుంచి సుమారు 70 కిలోమీటర్ల లోతు వరకూ ఉండే క్రస్ట్‌.. దాని దిగువన ఉండే మాంటెల్‌ పై భాగం భారీ ఫలకాలుగా విడిపోయి ఉంటుంది. వీటినే టెక్టానిక్‌ ఫలకాలంటారు. వీటిల్లో పసిఫిక్, నార్త్‌ అమెరికన్, యురేసియన్, ఆఫ్రికన్, అంటార్కిటిక్, ఇండో–ఆ్రస్టేలియన్, సౌత్‌ అమెరికన్‌ ఫలకాలు ప్రధానమైనవి. కరీబియన్, నాజ్కా, కోకస్, అరేబియన్, ఫిలిప్పీన్‌ పేర్లతో కొన్ని చిన్న ఫలకాలూ ఉన్నాయి.  టెక్టానిక్‌ ఫలకాలు నిత్యం కదులుతూ ఉంటాయి. ఏడాది కాలంలో సుమారు పది సెంటీమీటర్ల దూరం ప్రయాణిస్తాయని అంచనా. 

సుమారు ఐదు కోట్ల ఏళ్ల క్రితం యురేసియన్‌ ఫలకాన్ని ఇండియన్‌ ఫలకం ఢీకొన్న ఫలితంగా హిమాలయ పర్వత శ్రేణి ఏర్పడింది. ఇండియన్‌ ఫలకం ఇప్పటికీ ఏడాదికి ఐదు సెంటీమీటర్ల చొప్పున యురేసియన్‌ ప్లేట్‌ను ముందుకు తోస్తోంది కూడా. ఢీకొనడం కాకుండా.. ఒకదాని కిందకు ఒకటి చేరిపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో భూకంపాలు చోటు చేసుకునే అవకాశాలు పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ టెక్టానిక్‌ ఫలకాల రాపిడి కాస్తా అగ్నిపర్వతాలు ఏర్పడేందుకు కారణమవుతూంటుంది. టెక్టానిక్‌ ఫలకాలు దూరం దూరంగా జరగడం వల్ల భారీ లోయలూ పుడతాయి. సెయింట్‌ ఆండ్రియాస్‌ ఇందుకు ఒక ఉదాహరణ. 

️వెనెజువెలాలో ఏం జరిగింది?: దక్షిణ అమెరికాలోని వెనెజువెలా సౌత్‌ అమెరికన్, కరీబియన్‌ ఫలకాల సంగమ స్థలిలో ఉంటుంది. కరీబియన్‌ ఫలకం తూర్పు వైపునకు కదులుతూ సౌత్‌ అమెరికన్‌ ఫలకంపై ఒత్తిడిని పెంచుతూంటుంది. బోకాన్, సాన్‌ సెబాస్టియన్, ఎల్‌ పిలర్, మోర్న్‌ ప్రాంతాల్లోని ఫాల్ట్‌ జోన్లలో ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బుధవారం నాటి భూకంపాలు ఈ ఫాల్ట్‌ జోన్లు ఉన్న చోటే సంభవించడం గమనార్హం.  

మూడు ఫలకాల రాపిడి: జపాన్‌లో భూకంపాలు నిత్యకృత్యం అంటే అతిశయోక్తి కాదు. పసిఫిక్, ఫిలిప్పీన్, యురేసియన్‌ ఫలకాలు మూడూ ఇక్కడే కలుసు కుంటూండటం ఇందుకు ఒక కారణం. బుధవారం నాటి భూకంపం ఇవాటే ప్రాంతంలో సుమారు 50 కిలోమీటర్ల లోతులో సంభవించింది. 

సాన్‌ ఆండియాస్‌ ఫాల్ట్‌: కాలిఫోర్నీయాలో తరచూ సంభవించే భూకంపాలు సాన్‌ ఆండ్రియాస్‌ ఫాల్ట్‌ వల్లనే. ఇక్కడ పసిఫిక్‌ ఫలకం నార్త్‌ అమెరికన్‌ ఫలకం కింది నుంచి వెళుతూంటుంది. బుధవారం సాయంత్రం కాలిఫోర్నీయాలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement