మృత్యుంజయులు వీరు  | Father and son rescued after four days buried under rubble of Venezuela earthquakes | Sakshi
Sakshi News home page

మృత్యుంజయులు వీరు 

Jun 30 2026 5:22 AM | Updated on Jun 30 2026 5:22 AM

Father and son rescued after four days buried under rubble of Venezuela earthquakes

కారకస్‌: జంట భూకంపాల తాకిడికి అల్లాడిపోయిన వెనెజువెలా తేరుకుంటోంది. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు జరుపుతున్న సహాయక చర్యలూ ఊపందుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం 7.2, 7.5 తీవ్రతలతో సంభవించిన భూకంపాల కారణంగా ఇప్పటివరకూ 1,700 మంది మరణించగా సుమారు 3,150 మంది గాయపడ్డారు. ఇంకో 50,000 మందికిపైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. భూకంపాల తాకిడికి సుమారు 189 భవనాలు ధ్వంసమయ్యాయి.

 భవన శిథిలాల కింది నుంచి ఇప్పటివరకూ 33 మంది ప్రాణాలతో కాపాడటం విశేషం. తాజాగా ఆదివారం రాజధాని కారకస్‌కు సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని కారాబెల్లెడా వద్ద ప్రాంతంలో ఫ్రాన్స్, వర్జీనియాలకు చెందిన సహాయక బృందాలు తండ్రీ కొడుకులు ఇద్దరిని శిథిలాల నుంచి వెలికితీశాయి. నాలుగు రోజులుగా శిథిలాల కిందే చిక్కుకుపోయిన ఆ తండ్రి కాళ్లను చూసిన సహాయకులు నెమ్మదిగా అతడిని బయటకు తీశారు. 

తిండితిప్పల్లేకపోవడంతో చాలా బలహీనంగా ఉన్న ఆయన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ను గట్టిగా పట్టుకుని కనిపించారు. రక్షించిన వెంటనే అతడికి అత్యవసర వైద్యం అందించారు. కొంత సమయానికే ఆ ప్రాంతంలోనే ఒక యువకుడిని సైతం గుర్తించి రక్షించారు. వీరిద్దరూ తండ్రీకొడుకులని తెలిసింది. సహాయక బృందాల హర్షాతిరేకాల మధ్య తండ్రీకొడుకులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.

 బుధవారంనాటి జంట భూకంపాల తర్వాత వేలాది మంది గల్లంతైన నేపథ్యంలో సామాన్య పౌరులు శిథిలాల కింద క్షతగాత్రుల కోసం అన్వేíÙంచడం మొదలుపెట్టారు. ఒకట్రెండు రోజుల తరువాత పలు దేశాల నుంచి వచ్చిన స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో శనివారం లా గుయేరా నగరంలో కూలిపోయిన అపార్ట్‌మెంట్‌ శిథిలాల నుంచి పలువురు పసికందులు, 12 ఏళ్ల బాలుడిని రక్షించినట్లు సమాచారం. వీరితోపాటే ఓ పెంపుడు కుక్క సురక్షితంగా బయటపడింది. 

లా గువైరాలో మళ్లీ ప్రకంపనలు 
భూకంపం తీవ్ర ప్రభావం చూపిన లా గువైరా రాష్ట్రంలో సోమవారం మరోసారి భూమి కంపించింది. ఈ ప్రకంపన తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.6గా నమోదైంది. అమెరికా జియోలాజికల్‌ సర్వే మాత్రం దీని తీవ్రత 5.1దాకా ఉందని తెలిపింది. వెనెజువెలా కరీబియన్‌ తీరంలోని కారాబల్లెడాకు 27 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనం సంభవించినట్లు అధికారులు తెలిపారు. నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 

కారకస్‌లో భారత్‌ ఆర్మీ ఫీల్డ్‌ హాస్పిటల్‌ 
ఆపరేషన్‌ అమిస్తాడ్‌లో భాగంగా భారత ఆర్మీ వెనెజువెలా రాజధాని కారకస్‌లో 24 గంటలూ సేవలందించే ఫీల్డ్‌ హాస్పిటల్‌ను ప్రారంభించింది. ఇంటర్నేషనల్‌ లా రింకోనాడా రేస్‌ ట్రాక్‌ వద్ద ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని భారత దౌత్యకార్యాలయం తెలిపింది. అత్యంత అనుభవజ్ఞులైన వైద్యులు భూకంప బాధితులకు అన్ని సేవలను ఉచితంగా అందజేస్తారంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement