అక్కడ లేదు ఇక్కడ రాదు | Techies returning to India face challenges | Sakshi
Sakshi News home page

అక్కడ లేదు ఇక్కడ రాదు

Jun 28 2026 3:49 AM | Updated on Jun 28 2026 3:49 AM

Techies returning to India face challenges

భారత్‌కు తిరిగి వస్తున్న టెకీలకు దొరకని కొలువులు

అమెరికాలో పొందిన అధిక వేతనమే అడ్డంకి

దేశీయంగా పరిమిత సంఖ్యలో వీరికి అవకాశాలు

కీలక రోల్స్‌ కాంట్రాక్ట్‌ కింద నియామకం

రెండున్నరేళ్లలో 32 వేల మంది ఇంటికి

సాక్షి, హైదరాబాద్‌: ఒరాకిల్, సిస్కో, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటి అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. వీరిలో భారతీయులూ ఉన్నారు. పరాయి గడ్డ మీద దిగ్గజ కంపెనీల్లో పనిచేసి ఉపాధి కోల్పోయిన వీరు భారత్‌లో తిరిగి ఉద్యోగాలు పొందడానికి కష్టపడుతున్నారు. మంచి అనుభవం, అంతర్జా తీయ ప్రాజెక్ట్‌ ఎక్స్‌పోజర్, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నా కూడా చాలామంది తిరిగి వచ్చిన వెంటనే స్థిరమైన ఉద్యోగం పొందలేకపోతు న్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన, 280 బిలియన్‌ డాలర్ల ఔట్‌సోర్సింగ్‌ పరిశ్రమలో మునుపెన్నడూ లేని మందగమనాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.

అక్కడేమో ఏడాదికి రూ. కోటి
ప్రత్యేక స్టాఫింగ్‌ సంస్థ ఎక్స్‌ఫెనో గణాంకాల ప్రకారం 2026లో ఇప్పటివరకు సుమారు 7,300 మంది అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ సంఖ్య 2025లో 15,100, అంతక్రితం సంవత్సరంలో 9,700గా ఉందని అంచనా. అంటే రెండున్నరేళ్లలో 32 వేల మందికిపైగా ఇంటిబాట పట్టారు. ఇప్పటికే దేశీయ జాబ్‌ మార్కెట్‌లో అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. యూఎస్‌లో వీరు అధిక వేతనాలను అందుకున్నారు. రూ. కోటికిపైగా వార్షిక వేతనం అందుకున్నవాళ్లే అత్యధికం. ఇక్కడా అదే స్థాయి వేతనాలను వీరు ఆశిస్తున్నారు. దీంతో భారత్‌కు తిరిగివచ్చిన టెకీలకు ఉద్యోగాలు దొరకడం లేదు. కంపెనీలు నియామకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో జూన్‌లో ఇది 28 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో అవకాశాలున్నా.. అధిక ప్యాకేజీ డిమాండ్‌ చేస్తుండటంతో వీరి నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. అమెరికాలో పనిచేసిన అనుభవంతో తిరిగి వచ్చే అభ్యర్థులు అక్కడి స్థాయికి దగ్గరగా జీతం కోరుతున్నారు. కానీ మన దేశంలోని సంస్థలు, ముఖ్యంగా స్టార్టప్స్, మధ్యస్థాయి కంపెనీలు అంతటి ప్యాకేజీలను ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడం సమస్యను పెంచుతోంది. ఒకవైపు అమెరికా నుంచి తిరిగివస్తున్న నిపుణులు.. మరోవైపు స్థానికంగా కొత్తగా ఉద్యోగాలు వెతుకుతున్న యువ టెకీలు.. ఈ రెండు వర్గాలకు సరిపడే వేగంతో నియామకాలు జరగడం లేదు.

ఉద్యోగ సంక్షోభం
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 204 టెక్‌ కంపెనీలు 1,21,516 మంది నిపుణులను తొలగించాయి. వీటిలో ఒక్క అమెరికాకు చెందిన మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలలో లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఎంతమంది హెచ్‌–1బీ వంటి నైపుణ్యం కలిగిన కార్మిక వీసాలపై ఉన్నారనేది స్పష్టత లేదు. నియామకాల్లో ఏఐ భారీ మార్పును సృష్టిస్తున్న సమయంలోనే ఈ ఉద్యోగ సంక్షోభం ఏర్పడింది. తిరిగి రావాలనుకునే హెచ్‌–1బీ కార్మికులకు సహాయపడే ఎక్స్‌హెచ్‌1బీ ప్లాట్‌ఫామ్‌లో ఐదు నెలల్లో 500–600 మంది సైన్‌ అప్‌ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తిరిగి వచ్చిన వారికి ఉద్యోగం కనుగొనడం మునుపటి కంటే చాలా కష్టంగా మారిందని స్టాఫింగ్‌ కంపెనీలు చెబుతున్నాయి. ‘చాలామంది అధిక వేతన శ్రేణిలో వస్తారు. ఇక్కడి వారితో సమానమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారు. కాబట్టి ఉద్యోగం పొందడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిందే’ అని టీమ్‌లీజ్‌ తెలిపింది.

ఫ్రాక్షనల్‌ సీఎక్స్‌ఓలకు...
కొన్ని జీసీసీలు, స్టార్టప్స్‌ అనుభవజ్ఞులైన టాలెంట్‌ను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, డేటా, క్లౌడ్, ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. అయితే అవి ఎక్కువగా సీనియర్‌ ప్రొఫెషనల్స్‌కే పరిమితం అవుతున్నాయి. అందుకే అమెరికా నుంచి వచ్చిన అనేకమంది టెకీలు కంపెనీలకు ‘ఓవర్‌ క్వాలిఫైడ్‌’గా కనిపిస్తున్నారు. అయితే నిర్దిష్ట రంగంలో ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసిన వారికి జీసీసీల నుండి డిమాండ్‌ ఉంటోంది. ప్రాడక్ట్‌ కంపెనీల్లో పనిచేసిన అమెరికా రిటర్నీలకు ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్‌లు, జీసీసీలలో హెచ్‌ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్‌ విభాగాలలో తక్షణమే లీడర్‌షిప్‌ రోల్స్‌లో ఉద్యోగులు అవసరమైనందున ఫ్రాక్షనల్‌ సీఎక్స్‌ఓలకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. 2020 నుంచి పోలిస్తే ఫ్రాక్షనల్‌ సీఎక్స్‌ఓ రోల్స్‌ మూడు రెట్లు పెరిగాయని ‘టీమ్‌లీజ్‌’ చెబుతోంది. అదేస్థాయి నైపుణ్యం కోసం ఒకరిని పూర్తి సమయం నియమించుకోవడంతో పోలిస్తే ఇలాంటి రోల్స్‌తో కంపెనీలు సాధారణంగా 40–60 శాతం ఆదా చేస్తున్నాయి. పైగా ఈ రోల్స్‌ను చేపట్టడానికి సిద్ధంగా ఉన్న అనుభవజ్ఞులైన నిపుణుల కొరత ఉందని పరిశ్రమ చెబుతోంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement