‘కాక్రోచ్‌’ స్ఫూర్తితో మరో కొత్త పార్టీ! | Salaries Quick Calls And a New Cockroach Inspired Party | Sakshi
Sakshi News home page

‘కాక్రోచ్‌’ స్ఫూర్తితో మరో కొత్త పార్టీ!

May 27 2026 10:50 AM | Updated on May 27 2026 12:18 PM

Salaries Quick Calls And a New Cockroach Inspired Party

క్విక్‌ కాల్?” అనే మెసేజ్ చూడగానే క్యాలెండర్‌లో ఫ్రీ స్లాట్ వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఒక్క స్లైడ్‌లో చెప్పాల్సిన విషయం 10 స్లైడ్స్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌గా సా..గిపోతూ చివరికి మీటింగ్ టైమ్ కూడా మించి పోవడం. మనమంతా ఒక కుటుంబం (We are a family) అనే హెచ్‌ఆర్‌ మాట… పనిభారం పెరిగిన ప్రతిసారి గుర్తొచ్చే ఒకరకమైన ఫీలింగ్. కార్పొరేట్ ఉద్యోగుల్లో కలిగే ఈ అనుభవాలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యంగ్య రూపంలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

రోజువారీ పనిలో భాగంగా మారిపోయిన ఈ చిన్న చిన్న ఒత్తిడులు, మీటింగ్ కల్చర్, ప్రెజెంటేషన్ల పొడవు, పని–వ్యక్తిగత జీవితం మధ్య సరిహద్దులు మసకబారడం వంటి అంశాలు.. ఇప్పుడు హాస్యరూపంలో ఒక పెద్ద ఆన్‌లైన్ సంభాషణగా మారాయి. సాధారణంగా ఉద్యోగులు లోపలే పేరుకుపోయే అసహనం.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక సార్వత్రిక అనుభవంగా మారి అందరినీ కనెక్ట్ చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే కాక్రోచ్‌ జనతా పార్టీ అనే మీమ్ ట్రెండ్ నుంచి ప్రేరణ పొందుతూ “కార్పొరేట్‌ మజ్‌దూర్‌ జనతా పార్టీ (CMJP)” అనే సెటైరిక్‌ క్యాంపెయిన్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కార్పొరేట్ జీవితంలోని ఒత్తిడిని, అలసటను వ్యంగ్యంగా రాజకీయ రూపంలో చూపిస్తూ ఈ ట్రెండ్ మరింత చర్చకు దారి తీస్తోంది.

గుర్గావ్‌కు చెందిన అమెజాన్‌ మాజీ ఉద్యోగి శుభం కుమార్ మిట్టల్ ‘లింక్డిన్‌’లో చేసిన ఒక సెటైరికల్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈయనే ఈ సీఎంజేపీ ప్రకటిస్తూ ఒక వ్యంగ్య మేనిఫెస్టోను పంచుకున్నారు. ఈ పోస్ట్ ఉద్యోగుల్లోని అలసట, పని ఒత్తిడి, కార్పొరేట్ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని సరదాగా రాజకీయ రూపంలో చూపించింది. కాక్రోచ్‌ పార్టీ మీమ్ ట్రెండ్ నుంచి స్ఫూర్తి తీసుకున్న ఈ కాన్సెప్ట్, కార్పొరేట్ ఉద్యోగుల దైనందిన సమస్యలను ఫన్నీ మేనిఫెస్టోలా చూపించారాయన.

ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి పలు సరదా ప్రతిపాదనలు ఉన్నాయి. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని “అనవసరంగా ఎక్కువ పని దినాలు”గా పేర్కొనడం, “క్విక్‌ కాల్‌?” అనే మాటను అధికారికంగా వర్క్‌ప్లేస్ ఒత్తిడిగా గుర్తించాలన్న సూచన, అలాగే జీతంలో కంపెనీ చూపే మొత్తం (CTC).. చేతికి వచ్చే జీతం మధ్య తేడాలపై ప్రత్యేక దర్యాప్తు జరగాలన్న డిమాండ్‌లు ఉన్నాయి.

ఇంకా వెటకారంగా.. వరుసగా మూడు సార్లు ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రత్యేకంగా “ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్” ఇవ్వాలని కూడా ఈ వ్యంగ్య మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే 50 స్లైడ్స్ కంటే ఎక్కువ ఉన్న పీపీటీలను ఉద్యోగుల మానసిక ఒత్తిడికి కారణమని గుర్తించాలని సూచించారు. “We are a family” అనే హెచ్‌ఆర్‌ మాటను.. ఉద్యోగులను ఒప్పించడానికి వాళ్లు ఉపయోగించే భావోద్వేగ పద్ధతిగా చూడాలని కూడా ఇందులో ఆయన ప్రస్తావించారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవ్వడంతో లింక్టిన్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది కార్పొరేట్ ఉద్యోగులు ఈ అంశాలు తమ రోజువారీ అనుభవాలకు చాలా దగ్గరగా ఉన్నాయని కామెంట్లు చేశారు. కొందరు అయితే ఇది జోక్ అయినప్పటికీ “చాలా నిజంగా అనిపిస్తోంది” అని పేర్కొన్నారు.

అయితే ఆశ్చర్యకరంగా.. “Corporate Majdoor Janta Party” అనే పేరుతో ఒక వెబ్‌సైట్ కూడా ప్రత్యక్షమవ్వడం ఈ ట్రెండ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఆ సైట్‌లో జాయిన్‌ ద మూమెంట్‌ అనే ఆహ్వానం ఉండటంతో ఇది సాధారణ పోస్ట్ నుంచి ఒక పెద్ద ఇంటర్నెట్ క్యాంపెయిన్‌గా మారినట్లు కనిపిస్తోంది. ఒక సాధారణ LinkedIn వ్యంగ్య పోస్ట్‌గా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగుల అలసట, పని ఒత్తిడి, కార్యాలయ సంస్కృతి మీద ఉన్న అసంతృప్తిని హాస్యరూపంలో బయటపెడుతున్న ఒక వైరల్ సోషల్ మీడియా ఉద్యమంగా మార్చేయడం గమనార్హం.

అది ఇది కాదు.. 
ఇదిలా ఉంటే.. ప్రముఖ కమెడియన్ అన్మోల్ గర్గ్ కూడా ఇదే థీమ్‌పై వీడియోలు చేస్తూ ఈ ట్రెండ్‌కు మరింత ప్రచారం కల్పిస్తున్నారు. కార్పొరేట్ జనతా పార్టీ (Corporate Janata Party - CJP) పేరుతో కార్పొరేట్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న లేఆఫ్‌లు, వేధింపులు, తక్కువ హైక్‌లు, టాక్సిక్ వర్క్ కల్చర్‌లపై నిరసనగా ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించారాయన. అయితే దీనికంటూ కొన్ని లక్ష్యాలను ఆయన నిర్దేశించుకున్నారు. లేఆఫ్ ఇన్సూరెన్స్: ఉద్యోగం నుండి తొలగిస్తే ప్రభుత్వాలు లేదంటే కంపెనీలు భద్రత కల్పించడం. మూన్‌లైటింగ్ (Moonlighting): ఒక ఉద్యోగి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేయడానికి అనుమతి. పని వేళలు: కార్యాలయ వేళల తర్వాత ఫోన్ కాల్స్, మెయిల్స్ బంద్ చేయడం. జీతాల పెంపు: ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ శాతంలో హైక్ ఇవ్వడం.. ఇందులో ఉన్నాయి. ఇది కేవలం ఒక మీమ్ పేజీ లా కాకుండా, ప్రైవేట్ రంగ ఉద్యోగుల హక్కుల కోసం ఏర్పాటయిన ఒక వర్క్‌ఫోర్స్ ఉద్యమంగా వైరల్ అయింది. అయితే, కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో దీని ఖాతాలు బ్యాన్ కావడంతో ఉద్యోగుల సంఘీభావంతో ఇది మరింత చర్చనీయాంశమైంది కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement