breaking news
hesitation
-
NATO Summit: బైడెన్.. మళ్లీ తడబడెన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టువీడటం లేదు. అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలంటూ ఇంటా బయటా డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నా ఆ ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధ్దలు కొట్టారు. 81 ఏళ్ల వయసులోనూ రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి మరోసారి అధ్యక్షునిగా పని చేసే సామర్థ్యం తనలో పుష్కలంగా ఉందని చెప్పుకొచ్చారు. నాటో శిఖరాగ్రం ముగింపు సందర్భంగా గురువారం బైడెన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వయసు, ఫిట్‌నెస్‌పై పెరిగిపోతున్న సందేహాల్లో పస లేదని నిరూపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. అయితే గంటకు పైగా జరిగిన ఈ భేటీలోనూ ఆయన తడబాట్ల పర్వం కొనసాగడం డెమొక్రాట్ల శిబిరంలో ఆందోళనలను మరింత పెంచింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అనబోయి ట్రంప్ అంటూ బైడెన్ తికమకపడ్డారు! అధ్యక్ష రేసు నుంచి మీరు తప్పుకుంటే ట్రంప్‌ను ఓడించే సత్తా హారిస్‌కు ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘అధ్యక్షునిగా పని చేయగల అర్హత, సత్తా ట్రంప్‌కు ఉన్నాయి. కనుకనే ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నా’’ అన్నారు. దాంతో అంతా అవాక్కయ్యారు. అయినా బైడెన్ తన వ్యాఖ్యలను సరిచేసుకోలేదు. అంతకుముందు నాటో వేదికపై కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని సభ్య దేశాల ప్రతినిధులకు ‘అధ్యక్షుడు పుతిన్’ అంటూ పరిచయం చేశారు!! జెలెన్స్కీ దీన్ని తేలిగ్గా తీసుకుంటూ నవ్వేసినా ప్రతినిధులంతా తెల్లబోయారు. ఈ నేపథ్యంలో బైడెన్ మానసిక ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలు మరింత పెరిగాయి. అయితే వైద్యులు సూచిస్తే మానసిక పరీక్షలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘‘అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇప్పటిదాకా మూడుసార్లు న్యూరో పరీక్షలు చేయించుకున్నా. తాజా పరీక్ష గత ఫ్రిబ్రవరిలో జరిగింది. నేను మానసికంగా ఫిట్‌గా ఉన్నాననేందుకు అధ్యక్షునిగా నేను తీసుకుంటున్న రోజువారీ నిర్ణయాలే రుజువు. కానీ నేనెంత చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదు’’ అంటూ వాపోయారు! అయితే తన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో భయాలను దూరం చేయాల్సిన అవసరముందని అంగీకరించారు. బ్రహా్మండంగా పని చేశా అధ్యక్ష ఎన్నికల్లో తలపడేందుకు అత్యంత అర్హున్ని తానేనని బైడెన్ చెప్పుకున్నారు. ‘‘ట్రంప్‌ను ఓసారి ఓడించా. మళ్లీ ఓడించి తీరతా. అప్పుడే ఏమీ అయిపోలేదు. ప్రచారంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’’ అన్నారు. నాలుగేళ్లలో అమెరికాను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానంటూ గణాంకాలు ఏకరువు పెట్టారు. ఆర్థిక రంగంలో తన పనితీరు చాలా బాగుందని ఏకంగా 16 మంది నోబెల్ గ్రహీతలైన ఆర్థికవేత్తలు కితాబిచ్చారని చెప్పుకున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంతో పాటు ఎలాంటి కార్యక్రమాలూ పెట్టుకునేది లేదని తానన్నట్టు వచి్చన వార్తలను బైడెన్ ఖండించారు. విదేశీ వ్యవహారాలు తదితరాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గాజా ఆక్రమణ కూడదంటూ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూను, ఉక్రెయిన్‌పై యుద్ధంలో మద్దతివ్వొద్దంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను హెచ్చరించానని చెప్పుకొచ్చారు. రష్యాతో సాన్నిహిత్యానికి చైనా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. లాడెన్‌ను చంపగానే అఫ్గాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగాల్సిందన్నారు.ట్రంప్ విసుర్లు బైడెన్ తనను ఉపాధ్యక్షునిగా పేర్కొనడంపై ట్రంప్ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘బిగ్ బోయ్ జో మీడియా భేటీ మొదట్లోనే నన్ను తన ఉపాధ్యక్షునిగా చెప్పుకు న్నారు’’ అని ఎద్దేవా చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.పెరుగుతున్న వ్యతిరేకత తనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సొంత పార్టీ నేతలు, ఎంపీల విశ్వాసాన్ని చూరగొనడమే లక్ష్యంగా తాజా మీడియా సమావేశంలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. కానీ ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారని పరిశీలకులు అంటున్నారు. బైడెన్ తప్పుకోవాలని సమావేశం ముగియగానే ముగ్గురు ప్రముఖ డెమొక్రాట్ ఎంపీలు జిమ్ హైమ్స్, స్కాట్ పీటర్స్, ఎరిక్ సొరెన్సన్ పిలుపునిచ్చారు! దాంతో ఆయన వైదొలగాలని డిమాండ్ చేస్తున్న సొంత పార్టీ ఎంపీల సంఖ్య 17కు పెరిగింది. నిజానికి గత నెల సీఎన్ఎన్ చానల్లో జరిగిన తొలి అధ్యక్ష డిబేట్లో ట్రంప్ ముందు బైడెన్ పూర్తిగా తేలిపోవడం తెలిసిందే. దానితో పోలిస్తే తాజా మీడియా భేటీలో ఆయన మెరుగ్గానే మాట్లాడారు. తాను తీరిక లేని షెడ్యూల్‌తో బిజీగా గడుపుతుంటే ట్రంప్ మాత్రం గోల్ఫ్ ఆడుతూ సేదదీరుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ నాలుగేళ్ల పాలనలో అస్తవ్యస్తం చేసిననాటో కూటమిని ఎంతగానో శ్రమించి ఒక్కతాటిపైకి తెచ్చా. నాటో శిఖరాగ్రంలో పాల్గొన్న దేశాధినేతలెవరూ నా ఫిట్నెస్ను, మానసిక ఆరోగ్యాన్ని సందేహించలేదు. పైపెచ్చు ట్రంప్ మళ్లీ రావొద్దని, నేనే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు’’ అని అన్నారు.ఒబామా, పెలోసీ కూడా... బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాటిక్ పార్టీ నేతల జాబితాలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ కూడా చేరుతున్న సూచనలు కని్పస్తున్నాయి. ట్రంప్‌ను ఓడించడం బైడెన్‌కు తలకు మించిన పనేనని వారిద్దరూ తాజాగా ప్రైవేటు సంభాషణలో అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. నాటో శిఖరాగ్రం అనంతరం బైడెన్ మీడియా సమావేశం చూసి వారు మరింతగా పెదవి విరిచినట్టు డెమొక్రటిక్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘‘బైడెన్ అధ్యక్ష అభ్యరి్థత్వం దాదాపుగా ముగిసిన కథే. ఆయనకు మనస్తాపం కలగకుండా, పార్టీ అవకాశాలు దెబ్బ తినకుండా దీన్ని ప్రకటించడం ఎలాగన్నది మాత్రమే తేలాల్సిలి ఉంది. బహుశా బైడెన్ తనంత తానుగా తప్పుకుంటారని ఒబామా, పెలోసీ భావిస్తున్నారు. లేదంటే ఆయనకు నచ్చజెప్పి తప్పించే బాధ్యత తీసుకోగలిగింది వారిద్దరే’’ అని పేర్కొంటున్నాయి. ఈ విషయమై ఉన్నత స్థాయి డెమొక్రాట్ నేతలు గురువారం ఉదయం పెలోసీతో సమావేశమైనట్టు అమెరికా మీడియా పేర్కొంది. ‘‘ఇక ట్రంప్‌ను ఓడించడం బైడెన్‌కు శక్తికి మించిన పనేనన్న అభిప్రాయంతో పెలోసీ కూడా ఏకీభవించారు. అయితే నాటో శిఖరాగ్రం జరుగుతున్న నేపథ్యంలో దేశాధినేతల ముందు బైడెన్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదని, కనీసం ఒక రోజన్నా ఆగాలని సూచించారు. దాంతో బైడెన్‌ను తప్పించేందుకు ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్టు తేలిపోయింది. అందుకే భేటీ తర్వాత పలువురు డెమొక్రాట్ ఎంపీలు బైడెన్ తప్పుకోవాలని బాహాటంగా డిమాండ్ చేశారు’’ అంటూ యూఎస్ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. -
ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు
ఆర్బీఐ ఆంక్షలు విధించినప్పటి నుంచి ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం (Paytm) ఏదో ఒక అంశంలో రోజూ వార్తల్లో నిలుస్తోంది. దీని షేరు విలువ రెండు రోజుల్లో 15 శాతం పడిపోయింది. పేటీఎం భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆ సంస్థ ఉద్యోగులు బయటి అవకాశాల కోసం చూస్తున్నారు. కానీ వారికో చిక్కు వచ్చిపడింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లలో అనతి కాలంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగిన పేటీఎం.. ఉద్యోగులకు మంచి జీతాలు చెల్లించడంలో ప్రసిద్ధి చెందింది. పరిశ్రమ సగటు కంటే ఎక్కువ జీతాలు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఉద్యోగులు ఆ సంస్థను వీడి ఇతర కంపెనీల వైపు చూస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలు, ఇతర స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులపై దృష్టి పెట్టాయి. కానీ వారికి జీతాలే సమస్యగా మారాయి. వెనకాడుతున్న స్టార్టప్‌లు రిక్రూట్మెంట్ సర్వీసెస్, జాబ్ సెర్చ్ సంస్థల వర్గాల ప్రకారం, పేటీఎం ఉద్యోగులు పరిశ్రమ ప్రమాణాల కంటే 20-30 శాతం ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పేటీఎం ఉద్యోగుల పాలిట శాపమైందని, దీని కారణంగానే చాలా స్టార్టప్‌లు పేటీఎం ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడుతున్నారని ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. పేటీఎం ప్రస్తుతం తమ కార్యకలాపాలపై నియంత్రణాపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అందులోని చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతమైన పర్వాలేదని ఉద్యోగాలు మారడానికి సిద్ధంగా ఉన్నారని నివేదిక వివరిస్తోంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత ఎటువంటి కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, కార్డ్‌లపై తదుపరి డిపాజిట్లు తీసుకోవద్దని, క్రెడిట్ లావాదేవీలు, టాప్-అప్‌లను నిర్వహించవద్దని ఆర్బీఐ జనవరి 31న ఆదేశించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పేటీఎం బ్రాండ్ అయిన One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌కి అనుబంధ సంస్థ. -
తడబాటు తప్పదేమో..!
ముంబై: ఈ వారంలోనూ స్టాక్ మార్కెట్‌కు తడబాటు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పోరేట్ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు మార్కెట్ తీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయని వారంటున్నారు. అలాగే వచ్చే బడ్జెట్లో ప్రయోజనాలపై అంచనాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా బుధవారం (26న) మార్కెట్‌కు సెలవు దినం కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. జనవరి ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు గురువారం ముగియనుంది. ఈ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఒడిదుడుకుల ట్రేడింగ్ తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్ ట్రేడింగ్, కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో గతవారంలో సూచీలు మూడున్నర శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. వారం మొత్తంగా సెన్సెక్స్ 2,186 పాయింట్లు, నిఫ్టీ 639 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగవారం(జనవరి 25న) మొదలై.., 26వ తేదిన(బుధవారం)ముగియనున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమైన వేళ యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ రెండేళ్ల గరిష్టానికి, క్రూడాయిల్ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడంతో ఫెడ్ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. ఇక ఈ వారంలో సుమారు 360 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇందులో అధిక భాగం బ్యాంకింగ్ రంగానికి చెందిన కంపెనీలు. -
భావి భారత విధాతలు
సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగానే కాకుండా స్వపరిపాలనా దినోత్సవంగా కూడా జరుపుకుంటాం!ఈ సందర్భంగా విజయవాడలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెమొరియల్ స్కూల్లో పిల్లల్ని ‘సాక్షి’ కలిసింది! ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లలేక ఈ బంగారాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు! పేదరికం... ఒంటిమీదున్న బట్ట, కడుపులోని ఆకలితో కనబడుతుందేమో కానీ,ఈ పిల్లల కళ్లలో, మాటల్లో మాత్రం మహోన్నతమైన సంపద కనబడుతుంది. దేశానికి, సమాజానికి దిశను ఇవ్వగల నాయకుల్లా కనబడతారు. ఈ పిల్లల మాటలు విన్నాక ఇక వీసమెత్తు సంకోచం కూడా లేదు.. మన దేశ భవిష్యత్ నిజంగా బంగారమే! జైహింద్!! ‘‘అధ్యక్ష్యా..! మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం హామీలు చేశామో.. అన్నీ నెరవేర్చాం అధ్యక్ష్యా! రైతు రుణాలు మాఫీ చేశాం. ఉద్యోగాలు ఇచ్చాం.. అనుకున్న రీతిలో రాజధాని నిర్మాణం పనులు కూడా వేగవంతం చేస్తున్నాం. అంతేకాదు అధ్యక్ష్యా..! రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల క్షేమమూ చూస్తున్నాం. మన రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యం, విద్య, ఉపాధి మీదే దృష్టి పెట్టాం. హోం శాఖ కూడా శాంతి భద్రతలను అద్భుతంగా పరిరక్షిస్తోంది. అన్ని శాఖలూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి’’ అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పుకుపోతుండగానే..ప్రతిపక్షనేత లేచి.. ‘‘ఏం అభివృద్ధి అధ్యక్ష్యా..! ప్రజల్లోకి వెళితే తెలుస్తుంది అసలు నిజాలేంటో? రుణాలు మాఫీ కాక.. భారం పెరిగి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష్యా! ఇక.. భూములు ఇచ్చిన రైతులకు ఇంకో ఉపాధి అంటున్నారు.. అసలు సారవంతమైన ఆ నేలలను రాజధాని నిర్మాణం కోసమని కాంక్రీట్మయం చేస్తారా అధ్యక్ష్యా? ఎంత తప్పు! పర్యావరణానికి ఎంత హాని! అభివృద్ధి అంటే ఇదా అధ్యక్ష్యా?’’ అంటూ ముఖ్యమంత్రిని నిలదీశాడు. ‘‘అధ్యక్ష్యా..! ప్రతిపక్షనేతకు లెక్కలతో మా అభివృద్ధిని వివరిస్తాం’’ అంటూ ఆర్థిక మంత్రి ఇంకేదో చెప్పబోతుండగానే.. ప్రతిపక్షంలోని ఓ ఎమ్మేల్యే లేచి.. ‘‘లెక్కలు తెలియంది ఎవరికి అధ్యక్ష్యా! అన్నీ తెలుసు. అన్నీ చూస్తున్నాం..’’ అంటూ ఆర్థికమంత్రిని నిలువరించే ప్రయత్నం చేశాడు. ‘‘ఆడవాళ్ల భద్రత కోసం ఇది చేశాం.. వాళ్ల రక్షణ కోసం అది చేశాం.. అంటూ ముఖ్యమంత్రి సహా ఆయన మంత్రిగణమంతా ఊదరగొడ్తున్నారు అధ్యక్ష్యా! అంత చేస్తుంటే ఇన్ని నేరాలు ఎందుకు నమోదవుతున్నాయి అధ్యక్ష్యా..? మొన్నటికి మొన్న మా ఇంటి సందులోనే ఓ అమ్మాయి మీద దాడి జరిగింది. అంతకుముందు రాజధానిలోనే రెండు కేసులు నమోదయ్యాయి. ఇవి మన ముందు జరిగినవే.. మన వెనక, మనకు తెలియకుండా ఇంకా ఎన్ని జరుగుతున్నాయో? అధ్యక్ష్యా..! అధికార పార్టీ వాళ్లు చెప్తున్నదానికి.. బయట జరుగుతున్న దానికి ఏమన్నా పోలిక ఉందా అధ్యక్ష్యా?’’ అంటూ ఇంకో ఎమ్మెల్యే ప్రశ్నించాడు. ‘‘అవును అధ్యక్ష్యా..! ఒక్క భద్రత విషయమే కాదు ... మహిళల ఆరోగ్య విషయాన్నీ అటకెక్కించారు అధికార గణం వారు. రక్తహీనతతో బాధపడ్తున్న స్త్రీల విషయంలో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. అమరావతి నిర్మాణంలో చాలా బిజీగా ఉన్న మన ప్రభుత్వాన్ని కాస్త వీలు చూసుకొని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైపు ఒక్క అడుగు వేయమనండి అధ్యక్ష్యా..! వాటి పనితీరు ఎలా ఉందో తెలుస్తుంది’’ అని ఇంకో ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరును వేలెత్తి చూపుతున్నంతలోనే మరో ఎమ్మెల్యే లేచి ‘‘అధ్యక్ష్యా..! మనకు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అవుతోంది. అయినా ఏం అభివృద్ధి సాధించాం అధ్యక్ష్యా? ఫ్లై ఓవర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లా అధ్యక్ష్యా? 70 ఏళ్లకు పూర్వం బాల్య వివాహాల రద్దు కోసం పోట్లాడాం. అయినా రద్దు చేయగలిగామా? లేదు. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష్యా! ఆరో తరగతి చదువుతున్న అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేస్తున్నారు. పదహారేళ్లు నిండకుండానే పిల్లల్ని కని రక్తహీనతకు లోనవుతున్నారు. అనారోగ్యాల పాలవుతున్నారు.దీనికి సంబంధించిన లెక్కలు మా దగ్గర కూడా ఉన్నాయి అధ్యక్ష్యా..! మేమూ ఇస్తాం’’ అని ఆయన పూర్తిచేసే లోపే మహిళా ఎమ్మెల్యే నిలబడి.. ‘‘అధ్యక్ష్యా..! బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాం అంటూ అధికార పార్టీ గట్టిగా చెప్తోంది. మన అసెంబ్లీ ముందున్న హోటల్‌కి వెళ్లి చూడండి.. ఎంత మంది పిల్లలు పనిచేస్తున్నారో? దీనికి మించిన ఎగ్జాంపుల్ ఏముంటుంది అధ్యక్ష్యా? ఎంతో మంది పిల్లలు బడి లేక పాచి పనులు చేసుకుంటూ బాల్యాన్ని ఈడుస్తున్నారు అధ్యక్ష్యా.. ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడుంటుంది?’’ అని ప్రశ్నించింది. అధికార పక్షం తలవంచింది! గొడవలు, అరుచుకోవడాలు.. తిట్టుకోవడాలు లేకుండా ఇంత పద్ధతిగా.. హుందాగా ఎలా మారిందబ్బా మన అసెంబ్లీ అని ఆశ్చర్యం వేస్తోంది కదా! ఆవులించినంతలోనే ఆశ్చర్యం ఆవిరయ్యే మాట కూడా చదవండి.. అది నిజమైన అసెంబ్లీ కాదు.. మాక్ అసెంబ్లీ!విజయవాడ, సత్యనారాయణపురంలోని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మెమోరియల్ హై స్కూల్.. తొమ్మిదో తరగతి ‘బి’ సెక్షన్ పిల్లలు నిర్వహించిన మోడల్ అసెంబ్లీ. అసలు ఇది ఎక్కడ.. ఎలా మొదలైందీ అంటే...సెప్టెంబర్ 5.. తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఉపాధ్యాయుడిగా మొదలైన ఆయన ప్రస్థానం ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవుల దాకా సాగింది. అందుకే ఆయన పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా.. స్వపరిపాలనా దినోత్సవంగా జరుపుతోంది ప్రభుత్వం. ఆ సందర్భంగా ఈ స్కూల్లోని పిల్లలను కలిసింది ‘సాక్షి ఫన్డే’. ‘‘మీరే ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, హోం మినిస్టర్, ఆర్థిక మంత్రి, స్త్రీశిశు సంక్షేమ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ, ఎడ్యుకేషన్ మినిస్టర్... ఇలా పాలనా బాధ్యతలు నిర్వహించాల్సి వస్తే .. మీరేం చేస్తారు?’’ అని ప్రశ్నించాం క్లాస్ అందరినీ. నేటి పిల్లల్లో సామాజిక స్పృహ ఏదీ అని పెదవి విరిచే వాళ్లకు దీటైన సమాధానాలు ఇచ్చారు ఆ పిల్లలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలిపేస్తా..‘‘నేను ప్రైమ్‌మినిస్టర్ అయితే ముందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలిపేస్తా. విడిపోతే ఏం బాగాలేదు. అందరం కలిసే ఉండాలి. తెలంగాణ డెవలప్మెంట్ ఆగిపోయిందనే కదా.. విడిపోయింది. ఇప్పుడు కలిసిపోయి పాత తప్పులు మళ్లీ జరగకుండా చూస్తా.. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ.. అంతా సమానంగా డెవలప్ అయ్యేలా చూస్తా’’ అన్నాడు యు. శశి కుమార్ అనే విద్యార్థి. రైతులకే ప్రత్యేకతలు అబ్దుల్ రహీమ్ అనే అబ్బాయి ‘‘నేను ప్రైమ్‌మినిస్టర్ అయితే రైతులందరూ క్షేమంగా.. హ్యాపీగా ఉండేలా చూస్తా. మనది వ్యవసాయ ఆధారిత దేశం. రైతలు లేనిదే మనం లేము. రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తా. వాళ్లకే అన్ని ప్రత్యేకతలిస్తా’’అంటూ చెప్పాడు. షోయబ్ అఖ్తర్ అనే ఇంకో స్టూడెంట్ ‘‘నేను ముఖ్యమంత్రి అయితే కూడా రైతులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. వ్యవసాయరంగం ఆధారంగానే అభివృద్ధికి ప్లాన్చేస్తా..’’ అని అంటున్న అతని వాగ్ధాటిని అడ్డుకోవాల్సి వచ్చింది ‘‘అంటే ఎలా?’’ అనే ప్రశ్నతో. ‘‘వ్యవసాయాధారిత పరిశ్రమలు పెట్టాలి. ఎగ్జాంపుల్ పత్తి పండిస్తే.. కాటన్ పరిశ్రమ బాగా అభివృద్ధి అయ్యేలా చూస్తా. లోకల్‌గా ఉన్న వాళ్లకు ఎక్కువ జాబ్స్ ఇప్పిస్తా. జ్యూట్, ఆయిల్ పరిశ్రమలు వంటివాటిని బాగా డెవలప్ చేస్తా. పర్యావరణాన్నీ కాపాడేలా చర్యలు తీసుకుంటా. అడవులు నరికేయకుండా చట్టాలను స్ట్రిక్ట్‌గా అమలు చేస్తా. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మొక్కలు నాటిస్తా’’ అని షోయబ్ చెప్పబోతుంటే నౌషీన్ అనే అమ్మాయి ‘‘అవును. నేను కూడా మినిస్టర్ అయితే బాగా మొక్కలు నాటిస్తా. వర్షాలు పడ్డానికి ఎలాంటి వాతావరణం ఉండాలో అలాంటి వాతావరణం నెలకొల్పేలా చూస్తా. సైంటిస్ట్‌లతో ప్రజలకు ఉపయోగపడే పరిశోధనలు చేయిస్తా.. ఇప్పుడు కేరళకు వచ్చినటువంటి వరద ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటా. ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్‌ల సలహాలు తప్పకుండా వింటా’’ అని చెప్పుకొచ్చింది. క్యాస్ట్ లేకుండా చేస్తా.. ‘‘నేను ప్రధానమంత్రి అయితే.. దేశంలో కులం పోయేలా చేస్తా. చదువులో, ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండేలా చూస్తా. కులం వల్లనే మనకు ఇన్ని గొడవలు, ఇబ్బందులు. అవన్నీ పోవాలంటే కులం పోవాలి. డబ్బున్న వాళ్లు, లేని వాళ్లు సమానం కావాలి’’ అని చెప్పాడు జేవీఎస్ శ్రీకాంత్. అందరికీ చదువు.. ఆకతాయిలను పనిలో పెడతా‘‘నేను విమెన్ అండ్ చైల్డ్వెల్ఫేర్ మినిస్టర్ అవుతా. ఆడవాళ్ల సంక్షేమం కోసం పనిచేస్తా. ఆడవాళ్లు ఆరోగ్యంగా ఉంటేనే పిల్లలు బాగుంటారు. పిల్లలు బాగుంటేనే దేశం ఫ్యూచర్ బాగుంటుంది’’ అంది ఆవేశంగా వాణిశ్రీ అనే విద్యార్థిని. ఫణిభూషణ్ అనే అబ్బాయి ‘‘నేను హోం మినిస్టర్ అయితే.. ఆడపిల్లల మీద దాడులు జరగకుండా ఆపుతా. పనీపాట లేకుండా ఎవరూ రోడ్ల మీద తిరగకుండా చూస్తా. ఖాళీగా.. రోడ్ల మీద తిరుగుతూ.. అమ్మాయిలను ఏడిపిస్తూ ఎవరైనా కనపడితే ముందు వాళ్లను జైల్లో పెట్టకుండా పనిలో పెడతా. అయితే వాళ్లకు ఇన్ని గంటలే పని అని కాకుండా.. పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేయిస్తా. అట్లా వాళ్లకు పనిష్మెంట్ ఇస్తా. దాంతో వాళ్ల కాన్సన్ట్రేషన్ పనిమీదకే మళ్లుతుంది’’ అని చెప్పాడు. ట్రాఫిక్ కంట్రోల్చేస్తా.. బాల్య వివాహాలు ఆపుతా ‘‘నేను చీఫ్ మినిస్టర్.. కనీసం మినిస్టర్ అయినా సరే.. ముందు మన రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా. ప్రైవేట్ వాహనాలను రద్దు చేసి గవర్నమెంట్ వెహికిల్సే నడిచేలా చూస్తా. స్టూడెంట్స్‌తో ట్రాఫిక్ రూల్స్ మీద అందరికీ అవేర్నెస్ క్లాసెస్ ఇప్పిస్తా. అలాగే బాల్య వివాహాలు రద్దు చేస్తా. మా ఇంటి దగ్గర నా ఫ్రెండ్‌కి పదమూడేళ్లకే పెళ్లి చేశారు. ఒక యేడాది అయ్యేసరికి ఆ అమ్మాయి భర్త చనిపోయాడు. ఆ పిల్ల ఇప్పుడు వాళ్లమ్మవాళ్లింటికి వచ్చేసింది. చదువు లేదు. ఏదో గుళ్లో పనిచేసుకుంటోంది. ఆ అమ్మాయి లైఫ్ అలా పాడైపోయింది. అది చూసైనా ఆమె పేరెంట్స్ మారాలి కదా! మారకపోగా.. ఇప్పుడు వాళ్ల చెల్లికీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్ల చెల్లి వయసు ఇప్పుడు పన్నెండేళ్లు. నేను, నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వాళ్ల చెల్లికి చెప్పాం.. ‘‘పెళ్లిచేసుకోకు.. చదువుకో’’ అని. కాని వాళ్ల పేరెంట్స్ వినరని పెళ్లికి ఒప్పేసుకుంటోంది. అలాగే నా ఫ్రెండ్‌కీ చెప్పా.. ‘‘ఇప్పుడన్నా చదువుకో’’ అని. పని చేయకపోతే ఇంట్లో తిడతారు అని భయపడుతోంది. మా ఇంటి దగ్గరే నేను ఇలాంటి పరిస్థితులను చూస్తున్నానంటే దేశం మొత్తం మీద ఇంకా ఎన్ని ఉండొచ్చు? అందుకే ముందు ఆడపిల్లలందరికీ చదువు చెప్పిస్తా. బాల్యవివాహాలు రద్దు చేయిస్తా. దీనికోసం ఉన్న చట్టాలు స్ట్రిక్ట్‌గా అమలు అయ్యేలా చేస్తా’’ అని చెప్పింది వాణిశ్రీ. లంచం లేకుండా చేస్తా.. పేదలకు ఇల్లు కట్టిస్తా ‘‘నేను ఫైనాన్స్ మినిస్టర్ అవుతా. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తా. మన దేశంలో ఇల్లు లేనివాళ్లు ఉండకూడదు. అందరికీ పని కూడా ఇప్పిస్తా. విజిలెన్స్ వాళ్లతో చెప్పి ప్రభుత్వ పథకాలు అన్నీ సక్రమంగా అమలవుతున్నాయో లేదో చెక్చేయిస్తా. అవినీతి శాఖ వాళ్లు ఎప్పటికప్పుడు అలెర్ట్‌గా ఉండేలా చేస్తా. లంచం అనేదే లేకుండా చేస్తా. లంచం లేకుండా పోతే గవర్నమెంట్ పనులన్నీ కరెక్ట్‌గా టైమ్ వేస్ట్ కాకుండా జరుగుతాయి’’ హుషారుగా చెప్పాడు మదుసూధన్. ‘‘ఫైనాన్స్ మినిస్టర్‌కి ఇవన్నీ అధికారాలు ఉండవు తెల్సా? బడ్జెట్ ఒక్కటే నీ పని’’దుర్గా సత్యనారాయణ అనే అబ్బాయి అంటుంటే ‘‘తెలుసు.. కానీ అన్ని శాఖలతో ఫ్రెండ్షిప్ చేసి .. వాళ్ల హెల్ప్ తీసుకుంటా. వాళ్లకు నేను హెల్ప్ చేస్తా’’జవాబిచ్చాడు మధుసూదన్. లిక్కర్, సిగరేట్ బ్యాన్ చేస్తా.. ‘‘నేను ఎక్సైజ్ మినిస్టర్ అయి లిక్కర్, సిగరేట్, డ్రగ్స్ అన్నిటినీ బ్యాన్ చేస్తా. మా ఇంటి దగ్గర ఒక అంకుల్ 24 గంటలు తాగుతూనే ఉంటాడు. ఏ పనీ చేయడు. ఆంటీ, వాళ్ల పిల్లలు... నా కన్నా చిన్నవాళ్లు వాళ్లు.. పని చేసి డబ్బులు తెస్తారు. గొడవపడి ఆ డబ్బులు లాక్కెళ్లి మళ్లీ తాగుతుంటాడు ఆ అంకుల్. అందుకే వాటన్నిటినీ బ్యాన్ చేస్తా’’ అని కృపాప్రసాద్ అంటున్న మాటలకు పొడిగింపుగా లక్ష్మీపావని మాట్లాడుతూ ‘‘అవును.. వాటిని బ్యాన్ చేయాలి. గుట్కాను కూడా బ్యాన్చేయాలి. ఆరోగ్యానికి హానికరం అని వాటిమీదే ప్రింట్ చేసి మళ్లీ వాటినే అమ్ముతారెందుకు? అంటే ప్రజల హెల్త్ పాడైపోవాలనా? ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే పాలించే ప్రభుత్వం మనది అని పుస్తకాల్లో చెప్తారు. అదే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పాడయ్యే వస్తువులను అమ్ముతోంది ఎందుకు? బ్యాన్ చేయాలి కదా?’’ అంది. ‘‘వాటి మీద వచ్చే ఇన్‌కమ్‌తో వెల్ఫేర్ ప్లాన్స్ చేస్తుందట గవర్నమెంట్. అందుకే వాటిని బ్యాన్ చేయరట. కృపాప్రసాద్ నువ్వు ప్రైమ్‌మినిస్టర్ అయినా వాటిని బ్యాన్ చేయడానికి లేదు’’ చెప్పింది మహాలక్ష్మి. ‘‘ఎందుకు? అప్పుడు టాక్సెస్ బాగా పెంచాలి’’ సలహా ఇచ్చింది గ్రేస్ మేరీ. ‘‘ధరలు పెరిగితే మామూలు వాళ్లకు కూడా ప్రాబ్లమ్స్ తెల్సా?’’ మళ్లీ మహాలక్ష్మి. ‘‘అయితే నేను బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తా. దాంతో పేదవాళ్లకు చాలా చేయొచ్చు కదా లిక్కర్, సిగరేట్లు లేకుండానే’’ వెలుగుతున్న మొహంతో కృపాప్రసాద్. అమ్మాయిలు గోల్డ్‌మెడల్స్ కొట్టేలా.. ‘‘నేను కబడ్డీ ప్లేయర్‌ని. నేషనల్స్ ఆడాను. నేను చీఫ్ మినిస్టర్ అయితే.. అమ్మాయిలు స్పోర్ట్స్ బాగా ఆడేలా చూస్తా. వాళ్లు గోల్డ్ మెడల్స్ కొట్టేలా చేస్తా. పేద ఆడపిల్లలకు ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తా. కేవలం అమ్మాయిలకే కాదు.. పేదవాళ్లందరూ ఆటల్లో ఫస్ట్ ఉండేలా చేస్తా. స్పోర్ట్స్ కోటాలో వాళ్లందరికీ జాబ్స్ కూడా ఇప్పిస్తా’’ అంది లహరి. స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేస్తా.. ‘‘నేను వెల్ఫేర్ మినిస్టర్ అయితే పిల్లలు చూడని తల్లిదండ్రులందరి కోసం ఓల్డేజ్ హోమ్స్ కట్టిస్తా. ముందు వాళ్లను అందులో ఉంచాక.. వాళ్ల పిల్లను పిలిచి కౌన్సెలింగ్ ఇప్పిస్తా. ఆర్ఫనేజెస్ కూడా కట్టిస్తా’’ అని చెప్పాడు దుర్గా సత్యనారాయణ. ‘‘నేను ఏ మినిస్టర్ అయినా ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ బ్యాన్ చేయిస్తా. వాటిల్లో వచ్చే బ్లూవేల్ వంటి పిచ్చి గేమ్స్ వల్ల వాటికి అడిక్ట్ అయిపోయి పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే అమ్మాయిలంతా చదువుకునేలా చూస్తా. జాబ్స్‌లో వాళ్లకు రిజర్వేషన్స్ ఇప్పిస్తా’’ చెప్పింది ఆర్తీ. పావని అనే అమ్మాయి కంటిన్యూ చేస్తూ ‘‘అవును నేను కూడా చీఫ్ మినిస్టర్ అయినా, న్యాయశాఖ మంత్రి అయినా ఆడవాళ్లకు, పేదలకు న్యాయం జరిగేలా చూస్తా. అమ్మాయిలందరూ చదువుకునేలా చేస్తా’’ అని చెప్పింది. ప్రాజెక్ట్‌లు.. పక్కా ఇళ్లు కట్టిస్తా.. ‘‘నేను ఇరిగేషన్ మినిస్టర్ అయితే.. ముందు ప్రాజెక్ట్‌లు కట్టిస్తా. వాటర్ వేస్ట్ కాకుండా చూస్తా. ఒకవేళ చీఫ్ మినిస్టర్ అయితే.. మన దగ్గర ఇళ్లు లేనివాళ్లందరికీ ఇళ్లు కట్టిస్తా. అసలు ఇల్లు లేనివాళ్లు లేకుండా చూస్తా. ఇంకా ఆడపిల్లలు సేఫ్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటా. ప్రతి ఒక్కరు చదువుకునేలా చేస్తా. అమ్మాయిలు, అబ్బాయిలు ఈక్వల్‌గా ఉండేలా చట్టాలు తెస్తాను. ఇంట్లో తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్స్ ఇప్పిస్తా. నాకు ఒక అక్కయ్య ఉంది. మా పేరెంట్స్‌కు కూడా చెప్తుంటా..‘‘ నేను, అక్క ఈక్వల్’’ అని. ఇంట్లో పనులకు మా అక్కతో పాటు నేనూ అమ్మకు హెల్ప్ చేస్తుంటా. అట్లాగే దేశంలో అబ్బాయిలందరూ ఇలాగే ఉండేలా చూస్తా’’ అంటాడు దుర్గా సత్యనారాయణ. ‘‘నేను కూడా మా ఇంట్లో మా అమ్మకు, చెల్లికి హెల్ప్ చేస్తా. కూరలు తరుగుతాను, గిన్నెలు కడుగుతాను.. అన్ని పనులు చేస్తా’’చెప్పాడు అనిల్.‘‘నేను అగ్రికల్చర్ మినిస్టర్ అవుతా. రైతులందరికీ భూమి ఇస్తా. రుణమాఫీలు చేస్తా. పంటలు పండే నేలను పంటలకే ఉపయోగించేలా చేస్తా. అక్కడ ఫ్యాక్టరీలు.. బిల్డింగ్స్ కట్టకుండా బ్యాన్ చేస్తా’’ కంటిన్యూ చేశాడు అనిల్. మనకు మనమే ఆహార కొరత సృష్టించుకున్నట్టు.. ‘‘అనిల్ చెప్పినట్టు.. పంటలు పండే నేలను పంటలకే ఉంచాలి. దాంట్లో బిల్డింగ్స్ కట్టడం వల్ల ఆ నేలలో పండే పంటనంతా నష్టపోయినట్టే కదా మనం? అలా ఆహార కొరతను మనకు మనమే సృష్టించుకుంటున్నట్టు కదా! దీనివల్ల రైతులకే కాదు మనకూ నష్టమే. అందుకే పంటలు పండే నేలను పంటలకే కేటాయించేలా చూడాలి. నేను చీఫ్ మినిస్టర్ అయితే.. మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలనూ డెవలప్‌చేస్తా. ఏ ఊరికి ఏ ప్రత్యేకత ఉంటే ఆ ప్రత్యేకత ఇంకా పెరిగేలా చూస్తా. నీటి వసతి అంతగాలేని ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు కట్టిస్తా. దీనివల్ల అక్కడి ప్రాంతంలోని వాళ్లకు ఉద్యోగాలు దొరుకుతాయి.పంటనేలా కాలుష్యం కాదు. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఏరియా అంతా మొక్కలు నాటించి చిన్నసైజు అడవుల్లా పెంచుతా. దీనివల్ల ఫ్యాక్టరీ వల్ల వచ్చే వాతావరణ కాలుష్యమూ అంత హానిగా మారదు’’ చెప్పింది హిమబిందు. గవర్నమెంట్ స్కూల్స్.. హాస్పిటల్స్.. ‘‘నేనూ అంతే. చీఫ్ మినిస్టర్ అయితే.. గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ బాగా నడిచేలా చూసుకుంటా. ప్రైవేట్ స్కూల్స్, హాస్పిటల్స్ చాలా కాస్టీ›్ల. అందుకే గవర్నమెంట్ వాటినే బాగా నడిపిస్తా. ధరలు పెరగకుండా చూసుకుంటా. డబ్బున్న వాళ్లు కరెక్ట్‌గా టాక్స్‌లు కట్టేలా చర్యలు తీసుకుంటా’’ తన అభిప్రాయాన్ని చెప్పింది అనిత. వరకట్నం తీసుకునే వాళ్లను.. ‘‘నేను చీఫ్ మినిస్టర్ అయితే.. ముందు వరకట్నం తీసుకునేవాళ్లను జైల్లో పెడ్తా. బయటకు రాకుండా చూస్తా. అలాగే యాసిడ్ అటాక్స్ చేసేవాళ్లను కూడా జైల్లో పెడ్తా. అమ్మాయిలను ఏడిపించడం ఎంత తప్పో.. స్కూల్లోనే లెసన్స్ చెప్పిస్తా. అమ్మాయిలు బాగా చదువుకునేలా.. వాళ్లను వాళ్లు రక్షించుకునేలా అందరికీ స్కూళ్లల్లో కరాటే క్లాసెస్ ఇప్పిస్తా’’ మనసులో మాట చెప్పాడు నర్సింహ. వీళ్ల అభిప్రాయాలు అన్నీ విన్న తర్వాత.. అసలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎలా నడుస్తుందో తెలుసా అని అడగాలనిపించి.. అడిగాం. ‘‘తెలుసు.. టీవీల్లో చూస్తాం. కాని చిన్నపిల్లల్లా కొట్టుకుంటారు అసహ్యంగా’’ అని ముక్త కంఠంతో జవాబిచ్చారు అంతా. మరి ఎలా ఉండాలో మీరు చూపిస్తారా? అని అంటే.. అదిగో పైన ఇంట్రడక్షన్లో ఇచ్చాం కదా.. అలా ప్రశాంతంగా అసెంబ్లీని నడిపించి చూపించారు. పిల్ల మాటలు.. పిల్ల చేష్టలు అని కొట్టిపారేయొద్దు. ఈ పిల్లలకు పెద్దల కన్నా గొప్ప పరిశీలన ఉందని.. సమాజాన్ని గమనిస్తూ ఉన్నారని వాళ్ల అభిప్రాయాలతో చెప్పారు! వాళ్ల అభిప్రాయాలకు విలువనిద్దాం. ప్రభుత్వాలు, మనం.. విస్మరించిన చాలా విషయాలను, వివరాలను చక్కగా... సూటిగా.. గుండెకు తగిలేలా చెప్పారు. రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామని, కూడు, గుడ్డ, నీడ.. ఇంకా అందని ఫలాలేని, మహిళలను గౌరవించాలని, మద్యాన్ని పారించి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పథకాలను రూపొందించొద్దని.. బాలలందరికీ బడికి వెళ్లే హక్కుందని.. పర్యావరణ హితాన్ని మరచిపోవద్దనే సత్యాలనూ బోధించారు. పచ్చి గోడ మీద అచ్చులా పడ్డ ఆ బాలవాక్కుని మెదళ్లలో నిక్షిప్తం చేసుకుందాం. కార్యాచరణగా చూపిద్దాం!ఈ భవిష్యత్ పరిపాలనా దక్షులకు వాళ్ల భవిష్యత్ తరాల కోసం ఇంకేవైనా కొత్త పనులు చేసే అవకాశం ఇద్దాం! చర్విత చర్వణాలను ఇప్పటికైనా చరమగీతం పాడదాం! స్వయం పాలనలో ఈ భావి భారత విధాతలు నేర్పుతున్న పాఠం ఇదే! – సరస్వతి రమ -
రైతు భరోసా దీక్షకు హాజరుకానున్న విశ్రాంత జస్టిస్
కోదాడ: రుణమాఫీ నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమచెయాలని కోరుతూ కోదాడకు చెందిన సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు ఈ నెల 26న కోదాడలో చేపట్టనున్న రైతు భరోసా దీక్షలో విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం కొల్లు వెంకటేశ్వరరావుతో పాటు గంధం బంగారు, పొడుగు హుస్సేన్, రావెళ్ల రవికుమార్‌లో హైద్రాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి దీక్షకు ఆహ్వనించారు. దీనికి స్పందించిన చంద్రకుమార్ నలుగురికి అన్నం పెట్టే అన్నదాత కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. రైతులకు మద్దతుగా జరిగే ఈ దీక్షలో పాల్గొని వారికి మద్దతుగా నిలుస్తానని తమకు ఆయన హమీ ఇచ్చినట్లు తెలిపారు. -
ముగిసిన ఆందోళన
–మృతదేహానికి అంత్యక్రియలు కేతేపల్లి: మండలంలోని కొత్తపేట గ్రామంలో విద్యుదాఘాతంతో మృతిచెందిన చిట్టిమళ్ల జానయ్య అంత్యక్రియలను బుధవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి లోనైన జానయ్య మృతిచెందటం, అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ మంగళవారం రాత్రి పొద్దు పోయేంత వరకు బందువులు, గ్రామస్తులు, మృతదేహంతో కేతేపల్లి సబ్‌స్టేషన్ వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. బుధవారం ట్రాన్స్‌కో అధికారులు, మృతుడి బందువులతో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడి రాజీ కుదిర్చారు. మృతుని కుటుంబానికి శాఖ పరంగా వచ్చే రూ.4లక్షల అర్థికసాయంతో పాటు, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా కింది రూ.2లక్షలు, ట్రాన్స్‌కో యూనియన్ తరుపున రు.లక్ష ఇచ్చే విధంగా ఒప్పందం కుదిర్చారు. దీంతో మృతుడి బంధువులు ఆందోళన విరమించారు. మృతదేహానికి నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఎమ్మెల్యే పరామర్శ: విద్యుదాఘాతంతో మృతి చెందిన చిట్టిమల్ల జానయ్య మృతదేహాన్ని బుధవారం స్థానిక ఎమ్మెల్యే సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహం దహన సంస్కారాల నిమిత్తం రూ.5వేలు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్‌యాదవ్, బి.సుందర్, నాయకులు బుర్రి యాదవరెడ్డి, కె.మల్లేష్‌యాదవ్, కత్తుల వీరయ్య, ఆర్.సైదులు తదితరులు ఉన్నారు. -
కోదాడలో సార్వత్రిక సమ్మె విజయవంతం
కోదాడ: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె కోదాడలో విజయవంతమైంది. విద్యా, వ్యాపార సంస్థలు మూత పడ్డాయి. బ్యాంకులు, సినిమా హళ్లు తెరుచుకోలేదు. ఆర్టీసీ కార్మికులు కూడ సమ్మెలో పాల్గొనడంతో బస్సులు బస్టాండ్ దాటలేదు. ఉదయమే వామపక్ష నాయకులతో పాటు పలు కార్మిక సంఘాలు బస్టాండ్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. అనంతరం కోదాడ పట్టణంలో జాతీయరహదారి మీద భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను వీడాలని, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాలను రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల శ్రీనివాస్, ఎస్కె. లతీఫ్, పోతురాజు సత్యనారాయణ, ఎంఏ షరీఫ్, ఎస్కె. నయీం కుక్కడపు బాబు, ఈదుల కృష్ణయ్య, అంబడికర్ర శ్రీనివాస్, గౌస్, ఎస్. రాధాకృష్ణ, కుక్కడపు ప్రసాద్, వీరభద్రం, ముత్యాలు, బాదెరాము, న ర్సింహారావు, ఓరుగంటి ప్రభాకర్, ఉప్పగండ్ల శ్రీనివాస్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
చెరువులను నింపాలని దీక్ష
చిలుకూరు: ప్రస్తుతం విడుదల చేసిన సాగర్ నీటితో మండలంలోని చిలుకూరు, బేతవోలు, నారాయణపురం తదితర చెరువులను తక్షణమే నింపాలని కోరుతూ శక్తి యూత్, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రామాపురం వద్ద గల ఆర్కే మేజర్ కాలువలో జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చెరువులను నింపి రైతులను ఆదుకోవాలని కోరారు . ఇప్పటికే భూగర్భ జలాలు పడిపోయి మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయని అన్నారు. చెరువులను నింపకపోతే ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి యూత్ అధ్యక్షుడు తలారి శ్రీనివాస్, నాయకులు అలసకాని జనార్ధన్, కొల్లు సత్యనారాయన, పట్టా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సార్వత్రిక సమ్మెలో నిరసన ప్రదర్శన
నల్లగొండ టూటౌన్ : సెప్టెంబర్ 2న చేపడుతున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో డిమాండ్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు కోరారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ భవన్లో జరిగిన యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మె జయప్రదం కోసం ఉపాధ్యాయులు డివిజన్ కేంద్రాల్లో ప్రదర్శనలు చేయాలని కోరారు. సీపీఎస్ విధానం కోసం దశల వారిగా పోరాటాల్లో పాల్గొనలన్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. భాషా పండితుల, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ప్రతి 40 ఉన్నత పాఠశాలలకు ఒక ఉప విధ్యాధికారిని నియమించి, ప్రాథమిక పాఠశాలల సంఖ్య 50 దాటితే అదనంగా మరో ఎంఈను నియమించాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎన్. సరళ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పి. లక్పతినాయక్, పెరుమాళ్ల వెంకటేశం, యాదయ్య, బి. అరుణ, తిరుమలయ్య, ధనమూర్తి, బి. శ్రీనివాసాచారి, నాగమణి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.