మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ | Pharma Series Telugu Review And Rating | Sakshi
Sakshi News home page

Pharma Review Telugu: మెడికల్ మాఫియాపై తీసిన సిరీస్.. ఎలా ఉందంటే?

Dec 21 2025 1:07 PM | Updated on Dec 21 2025 1:24 PM

Pharma Series Telugu Review And Rating

ప్రతి రంగంలోనూ లోటుపాట్లు ఉంటాయి. వైద్యరంగంలోనూ బయటకు కనిపించనవి చాలానే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి అంశాల్ని పలు సినిమాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మెడికల్ రంగంలో జరిగే మాఫియాపై ఓ థ్రిల్లర్ డ్రామా సిరీస్ తీశారు. అదే 'ఫార్మా'. మలయాళ హీరో నివిన్ పౌలీ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడిది హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
కేపీ వినోద్(నివిన్ పౌలీ).. ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. ప్రారంభంలో ఇ‍బ్బందిపడినా తర్వాత కుదురుకుంటాడు. పనితనం చూపిస్తాడు. ఈ ఫార్మా కంపెనీ.. గర్బిణిల కోసం కైడాక్సిన్ అనే మందు కనిపెడుతుంది. దీని సేల్స్ పెంచడంలో వినోద్ కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఈ మందు వల్ల పుట్టిన పిల్లలందరూ మధుమేహం (షుగర్) బారిన పడ్డారని డాక్టర్ శైలజ(శ్రుతి రామచంద్రన్)కి తెలుస్తుంది. ఇదే విషయం వినోద్‌కి చెబుతుంది. దీంతో ఉద్యోగం చేసిన కంపెనీపైనే న్యాయపోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? డాక్టర్ రాజీవ్ రావు(రజత్ కపూర్).. వినోద్‌కి ఎలాంటి సాయం చేశారనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఇదో కల్పిత కథతో తీసిన సిరీస్. చూస్తున్నంతసేపు బయట హాస్పిటల్స్‌లోనూ ఇలానే జరుగుతుందా అనే సందేహం, మరోవైపు చిన్నపాటి భయం వేస్తుంది. మెడికల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ సిరీస్ అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే అలా ఉంది మరి. స్టోరీ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దాన్ని డీల్ చేయడంలో అక్కడక్కడ తడబాటు కనిపిస్తుంది. అయితేనేం ఇలాంటి స్టోరీలు అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కొందరు వ్యక్తులు టక్, షూ వేసుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని హాస్పిటల్స్‌లో అప్పుడప్పుడు కనిపించడం మీరు చూసే ఉంటారు. వీళ్లని మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటారు. వీళ్ల చేసే పని ఏంటంటే.. ఫార్మా కంపెనీ తయారు చేసిన మందులు, మెడికల్ పరికరాలని ప్రతి ఊరిలో ఉండే డాక్టర్లు, ఆసుపత్రులు, ఫార్మాసిస్ట్‌లకు పరిచయం చేసి అమ్మడం. అసలు వీళ్లు ఎలా పనిచేస్తారు? ఎంతలా కష్టపడతారు? టార్గెట్స్ పేరు చెప్పి వీళ్లతో కంపెనీ ఎలాంటి పనులు చేయిస్తాయి? లాంటి విషయాల్ని ఈ సిరీస్‌లోని కేపీ వినోద్ పాత్రతో చాలా చక్కగా చూపించారు.

కొన్ని ఫార్మా కంపెనీలు.. బిజినెస్సే ముఖ్యమనుకుని ప్రజల ప్రాణాలతో ఎలా చెలాగాటం ఆడుతున్నాయి? ఆయా సంస్థల నుంచి వచ్చే మెడిసన్ వల్ల భవిష్యత్తు తరాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది. ఎంతో ప్రమాదకరమైన మందులు.. ప్రజల్లోకి ఎంత తేలికగా వచ్చేస్తున్నాయనే అంశాలని ఈ సిరీస్‌లో పూసగుచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. అదే టైంలో డబ్బు ముఖ్యమని అనుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఎవరికైనా సరే దేవుడు కచ్చితంగా శిక్ష విధిస్తాడు అనే విషయాల్ని కూడా ఈ సిరీస్‌లో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.

కేపీ వినోద్ పాత్రలో నివిన్ పౌలీ సెటిల్డ్‌గా చేశాడు. మలయాళంలో ప్రముఖ హీరో అయినప్పటికీ.. ఈ సిరీస్‌లో చాలా సాధారణంగా కనిపిస్తాడు. కథకి తగ్గట్లే ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఈ పాత్రకు ఉండవు. లేడీ డాక్టర్ శైలజగా చేసిన శ్రుతి రామచంద్రన్, సీనియర్ డాక్టర్ రాజీవ్ రావు పాత్రలో రజత్ కపూర్ కూడా అదరగొట్టేశారు. మిగిలిన పాత్రధారులు కూడా స్టోరీకి తగ్గట్లు జీవించేశారు. సిరీస్ చూస్తున్నంతసేపు మనం కూడా కథతో పాటే వెళ్తాం. అలా చూపించారు. టెక్నికల్ అంశాలు కూడా అన్ని సెట్ అయ్యాయి.

దర్శకుడు పీఆర్ అరుణ్.. ఈ సిరీస్ కోసం చాలానే రీసెర్చ్ చేశాడని అనిపిస్తుంది. కాకపోతే రెగ్యులర్ డ్రామాని చూపించినప్పుడు బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఒకటిరెండు సీన్స్ తప్పితే ఓవరాల్‌గా సిరీస్ బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 8 ఎపిసోడ్లుగా దీన్ని తీశారు. కానీ మొత్తం రన్ టైమ్ 3 గంటల 16 నిమిషాలే. ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయండి.

- చందు డొంకాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement