ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు | Sarvam Maya movie OTT streaming and story | Sakshi
Sakshi News home page

ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు

Feb 5 2026 8:40 AM | Updated on Feb 5 2026 8:48 AM

Sarvam Maya movie OTT streaming and story

జాగ్రత్త....ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సినిమా. అయినా కంగారుపడకుండా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సర్వం మాయ. హారర్ సినిమా అంటే దెయ్యం, అస్థిపంజరం, స్మశానం... ఇవే ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే తరుణంలో దర్శకుడు  అఖిల్ సత్యన్ ఓ మాయ చేసి ఈ సర్వం మాయ హారర్ సినిమాలోని దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా ఇష్టపడేటట్టు చేశాడు. నిజానికి ఇది ఓ గొప్ప ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. 

సర్వం మాయ ఓ మళయాళ సినిమా.ఈ సినిమాలో కథానాయకుడైన ప్రబేందు స్వతహాగా నాస్తికడైనా కుల వృత్తి ప్రకారం అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రబేందు మంచి గిటారిస్టు కూడా. ప్రబేందు తన బంధువైన రూపేష్ బలవంతం చేయడంతో అనుకోకుండా ఓ రోజు దెయ్యం వదిలించే పూజను ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఇక అక్కడ నుండి కథ రసరంజకంగా సాగుతుంది. దెయ్యం అంటే ఆషామాషా దెయ్యం కాదు. ఆ దెయ్యాన్ని చూస్తే ప్రేక్షకులు కూడా తమకూ అలాంటి దెయ్యం కనిపిస్తే బాగుండును అని అనుకోక మానరు. అన్నట్టు ఆ దెయ్యానికి ఓ పేరు కూడా ఉంటుంది అదే డెలలూ. 

ఈ కథలో ప్రబేందును కలిసిన ఆ డెలలూ చేసే అల్లరి, చిలిపితనం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ డెలలూ తాను ఎవరినో, ఎందుకు చనిపోయి దెయ్యం అయిందో అన్న సమాధానం కోసం వెతుకుతూ ప్రబేందుని పట్టుకుంటుంది. మరి ఆ డెలలూ ఆచూకీ కనిపెట్టడంలో ప్రబేందు డెలలూకి సాయపడతాడా, అలాగే ఆ డెలలూ వల్ల ప్రబేందుకి కలిగిన ఇబ్బందులు ఏంటి అనేవి మాత్రం హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న సర్వం మాయ చూడాల్సిందే. 

ఈ సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా దెయ్యం వచ్చినప్పటి నుండి మహా సరదాగా సాగిపోతుంది. కాకపోతే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. ఏది ఏకమైనప్పటికీ ఈ సినిమా మొత్తం డెలలూ కోసం ఓ సారి చూడాల్సిందే. ఇంకెందుకాలస్యం వీకెండ్ హాట్ స్టార్ ట్యూన్ చేసి డెలలూ తో జత కట్టండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement