ప్రాణికోటిలో మనిషితో పాటు ఎన్నో జంతువులున్నా, భారతీయ గ్రామీణ జీవితంలో అతి పురాతన కాలం నుంచి, గోమాతగా పూజించబడే ఆవుకూ, నాగదేవతగా ఆరాధించబడే పాముకూ ప్రత్యేక స్థానం ఉంటూ వచ్చింది. భౌతికంగా చూస్తే, పాము ‘రైతు నేస్తం’. సిద్ధమైన పంటలను గుటకాయ స్వాహా చేసి అపార నష్టాన్ని కలిగించే ఎలుకలు మొదలైన ప్రాణులను తమకు ఆహారంగా చేసుకొనే పాములే లేకపోతే, పండిన పంటలో సగం కూడా చేతికి చిక్కదు. పాముది, మనిషిలాగే, వైరుద్ధ్యాల జీవితం. వాటిని క్రూర జీవులనటం అపార్థం వల్లే! వాటికి మనిషితో శత్రుత్వం లేదు. మనిషి అలికిడి తెలియగానే, అతడికి వీలయినంత దూరంగా వెళ్ళటానికే అవి ప్రయ త్నిస్తాయి. పాము మనిషిని కాటు వేస్తే, అది కాకతాళీయమైన విధి విలాసమే తప్ప, ‘క్రూరత్వం’ కాదు. పాము విషం ప్రాణాంతకమే. కానీ సరిగా వాడితే, అది దివ్యౌషధంగా పని చేస్తుంది అంటుంది వైద్య శాస్త్రం.
పాములకు ఇతర జంతువులకు లేని స్థాయిలో శ్రవణ శక్తీ, ఘ్రాణ శక్తీ, గ్రహణ శక్తీ ఉంటాయన్న నమ్మకం గ్రామీణులలో కనిపిస్తుంది. ముఖ్యంగా భౌతికాతీతమైన, లోకాతీతమైన శక్తి, దివ్య సంపత్తి ఎక్కడ ఉన్నా, అది పాములను ఆకర్షిస్తుంది అని ప్రతీతి. యోగులూ, మునులూ పాములతో సఖ్యం చేసిన సందర్భాల గురించి ఎన్నో విశేషాలు వింటూ ఉంటాం. భగవాన్ రమణ మహర్షితో పాములు ముఖాముఖి నిలిచి, సుదీర్ఘమైన మౌన భాషణలు చేసేవనీ, పాములు కాళ్ళకు చుట్టుకొని పాదాభివందనం చేసినా ఆయనకు చక్కలిగింత తప్ప మరో భావన కలిగేది కాదనీ ఆయన మాటలలోనే విన్నాం.
ఇదీ చదవండి: Karthika Masam 2025: విశిష్టత, కార్తీక పౌర్ణమి ఎపుడు?
పాములలో ఒక దివ్యత్వం ఉన్నదని భారతీయ గ్రామీణులు అనాదిగా విశ్వసిస్తూ వచ్చారు. చనిపోయిన పాము త్రోవలో ఎదురైతే, దానికి సాదరంగా, సభక్తికంగా అంతిమ సంస్కారం చేసే ఆనవాయితీ మన గ్రామాలలో ఉండేది. సమస్త జీవరాశిలో భగవంతుణ్ణి చూడడమే భారతీయ ఆదర్శం.
– ఎం. మారుతి శాస్త్రి


