ఇజ్రాయెల్ కస్టడీలో అమానుషం: బాధితుల కన్నీటి గాథలు | Australian Gaza Flotilla Volunteers Allege Brutal Abuse and Sexual Assault in Israeli Custody | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్ కస్టడీలో అమానుషం: బాధితుల కన్నీటి గాథలు

May 25 2026 12:26 PM | Updated on May 28 2026 11:41 AM

Australian Gaza Flotilla Volunteers Allege Brutal Abuse and Sexual Assault in Israeli Custody

గాజా సిటీ: యుద్ధంతో అతలాకుతలమైన గాజాకు సహాయాన్ని అందించేందుకు వెళ్లిన ‘గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా’ బృందంపై జరిగిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలాన్ని రేపుతోంది. ఇజ్రాయెల్ బలగాల నిర్బంధం నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన ఆస్ట్రేలియా యాక్టివిస్టులు, తాము ఎదుర్కొన్న భయంకరమైన చిత్రహింసల గురించిన విషయాలు వెల్లడించారు.

నరకప్రాయమైన కస్టడీ అనుభవాలు
గాజాకు వెళ్తున్న 50 పడవలను ఇజ్రాయెల్ బలగాలు అంతర్జాతీయ జలాల్లో అడ్డుకున్నాయి. ఈ బృందంలో ఉన్న ఆస్ట్రేలియా యాక్టివిస్ట్ జూలియట్ లామోంట్ మాట్లాడుతూ, తనను బలవంతంగా ఈడ్చుకెళ్లి, లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. నాలుగు రోజుల పాటు కస్టడీలో తాము నరకం చూశామని, అక్కడి అధికారులు అత్యంత అమానుషంగా వ్యవహరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరో యాక్టివిస్ట్ సామ్ వరిపా వాట్సన్ తనకు పక్కటెముక విరగడమే కాకుండా, తాము తీవ్రమైన దాడులకు గురయ్యామని, పోలీసులు టేజర్ గన్లు, రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించి దాడి చేశారని పేర్కొన్నారు.

బయటపడిన లైంగిక వేధింపుల ఆరోపణలు
గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా నిర్వాహకుల కథనం ప్రకారం, 15 లైంగిక వేధింపుల ఘటనలను తాము గుర్తించామని వెల్లడించారు. ఒక ఇజ్రాయెల్ ల్యాండింగ్ క్రాఫ్ట్‌ను ముళ్లకంచెలు, షిప్పింగ్ కంటైనర్లతో తాత్కాలిక జైలుగా మార్చి, అక్కడ తమ వారిని చిత్రహింసలకు గురిచేశారని వారు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలన్నింటినీ ఇజ్రాయెల్ జైలు అధికారులు ఖండించారు. అయితే ఈ పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి
ఈ ఘటనపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కస్టడీలో ఉన్న యాక్టివిస్టులను ఇజ్రాయెల్ పోలీస్ మంత్రి ఇటమార్ బెన్-గ్వీర్ అవహేళన చేస్తున్న వీడియో బయటకు రావడంతో ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దృశ్యాలు ‘అసహ్యకరమైనవని, ఆమోదయోగ్యం కానివి’ అని పెన్నీ వాంగ్ పేర్కొన్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ మంత్రులపై పలు ఆంక్షలు విధించిన ఆస్ట్రేలియా, ఇప్పుడు తాజా ఉదంతంతో మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
 

ఇది కూడా చదవండి: తెగిన జిప్‌లైన్.. 45 అడుగుల నుంచి పడి బాలుడు మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement