కెవ్వు కేక! | Australian town crier sets world record for loudest shout | Sakshi
Sakshi News home page

కెవ్వు కేక!

Jun 24 2026 5:42 AM | Updated on Jun 24 2026 5:42 AM

Australian town crier sets world record for loudest shout

అరుపులో ఆస్ట్రేలియన్‌ సత్తా 

122.4 డెసిబెల్స్‌తో గిన్నిస్‌ రికార్డ్‌  

మెల్‌బోర్న్‌: ఆయన గొంతు విప్పితే మైక్‌ అక్కర్లేదు, స్పీకర్లు తట్టుకోలేవు.. గాల్లో ఎగిరే జెట్‌ విమానం మోత, చెవులు బద్దలుకొట్టే అంబులెన్స్‌ సైరన్‌ శబ్దం.. వీటన్నింటినీ మించిపోయింది ఒక వ్యక్తి గొంతుక. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాకు చెందిన 58 ఏళ్ల జోసెఫ్‌ మెక్‌గ్రెయిల్‌ బాటప్‌ను ప్రపంచంలోనే ‘అత్యంత గట్టిగా అరిచే వ్యక్తి’గా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారికంగా గుర్తించింది. కేవలం ఒక్కటంటే ఒక్క ముక్క.. ‘నౌ’అంటూ ఆయన చేసిన సింహనాదం 122.4 డెసిబెల్స్‌గా నమోదైంది. 

32 ఏళ్ల రికార్డ్‌ బద్దలు! 
ఇంతకుముందు ఈ రికార్డ్‌ ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన స్కూల్‌ టీచర్‌ అన్నాలిసా ఫ్లానగన్‌ పేరిట ఉండేది. ఆమె 1994లో ‘క్వైట్‌’(నిశ్శబ్దం) అని ఏకంగా 121.7 డెసిబెల్స్‌ శబ్దంతో అరిచి రికార్డు సృష్టించారు. ఇప్పుడు జోసెఫ్‌ ఆ రికార్డును తిరగరాశారు. అయితే, జోసెఫ్‌ చాలా హుందాగా స్పందిస్తూ.. ‘ఆమె రికార్డు ఆమెకు ఉంది. ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే అత్యంత గట్టిగా అరిచే మహిళ, నేను అత్యంత గట్టిగా అరిచే పురుషుడిని’.. అని వ్యాఖ్యానించారు.

‘ఈ రికార్డు కోసం ప్రత్యేకంగా సాధన చేయడం అసాధ్యం. ఆ ఒక్క పదం అరవడానికి నేను 7 సార్లు ప్రయత్నించాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండు రోజుల పాటు నా గొంతు పూర్తిగా పడిపోయింది. బొంగురుపోయి అల్లాడిపోయాను’.. అన్నారు జోసెఫ్‌ మెక్‌గ్రెయిల్‌ బాటప్‌. ఒక రేడియో స్టూడియోలో ఎకౌస్టిక్‌ ఇంజనీర్‌ సమక్షంలో మే 2న ఈ రికార్డు ప్రయత్నం జరగ్గా, గిన్నిస్‌ సంస్థ దీనిని తాజాగా ధ్రువీకరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement