గత కొంతకాలంగా ఇంటా-బయటా.. ఆ ఫార్మాట్-ఈ ఫార్మాట్ అన్న తేడా లేకుండా ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జట్టుకు టీ20 ప్రపంచకప్‌కు ముందు, స్వదేశంలో ఊరట కలిగించే విజయం లభించింది. లాహోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాక్ 22 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు కలిసికట్టుగా రాణించి, వన్డే ప్రపంచ ఛాంపియన్లైన ఆస్ట్రేలియన్లను చిత్తు చేశారు. 169 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొని ప్రపంచకప్‌కు ముందు కాన్ఫిడెన్స్‌ను పెంచుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ తమ రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ లేకుండా ట్రవిస్ హెడ్ నాయకత్వంలో బరిలోకి దిగింది.
మిచెల్ లేని లేటు ఆసీస్ జట్టులో కొట్టొచ్చినట్లు కనిపించింది. వ్యూహ్యాల అమలు దగ్గరి నుంచి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మిచెల్ లేని ఆసీస్ సాధారణ జట్టులా కనిపించింది. ఈ గెలుపులో పాక్ బౌలర్ల గొప్పతనం పెద్దగా లేకపోయినా, ఆసీస్ బ్యాటర్ల డొల్లతనం స్పష్టంగా తెలిసింది. బౌలింగ్‌లో ఆడమ్ జంపా నైపుణ్యం వల్ల పాక్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేయగలిగినా, దాన్ని ఛేదించడంలో మాత్రం ఆసీస్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఫలితం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌కు తొలి బంతికే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను జేవియర్ బార్ట్‌లెట్ కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. అయితే ఆతర్వాత పాక్ కుదురుకుంది. మరో ఓపెనర్ సైమ్ అయూబ్ (40), వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ సల్మాన్ అఘా (39) బాధ్యతాయుతంగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు.
అయూబ్ ఔటయ్యాక బరిలోకి దిగిన బాబర్ ఆజమ్ (24) క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా, ఈసారి కూడా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన ఫకర్ జమాన్ (16 బంతుల్లో 10) జిడ్డుగా ఆడి పాక్ భారీ స్కోర్ చేయకపోవడానికి అడ్డు గోడ అయ్యాడు.
చివర్లో ఉస్మాన్ ఖాన్ (18), మహ్మద్ నవాజ్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించే ప్రయత్నం చేసినా కుదర్లేదు. ఆడమ్ జంపా (4-0-24-4) పాక్ ఆటగాళ్ల పాలిట కొరకరాని కొయ్యలా మారగా.. బార్ట్‌లెట్ (4-0-26-2), బియర్డ్‌మన్ (4-0-33-2) పాక్ ఆటగాళ్ల పప్పులు ఉడకనివ్వలేదు. చివరి ఓవర్‌లో బియర్డ్‌మన్ రెండు వికెట్లు తీసి పాక్‌ను 168 పరుగులకే (8 వికెట్ల నష్టానికి) పరిమిమతమయ్యేలా చేశాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్ కూడా ఆదిలోనే తడబడింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఆతర్వాత ట్రవిస్ హెడ్ (23), గ్రీన్ (36) కాసేపు మెరుపులు మెరిపించినా, దాన్ని కొనసాగించలేకపోయారు. వీరద్దరు ఔటయ్యాక ఆసీస్ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చివర్లో బార్ట్‌లెట్ (34 నాటౌట్) బ్యాట్ ఝులిపించినా, అప్పటికే ఆసీస్ ఓటమి ఖరారైపోయింది.
నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్ తలో 2 వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు. మొత్తంగా పాక్ స్పిన్నర్లు ఆసీస్ ఆటగాళ్లను విజయవంతంగా కట్టడి చేసి, సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లారు. రెండో టీ20 ఇదే లాహోర్ వేదికగా జనవరి 31న జరుగనుంది.


