కెవిన్ వార్ష్ చేతికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పగ్గాలు | Kevin Warsh Nominated By Donald Trump As Next Federal Reserve Chair, Wall Street Reacts Negatively | Sakshi
Sakshi News home page

కెవిన్ వార్ష్ చేతికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పగ్గాలు

Jan 31 2026 9:52 AM | Updated on Jan 31 2026 10:39 AM

Kevin Warsh nominated by Donald Trump to next Chair Federal Reserve

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉంటున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్‌ స్థానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. యూఎస్‌ సెంట్రల్ బ్యాంక్‌గా ఉన్న ‘ఫెడరల్ రిజర్వ్’ తదుపరి ఛైర్మన్‌గా మాజీ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేస్తున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ పదవీకాలం 2026 మే నెలలో ముగియనుంది. ఆ వెంటనే వార్ష్ బాధ్యతలు చేపడతారని ట్రంప్ వెల్లడించారు.

అర్హతలే ప్రామాణికం..

వార్ష్ ఎంపికను సమర్థిస్తూ ఆయన నేపథ్యాన్ని ట్రంప్ ప్రశంసించారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడైన వార్ష్ గతంలో మోర్గాన్ స్టాన్లీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా 2006–2011 మధ్య కాలంలో ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో సభ్యుడిగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది. జీ-20 సదస్సుల్లో అమెరికా ప్రతినిధిగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్థిక సంస్కరణల సలహాదారుగా ఆయనకున్న ట్రాక్ రికార్డును ట్రంప్ హైలైట్ చేశారు. వార్ష్‌ను ‘యూఎస్‌ పరిపాలన విభాగంలో ఇట్టే ఇమిడిపోయే అద్భుతమైన అభ్యర్థి’గా ట్రంప్ అభివర్ణించారు.

మార్కెట్ల స్పందన

ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికన్ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ధోరణి కనిపించింది. అక్కడి మార్కెట్‌ సూచీలైన డౌ జోన్స్, నాస్‌డాక్, ఎస్‌ అండ్‌ పీ 500 పతనమయ్యాయి. వార్ష్ గతంలో ‘ఇన్‌ఫ్లేషన్ హాక్’(ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి)గా పేరు పొందడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్వతంత్రతపై ప్రశ్నలు.. సెనెట్ ఆమోదం బాకీ

వార్ష్ ఎంపికపై ఆర్థిక వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు ట్రంప్ తక్కువ వడ్డీ రేట్లను ఆశిస్తుండగా వార్ష్ దానికి అనుగుణంగా నడుచుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రత దెబ్బతినే అవకాశం ఉందని కొందరు రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెవిన్ వార్ష్ నియామకం ఇప్పుడు అమెరికా సెనెట్ ఆమోదానికి వెళ్లనుంది. అక్కడ రాజకీయంగా, ఆర్థికంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. సెనెట్ ఆమోదం లభిస్తేనే మే 2026 నుంచి ఫెడ్‌ నిర్వహణ బాధ్యతులు వార్ష్ చేతుల్లోకి వెళ్తుంది.

ట్రంప్‌ చిరకాల మిత్రుడి అల్లుడే వార్ష్‌

కెవిన్ వార్ష్ భార్య జైన్ లాడర్ ప్రపంచ ప్రసిద్ధ కాస్మెటిక్స్ సంస్థ అయిన ‘ఎస్టే లాడర్’ వ్యవస్థాపకురాలు ఎస్టే లాడర్ మనవరాలు. ఆమె ఒక బిలియనీర్, వ్యాపారవేత్త. జైన్.. రోనాల్డ్ లాడర్ కుమార్తె. రోనాల్డ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చిరకాల మిత్రుడు, మద్దతుదారుగా ఉన్నారు. జైన్ లాడర్ 1996లో తన కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆమె ఎస్టే లాడర్ కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డేటా ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆమె నికర ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.22,000 కోట్లకు పైగా). కెవిన్ వార్ష్, జైన్ లాడర్‌కు మధ్య స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పరిచయం ఏర్పడింది. వారు 2002లో వివాహం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement