breaking news
Kevin Warsh
-
ఆర్థిక గణాంకాలు.. క్రూడ్ ధరలపై ఫోకస్
ముంబై: దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ ముడిచమురు (క్రూడాయిల్) ధరల కదలికలు ఈ వారం భారత స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయి. జాక్సన్ హోల్ సదస్సులో యూఎస్ ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ చేసిన ‘కఠిన ద్రవ్య విధాన’ వ్యాఖ్యల నేపథ్యంలో.. వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వైఖరి (అవుట్‌లుక్) జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను శాసించనుంది.దీనికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐలు) నిధుల రాకపోకలపై నిఘా ఉంచాల్సి ఉంది. రంగాల వారీగా పరిశీలిస్తే ‘ఎన్విడియా అద్భుత ఆర్థిక ఫలితాలు, ఆశాజనకమైన గైడెన్స్‌తో గ్లోబల్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి ఊపురావడం భారత ఐటీ షేర్లకు కలిసొచ్చే అంశం. కమోడిటీల ధరలు స్థిరపడటంతో మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొనే అవకాశముంది. అయితే, క్రూడాయిల్ ధరలు తగ్గడం చమురు ఉత్పత్తి సంస్థల షేర్లపై ఒత్తిడి పెంచవచ్చు. ఉత్పత్తి, ముడిసరుకుల వ్యయాల పెరుగుదల ఆందోళనల నేపథ్యంలో ఎఫ్ఎమ్సీజీ షేర్లు కూడా నష్టాల బాట పట్టొచ్చు. స్థూల ఆర్థిక గణాంకాల దృష్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) తొలి త్రైమాసిక (క్యూ1) జీడీపీ గణాంకాలు నేడు (ఆగస్టు 31, సోమవారం) విడుదల కానున్నాయి. భారత ఆర్థిక వృద్ధి రేటు, రికవరీ వేగాన్ని అంచనా వేసేందుకు ఇవి అత్యంత కీలకం. రేపు (సెప్టెంబర్ 1, మంగవారం) ఆగస్టు నెలకు సంబంధించిన ఆటో విక్రయాలు, తయారీ రంగ పీఎమ్ఐ కార్యకలాపాలు, జీఎస్టీ వసూళ్ల డేటా వెలువడనుంది. అదే రోజు రాత్రి అమెరికా తయారీ రంగ ఐఎస్ఎమ్ గణాంకాలు వెల్లడి కానున్నాయి. సెప్టెంబర్ 3న (గురువారం) భారతీయ సేవల రంగ పీఎమ్ఐతో పాటు యూఎస్ ప్రైవేటురంగ ఉపాధి కల్పన (ఏడీపీ) డేటా రానుంది. ఇక వారాంతంలో (సెప్టెంబర్ 4, శుక్రవారం) ఆర్బీఐ ఫారెక్స్ నిల్వల సమాచారంతో పాటు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే ‘అమెరికా నాన్–ఫామ్ పేరోల్స్, నిరుద్యోగిత రేటు’ గణాంకాలు వెలువడనున్నాయి. చమురు పతనం.. భారత్‌కు లబ్ధి హార్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పాక్షికంగా పునఃప్రారంభం కావడంతో గత వారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 5% క్షీణించి 89.31 డాలర్లకు దిగొచ్చింది. రవాణా మరింత వేగవంతమైతే చమురు ధరలు తగ్గి భారత్ వంటి దిగుమతి దేశాలకు లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ మళ్లీ సరఫరా అడ్డంకులు ఎదురైతే మార్కెట్లపై ఒత్తిడి తప్పదు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఆశించిన స్థాయిలో కఠినంగా లేకపోవడంతో చమురు ధరలు పడిపోయి, దిగుమతి ద్రవ్యోల్బణ భయాలు తగ్గాయి. క్రూడ్ తగ్గడం, తద్వారా రూపాయి బలోపేతం కావడం మన మార్కెట్లకు సానుకూల అంశాలని విశ్లేషకులు చెబుతున్నారు.నిఫ్టీ టెక్నికల్ అవుట్లుక్నిఫ్టీ ప్రస్తుతం పరిమిత శ్రేణిలో కన్సాలిడేషన్ అవుతోందని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. టెక్నికల్ అంశాలు బలంగా ఉన్నాయంటున్నారు. వీక్లీ టైమ్‌ఫ్రేమ్‌లో సూచీకి సానుకూల ధోరణి ఉన్నప్పటికీ, ఎగువ స్థాయిల వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. వారాంతంలో షార్ట్ కవరింగ్ జరగడంతో నిఫ్టీ 24,176 వద్ద ముగిసింది. ఈ సానుకూలత కొనసాగితే ఎగువ స్థాయిలో తక్షణ నిరోధం 24,200 – 24,300 శ్రేణిలో ఉంది. ఈ శ్రేణిని ఛేదించగలిగితే సూచీ 24,500 దాటి 24,710 స్థాయి వరకు ర్యాలీ సాగించవచ్చు. ఒకవేళ స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించక అమ్మకాలు నెలకొంటే... దిగువ స్థాయిలో 24,000 వద్ద కీలక మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే అమ్మకాల తీవ్రత పెరిగి సూచీ 23,600 స్థాయికి దిగొచ్చే ప్రమాదం ఉంది. -
ఈ వారం బంగారం.. భారీ పతనం..
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఈ వారం బంగారం, వెండి ధరలకు ప్రతికూలంగా మారింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్ష్ జాక్సన్ హోల్ సదస్సులో చేసిన వ్యాఖ్యలు, అమెరికా డాలర్ బలోపేతం, ఇటీవల ధరలు భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం వంటి అంశాలు బంగారం, వెండిపై ఒత్తిడిని పెంచాయి. ముఖ్యంగా ఆగస్టు 28న వార్ష్ ప్రసంగం తర్వాత సెప్టెంబర్‌లో అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు పెరగడంతో బులియన్ ధరలు ఒక్కసారిగా క్షీణించాయి.వారం ప్రారంభంలో ఆగస్టు 24న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు సుమారు 4,696 డాలర్ల స్థాయికి చేరువైంది. అయితే వారాంతానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆగస్టు 28న ఫెడ్ చైర్మన్ ప్రసంగం తర్వాత స్పాట్ గోల్డ్ 3 శాతానికి పైగా క్షీణించి 4,567 డాలర్ల ప్రాంతానికి పడిపోయింది. అదే సమయంలో వెండి ధర కూడా దాదాపు 3.5 శాతం తగ్గి ఔన్స్‌కు 66.81 డాలర్లకు చేరింది.వార్ష్ వ్యాఖ్యలతో పెరిగిన వడ్డీ రేట్ల భయాలుజాక్సన్ హోల్లో ప్రసంగించిన కెవిన్ వార్ష్.. ఫెడ్ ప్రధానంగా ధరల స్థిరత్వంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమెరికా ఫెడ్ లక్ష్యమైన 2 శాతంతో పోలిస్తే వ్యక్తిగత వినియోగ వ్యయాల (PCE) ద్రవ్యోల్బణం 12 నెలల ప్రాతిపదికన 3.7 శాతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం లక్ష్యం వైపు స్పష్టంగా, తగిన వేగంతో కదులుతోందన్న నమ్మకం కలగకపోతే ఫెడ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సంకేతాలిచ్చారు.దీంతో సెప్టెంబర్ ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలపై మార్కెట్ అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అధిక వడ్డీ రేట్ల వాతావరణం బంగారం వంటి వడ్డీ ఆదాయం ఇవ్వని ఆస్తులకు సాధారణంగా ప్రతికూలంగా ఉంటుంది. అదే సమయంలో డాలర్ బలోపేతం కావడంతో ఇతర కరెన్సీలు కలిగిన పెట్టుబడిదారులకు బంగారం ఖరీదుగా మారుతుంది. ఈ రెండు అంశాలు బులియన్‌పై ఒత్తిడిని పెంచాయి.దేశీయ మార్కెట్లోనూ భారీ పతనంఅంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో ఆగస్టు 28న 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాములకు రూ.3,300 తగ్గి రూ.1,62,400కు చేరింది. దీంతో ఆగస్టు 25న నమోదైన రూ.1,67,100 గరిష్ఠ స్థాయి నుంచి కేవలం మూడు సెషన్లలోనే బంగారం రూ.4,700 లేదా దాదాపు 3 శాతం నష్టపోయింది.వెండి కూడా అదే బాటలో పయనించింది. కిలో ధర రూ.5,000 తగ్గి రూ.2,45,500కు చేరింది. ఇటీవలి ర్యాలీ తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం, డాలర్ బలపడటం దేశీయ బులియన్ ధరలపై ఒత్తిడి తెచ్చాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.వచ్చే వారం కీలకంఇక వచ్చే వారం బంగారం, వెండి ధరలకు అమెరికా ఆర్థిక గణాంకాలు కీలకం కానున్నాయి. సెప్టెంబర్ ఫెడ్ సమావేశానికి ముందు ఉద్యోగాల గణాంకాలు, ద్రవ్యోల్బణం తదితర డేటాపై మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. ప్రస్తుతానికి వార్ష్ వ్యాఖ్యలు రేట్ల పెంపు భయాలను పెంచినప్పటికీ, సెప్టెంబర్‌లో ఫెడ్ నిర్ణయం పూర్తిగా రానున్న ఆర్థిక గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల బులియన్ మార్కెట్లో రానున్న రోజుల్లోనూ అధిక ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉంది. -
చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్ పోస్ట్
ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఇన్వెస్టర్లను మరోసారి హెచ్చరించారు. సరిగ్గా 12 రోజుల్లో, అంటే మే 15న, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పీఠం (అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్) చేతులు మారబోతోంది. అయితే మెజారిటీ ప్రజలకు దీని పర్యవసానాలు ఏంటో తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్ట్ చేశారు.వార్ష్ చేతుల్లోకి పగ్గాలు..గత ఎనిమిదేళ్లుగా ఫెడ్ చైర్మన్‌గా ఉన్న జెరోమ్ పావెల్ మే 15న పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్తుడు కెవిన్ వార్ష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గత 50 ఏళ్లలో ఏ ఫెడ్ చైర్మన్ ఎదుర్కోనంతటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య వార్ష్ పదవిలోకి వస్తున్నారని కియోసాకి విశ్లేషించారు.వార్ష్ ముందున్న సవాళ్లు ఇవే..చమురు మంట: బ్యారెల్ ఆయిల్ ధర 120 డాలర్ల వద్ద ఉంది.ద్రవ్యోల్బణ సెగ: 3.3 శాతంతో ద్రవ్యోల్బణం గత రెండేళ్ల గరిష్టానికి చేరింది.వడ్డీ రేట్ల సందిగ్ధత: ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో, ఫెడ్ వడ్డీ రేట్లను 3.5% - 3.75% వద్దే కొనసాగించాల్సి వస్తోంది.కియోసాకి మాటల్లో 'వార్ష్ ట్రాప్'కెవిన్ వార్ష్ ఒక ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకున్నారని కియోసాకి అభివర్ణించారు. ఆయన ముందున్నవి కేవలం మూడు మార్గాలు, ఆ మూడూ నష్టదాయకమే. రేట్లు తగ్గించడం: రేట్లు తగ్గిస్తే, అప్పటికే మండుతున్న ద్రవ్యోల్బణంపై పెట్రోల్ పోసినట్లవుతుంది.రేట్లు మార్చకపోవడం: ఇది అధ్యక్షుడు ట్రంప్‌ను నిరాశపరచడమే కాకుండా, యుద్ధం వల్ల కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది.రేట్లు పెంచడం: ఇది దేశాన్ని నేరుగా ఆర్థిక మాంద్యం (Recession)లోకి నెట్టివేస్తుంది. తొలగని పావెల్ నీడ!ఈ కథనంలో మరో ఆసక్తికరమైన మలుపు ఏంటంటే.. చైర్మన్ పదవి నుంచి దిగిపోయినా, జెరోమ్ పావెల్ ఫెడ్ బోర్డు నుంచి వెళ్లడం లేదు. 2028 వరకు ఆయన బోర్డు మెంబర్‌గా కొనసాగుతారు. 1951 తర్వాత ఒక మాజీ చైర్మన్ ఇలా బోర్డులో ఉండిపోవడం ఇదే తొలిసారి. అంటే, ట్రంప్ తనకిష్టమైన వారిని ఆ సీటులో కూర్చోబెట్టి వడ్డీ రేట్లు తగ్గించేలా చక్రం తిప్పాలని చూసినా, పావెల్ అక్కడ ‘వాచ్ డాగ్’లా అడ్డుపడే అవకాశం ఉంది.అసలు బాస్ ఎవరు?కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఇప్పుడు ఫెడ్ చైర్మన్ ఎవరన్నది ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది వార్ష్ కాదు, ట్రంప్ అంతకన్నా కాదు. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉన్న 'హార్ముజ్ జల సంధి' (Strait of Hormuz)."ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణం సాధారణ స్థితికి వచ్చే వరకు.. ద్రవ్యోల్బణం 2%కి తగ్గే వరకు.. ఫెడ్ రేట్లు తగ్గించే సాహసం చేయలేదు. ఎవరు చైర్మన్ సీటులో కూర్చున్నా సరే.. ప్రస్తుతానికి 'హార్ముజ్ జలసంధి' మాత్రమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయిస్తోంది." అని కియోసాకి తేల్చి చెప్పారు.ఇన్వెస్టర్లు కేవలం వ్యక్తుల మార్పును మాత్రమే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను గమనించాలని కియోసాకి సూచించారు. వార్ష్ రాకతో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం కంటే, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం మేలని ఆయన పోస్ట్ సారాంశం. -
కెవిన్ వార్ష్ చేతికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ పగ్గాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా ఉంటున్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ స్థానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్‌గా ఉన్న ‘ఫెడరల్ రిజర్వ్’ తదుపరి ఛైర్మన్‌గా మాజీ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను నామినేట్ చేస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుత ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్ పదవీకాలం 2026 మే నెలలో ముగియనుంది. ఆ వెంటనే వార్ష్ బాధ్యతలు చేపడతారని ట్రంప్ వెల్లడించారు.అర్హతలే ప్రామాణికం..వార్ష్ ఎంపికను సమర్థిస్తూ ఆయన నేపథ్యాన్ని ట్రంప్ ప్రశంసించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, హార్వర్డ్ లా స్కూల్ నుంచి పట్టభద్రుడైన వార్ష్ గతంలో మోర్గాన్ స్టాన్లీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యంగా 2006–2011 మధ్య కాలంలో ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో సభ్యుడిగా సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది. జీ-20 సదస్సుల్లో అమెరికా ప్రతినిధిగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్థిక సంస్కరణల సలహాదారుగా ఆయనకున్న ట్రాక్ రికార్డును ట్రంప్ హైలైట్ చేశారు. వార్ష్‌ను ‘యూఎస్ పరిపాలన విభాగంలో ఇట్టే ఇమిడిపోయే అద్భుతమైన అభ్యర్థి’గా ట్రంప్ అభివర్ణించారు.మార్కెట్ల స్పందనట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే అమెరికన్ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల ధోరణి కనిపించింది. అక్కడి మార్కెట్ సూచీలైన డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 పతనమయ్యాయి. వార్ష్ గతంలో ‘ఇన్ఫ్లేషన్ హాక్’(ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి)గా పేరు పొందడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.స్వతంత్రతపై ప్రశ్నలు.. సెనెట్ ఆమోదం బాకీవార్ష్ ఎంపికపై ఆర్థిక వర్గాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు ట్రంప్ తక్కువ వడ్డీ రేట్లను ఆశిస్తుండగా వార్ష్ దానికి అనుగుణంగా నడుచుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రత దెబ్బతినే అవకాశం ఉందని కొందరు రాజ్యాంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెవిన్ వార్ష్ నియామకం ఇప్పుడు అమెరికా సెనెట్ ఆమోదానికి వెళ్లనుంది. అక్కడ రాజకీయంగా, ఆర్థికంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. సెనెట్ ఆమోదం లభిస్తేనే మే 2026 నుంచి ఫెడ్ నిర్వహణ బాధ్యతులు వార్ష్ చేతుల్లోకి వెళ్తుంది.ట్రంప్ చిరకాల మిత్రుడి అల్లుడే వార్ష్కెవిన్ వార్ష్ భార్య జైన్ లాడర్ ప్రపంచ ప్రసిద్ధ కాస్మెటిక్స్ సంస్థ అయిన ‘ఎస్టే లాడర్’ వ్యవస్థాపకురాలు ఎస్టే లాడర్ మనవరాలు. ఆమె ఒక బిలియనీర్, వ్యాపారవేత్త. జైన్.. రోనాల్డ్ లాడర్ కుమార్తె. రోనాల్డ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చిరకాల మిత్రుడు, మద్దతుదారుగా ఉన్నారు. జైన్ లాడర్ 1996లో తన కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆమె ఎస్టే లాడర్ కంపెనీల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ డేటా ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ఆమె నికర ఆస్తి విలువ సుమారు 2.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.22,000 కోట్లకు పైగా). కెవిన్ వార్ష్, జైన్ లాడర్‌కు మధ్య స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పరిచయం ఏర్పడింది. వారు 2002లో వివాహం చేసుకున్నారు.ఇదీ చదవండి: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..


