మనం ‘అతిథి దేవో భవ’ అంటాం.. కానీ ఆ ట్యాక్సీ డ్రైవర్ మాత్రం అతిథి ‘దోపిడీ’భవ అనుకున్నాడు. వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన ఒక అతిథిని, అడుగు దూరంలో ఉన్న హోటల్‌కు చేర్చడానికి అక్షరాలా పద్దెనిమిది వేల రూపాయలు పిండేశాడు. అమెరికా నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఒక మహిళకు ఎదురైన చేదు అనుభవమిది.
ఆ 20 నిమిషాల ఉత్కంఠ
జనవరి 12 అర్ధరాత్రి సమయం.. అమెరికా నుంచి ముంబైలో అడుగుపెట్టిన ఆ మహిళ ఒక ట్యాక్సీ ఎక్కింది. ఆమె వెళ్లాల్సిన ఫైవ్ స్టార్ హోటల్ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది. కానీ, ట్యాక్సీ డ్రైవర్ దేశ్‌రాజ్ యాదవ్ కన్ను ఆమె పర్సుపై పడింది. నేరుగా హోటల్‌కు తీసుకెళ్లకుండా, ఆమెకు దారి తెలియదు కదా.. అని అంధేరీ వీధుల్లో 20 నిమిషాల పాటు ‘చక్రం’ తిప్పాడు. కారులో డ్రైవర్ పక్కన మరో అపరిచిత వ్యక్తి.. చుట్టూ చీకటి.. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు..
చెక్ ఇన్ అవ్వకముందే.. భారీ చెక్!
చివరికి హోటల్ ముందు కారు ఆపిన ఆ డ్రైవర్, బాంబు పేల్చాడు. బిల్లు ఎంతో తెలుసా? అక్షరాలా 18,000 రూపాయలు! అంటే కిలోమీటర్‌కు కూడా సరిపోని దూరానికి దాదాపు 200 డాలర్లు వసూలు చేశాడు. కొత్త దేశం, ఒంటరి మహిళ.. వాళ్లతో వాదించలేక, భయంతో ఆ డబ్బు చెల్లించి హోటల్‌లోకి పరుగులు తీసింది.

ట్విట్టర్‌లో పోస్టు.. ఖాకీల వేట
అమెరికా చేరుకున్నాక ఆ బాధితురాలు జనవరి 26న ఎక్స్ వేదికగా తన గోడు వెళ్లగక్కింది. ఆమె కథనం ప్రకారం.. ట్యాక్సీ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి బాధితురాలిని ఒక గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. డబ్బులు ఇవ్వాలని బెదిరించి, ఆ తర్వాతే హోటల్ దగ్గర వదిలిపెట్టారు. ఆ పోస్ట్ చూసి నెటిజన్లు రగిలిపోయారు. ముంబై పోలీసులు వెంటనే స్పందించారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన కేవలం 3 గంటల్లోనే ఆ కేటుగాడిని పట్టుకుని బేడీలు వేశారు. డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేయడమే కాకుండా, అతని ట్యాక్సీని కూడా సీజ్ చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలాంటి మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 112 కి కాల్ చేయండని డీసీపీ మనీష్ కల్వానియా విజ్ఞప్తి చేశారు. డబ్బు మీద ఆశతో దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఆ మాయగాడికి, ముంబై పోలీసులు సరైన రీతిలో ‘మర్యాద’చేశారు!
– సాక్షి, నేషనల్ డెస్క్.


