2026–27 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరోసారి మొండిచెయ్యే
పెండింగ్ బకాయిలు, ప్రభుత్వ ప్రతిపాదనలు, విభజన హామీలకు కలగని మోక్షం
సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎంపీల విజ్ఞాపనలు బుట్టదాఖలు
ట్రిపుల్ ఆర్, మెట్రో రైలు, రేడియల్ రోడ్ల తదితర మౌలిక వసతుల ప్రస్తావన లేదు
సాక్షి, హైదరాబాద్: ఎప్పటిలాగే కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చూపెట్టలేదు. దేశ వ్యాప్తంగా ప్రకటించిన ఏడు రైల్వే కారిడార్లు ( మూడు హైదరాబాద్ మీదుగా) మినహా ఈసారి బడ్టెట్‌లో కూడా తెలంగాణ ప్రస్తావన కనిపించలేదు. విజన్–2047కు అనుగుణంగా రీజినల్ రింగురోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పన వరకు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ఏ కార్యక్రమానికీ నిధులు కేటాయించలేదు. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, జాతీయ స్థాయి విద్యా సంస్థలు, పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ తెలంగాణకు ఎలాంటి ఊరట దక్కలేదు. కేంద్ర బడ్జెట్‌ను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా అమలు చేసే పథకాల్లో భాగంగానే రాష్ట్రానికి ప్రయోజనం చేకూరాలి తప్ప ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాయం అడిగినా చేయలేదు
ఈసారి కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంపెడాశలు పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మూడు అంశాల్లో కేంద్ర సహకారాన్ని ఆశించింది. ముఖ్యంగా 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిధులు వస్తాయని, 2014 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలకు మోక్షం కలుగుతుందని, విభజన హామీల్లో కొన్నింటికైనా ఈసారి కేటాయింపులు ఉంటాయని రాష్ట్రం భావించింది. అయితే తెలంగాణకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేకుండానే బడ్జెట్ ప్రతిపాదనలు జరిగాయి.
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రతిష్టాత్మక పథకాలకు రూ.1.65 లక్షల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఇందుకోసం పలుమార్లు కేంద్రాన్ని రాష్ట్ర పెద్దలు కలిశారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు తోడు రాష్ట్ర ఎంపీలు, తమ శాఖలకు నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర మంత్రులు ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆర్థికమంత్రి, ప్రధాన మంత్రిని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ ఈ విజ్ఞప్తులేవీ కేంద్రం పట్టించుకోలేదు.
రీజినల్ రింగు రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో ప్రాజెక్టు విస్తరణ, హైదరాబాద్‌లో సీవరేజి మాస్టర్ ప్లాన్, వరంగల్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రేడియల్ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఇండ్రస్టియల్ హబ్‌లు, లాజిస్టిక్, రీక్రియేషన్ పార్కులు, ఫ్యూచర్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, కరీంనగర్, జనగామ జిల్లాల్లో లెదర్ పార్కులు, తెలంగాణలోని గోదావరి వ్యాలీ బొగ్గు బ్లాక్‌లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కేటాయింపు, సెమీకండక్టర్ మిషన్ కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ధి, కేంద్రీయ విద్యాలయాలు, జిల్లాకో నవోదయ పాఠశాల, పాలమూరు–రంగారెడ్డికి జాతీయ హోదాలకు తోడు రాష్ట్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదలన్నింటినీ కేంద్ర బడ్జెట్ బుట్టదాఖలు చేసింది.
రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి సహకారం ఉంటుందని ఆశించినా, అది కూడా దక్కలేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లాంటి సోషల్ ఇంజనీరింగ్ కార్యక్రమాలకు కూడా ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. మిర్చిబోర్డు, స్కిల్ వర్సిటీ లాంటి ఊసు కూడా లేకుండానే పార్లమెంటు ముందుకొచ్చిన కేంద్ర వార్షిక బడ్జెట్ రాష్ట్రాన్ని నిరాశలో ముంచెత్తింది. ఈ బడ్జెట్ ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
చొరవ తీసుకుంటే ప్రయోజనం
కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన కొన్ని పథకాలు, కార్యక్రమాల విషయంలో తెలంగాణ చొరవ తీసుకుంటే... కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే మాత్రం కొంతమేర ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హైస్పీడ్ రైల్ కారిడార్లకు అనుసంధానంగా రోడ్డు కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు వేయవచ్చని అంటున్నారు.
డాటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సహకారం, ఇతర దేశాల నుంచి పెట్టుబడుల సమీకరణ, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం తదితర అంశాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే విధానాలు, కేంద్రం అందించే సాయం బట్టి కొంత ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ఇక, ఆదాయ పన్ను విషయంలో ఎలాంటి మార్పు లేకపోవడం, ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌ల విషయంలోనూ విధానాల్లో ఎలాంటి మార్పు ప్రకటించకపోవడంతో వేతన జీవులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా ఈ బడ్జెట్ ద్వారా ఆశించిన ప్రయోజనాలు కనిపించడం లేదని ఆర్థిక నిపుణులు చెబుతుండడం గమనార్హం.
స్వల్పంగా పెరిగిన పన్నుల్లో వాటా
కేంద్ర పన్నుల్లో వాటా ఈసారి బడ్జెట్‌లో స్వల్పంగా పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి గతంలో ఉన్న 41 శాతం పన్నుల్లో వాటాను ఈసారి 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 42.5 శాతానికి పెంచారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో వాటా కూడా గత ఏడాది కంటే కొంచెం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 2.102 శాతంగా ఉన్న పన్నుల్లో వాటా ఈసారి 2.174 శాతానికి పెరగడం గమనార్హం.
ఈ మేరకు రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో వాటా కింది రూ. 33,181 కోట్లు వస్తాయని అంచనాలు చెబుతున్నాయి. ప్రతి నెలా సగటున రూ.2,370 కోట్ల చొప్పున మొత్తం 14 విడతల్లో ఈ మొత్తం వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అయితే, పన్నుల్లో వాటి ఈసారి రూ.4వేల కోట్ల వరకు పెరిగింది. గత బడ్జెట్‌లో రూ.29,280 కోట్లు రాగా, ఈసారి అది రూ.33వేల కోట్లకు పెరగడం ఒక్కటే తెలంగాణకు ఈసారి కేంద్ర బడ్జెట్‌లో దక్కిన ఊరట అని చెప్పుకోవచ్చు.


