ఆమెకు ఆర్థిక శక్తి! | Expectations from a gender lens in Budget 2026-27 | Sakshi
Sakshi News home page

ఆమెకు ఆర్థిక శక్తి!

Feb 1 2026 4:51 AM | Updated on Feb 1 2026 4:51 AM

Expectations from a gender lens in Budget 2026-27

జెండర్‌ బడ్జెటింగ్‌

‘బడ్జెట్‌ అనేది మన స్వేచ్ఛకు పరిమితులు విధించకూడదు. మరింత స్వేచ్ఛ ఇవ్వాలి’ అనేది పాత మాట. ‘ బడ్జెట్‌ అనేది స్వేచ్ఛ మాత్రమే కాదు మహిళా సాధికారతకు దారి చూపాలి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు బడ్జెట్‌ ద్వారా కొత్త శక్తి ఇవ్వాలి’ అనేది కొత్త మాట. ‘బడ్జెట్‌–2026’ నుంచి మహిళలు ఆశిస్తున్నది ఏమిటి? బడ్జెట్‌ రూపకల్పనలో జెండర్‌ ఇన్‌టెన్షనాలిటీ ప్రాధాన్యత ఏమిటి?  ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కావాల్సింది ఏమిటి?... తెలుసుకుందాం...

గత కాలాల సంగతి ఎలా ఉన్నా, ప్రస్తుతం బడ్జెట్‌ రూపకల్పనలో జెండర్‌ ఇన్‌టెన్షనాలిటీ (జేఈ)  కీలకంగా మారింది. ‘జేఈ’ అనేది మహిళల అవసరాలు, ఆకాంక్షలు, ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని చేసే డిజైనింగ్‌.‘గత బడ్జెట్‌ చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లకు కొత్త అవకాశాలను సృష్టించింది, పెట్టుబడి, టర్నోవర్‌ పరిమితులను పెంచింది. క్రెడిట్‌ గ్యారెంటీ కవరేజీని రూ. 5 కోట్ల నుండి రూ. 10 కోట్లకు రెట్టింపు చేసింది.

 స్టార్టప్‌లు, ఎగుమతిదారులకు అధిక కాలపరిమితి గల రుణాలను అందించింది. రాబోయే అయిదేళ్లలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ. 2 కోట్ల వరకు టర్మ్‌ లోన్లు అందించాలనే ప్రభుత్వ ప్రణాళికతో ఉపశమనం లభించింది. పెద్ద సంస్థలను స్థాపించాలని, పారిశ్రామిక వృద్ధికి దోహదపడాలని, ఉద్యోగాలు సృష్టించాలని మహిళలు కోరుకుంటున్నారు’ అంటున్నారు భారతీయ యువశక్తి ట్రస్ట్‌(బివైఎస్‌టీ) మేనేజింగ్‌ ట్రస్టీ లక్ష్మీ  వెంకటేశన్‌.

జెండర్‌ బడ్జెటింగ్‌ అంటే...
జెండర్‌ బడ్జెటింగ్‌ను జెండర్‌ సెన్సిటివ్‌ బడ్జెట్‌ అని కూడా పిలుస్తారు. బడ్జెట్‌లో లింగ అసమానతలు లేకుండా చూసుకోవడమే జెండర్‌ బడ్జెటింగ్‌. ముఖ్యమైన  అంశాలలో మహిళలు కీలక నిర్ణయాలు తీసుకునేలా చేయడం, పురుషులు, మహిళల మధ్య వనరుల పంపిణీలో సమానత్వం ఉండేలా చూడడం జెండర్‌ బడ్జెటింగ్‌ ప్రాథమిక లక్ష్యం.

సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌
2026 బడ్జెట్‌ నుండి ఆశిస్తున్న వాటిలో ముఖ్యమైనది...అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి మహిళలకు తగినంత సహకారం అందించడం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్, డీప్‌–టెక్‌లాంటి రంగాలలో మహిళల కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయాలని పీహెచ్‌డీసీసీఐ (పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌) మహిళల ప్రతినిధి బృందం కోరుతోంది.

ప్రోత్సాహకాలు, విధానపరమైన మద్దతు ద్వారా మహిళల నేతృత్వంలోని పరిశ్రమలు, సేవారంగాలకు ప్రోత్సాహం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఉన్నతవిద్య అభ్యసించే మహిళలకు, ముఖ్యంగా ‘స్టెమ్‌’ విభాగాలకు సంబంధించిన మహిళలకు స్కాలర్‌షిప్‌లు అందించాలని, మార్కెట్‌ యాక్సెన్‌ను మెరుగుపరుచుకోవడానికి మహిళల నేతృత్వంలోని వ్యాపార సంస్థలకు పన్ను ప్రోత్సాహకాలను అందించాలనీ కోరారు. ఆఫీసులలో మహిళా ఉద్యోగులకు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్, క్యాన్సర్‌ నివారణలాంటి ఆరోగ్య సంరక్షణ సేవలకు సంబంధించి ఆరోగ్య పథకాలను అందించాలని కోరారు.

మెరుగైన ఆర్థిక వ్యవస్థ కోసం..
‘మహిళల నేతృత్వంలోని కంపెనీలకు అందుబాటులో ఉండే పథకాలను ప్రవేశపెట్టాలని, ముఖ్యంగా కొలేటరల్‌–ఫ్రీ క్రెడిట్, వడ్డీ రాయితీ...మొదలైన వాటి ద్వారా సహకారం అందించాలని కోరుకుంటున్నాను. చిన్నా, పెద్ద పట్టణాలలో ఉన్న మహిళా వ్యాపారులలో ఎంతో సృజనాత్మకత ఉంది. గొప్ప ఆశయాలు ఉన్నాయి. ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వారి సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు. మన దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు అయ్యేలా సహాయపడవచ్చు. మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం అనేది  కేవలం కలిసికట్టుగా ముందుకు సాగడం మాత్రమే కాదు భవిష్యత్తు కోసం మెరుగైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం కూడా’ అంటున్నారు క్రిమినల్‌ లాయర్‌ నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ‘రూట్స్‌ కేఫ్‌’ ఫౌండర్‌ మీనాక్షి కుమార్‌. 

‘మన దేశంలో రిటైల్‌ కాస్మెస్యూటికల్‌ పరిశ్రమ లో ఎంతో మార్పు వచ్చింది. దీనిలో మహిళా వినియోగదారులు కీలకపాత్ర  పోషిస్తున్నారు. స్వల్పకాలిక పరిష్కారాల కంటే దీర్ఘకాలిక చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కాస్మెస్యూటికల్స్‌ను కేవలం అందాల విభాగంగా మాత్రమే చూడకుండా ఆరోగ్య సంరక్షణ–విశ్లేషణ వర్గంగా అధికారికంగా గుర్తించే అవకాశాన్ని కేంద్ర బడ్జెట్‌ 2026 ఇస్తుందని ఆశిస్తున్నాం. సమర్థవంతమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆ రంగం మరింత అభివృద్ధి అయ్యేలా చేయవచ్చు. దేశీయ తయారీ, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా మన దేశంలోని బ్యూటీ–ఫార్మా పరిశ్రమ బలోపేతం అవుతుంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది’ అంటున్నారు బ్యూటీ–ఫార్మాకు చెందిన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌లు.

అసమానతలు లేకుండా...
మా వాహక్, విట్ట సఖీగా మహిళలు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని చేరుకోవడానికి బీమా వాహక్‌లకు కేంద్ర బడ్టెట్‌లో ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంది. ‘బడ్జెట్‌ అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే గత కొంతకాలంగా స్త్రీ సాధికారత దృష్ట్యా అది మరింత ఆసక్తికరంగా మారింది. జెండర్‌ బడ్జెటింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చే ధోరణి పెరగడం సంతోషం కలిగిస్తోంది. బడ్జెట్‌లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మీదే వారి పురోగతి ఆధారపడి ఉంటుంది’ అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు.

Advertisement
 
Advertisement
Advertisement