న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం రూ.3 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని లాజిస్టిక్స్ రంగ నైపుణ్య మండలి (ఎల్‌ఎస్‌సీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మౌలిక రంగానికి సంబంధించి భారీ సంస్కరణలు చేపట్టాలని, బడ్జెట్‌లో కేటాయింపులను పెద్ద మొత్తంలో పెంచాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాల కోసం, రహదారుల నిర్మాణం, పట్టణరవాణా, స్మార్ట్ సిటీల కోసం రూ.1.5 లక్షల కోట్లు కేటాయించగా, ఈ విడత రెట్టింపు చేయాలన్నది లాజిస్టిక్స్ రంగం డిమాండ్‌గా ఉంది. దేశ ఆర్థిక వృద్ధిలో లాజిస్టిక్స్ రంగం కీలక పాత్ర పోషిస్తున్నట్టు లాజిస్టిక్స్ రంగ నైపుణ్య మండలి సీఈవో రవికాంత్ యమర్తి తెలిపారు. బడ్జెట్ 2026 వృద్ధి, ఉపాధి కల్పన, ఆత్మనిర్భర్ భారత్ దిశగా కొత్త బెంచ్‌మార్క్ ఏర్పాటుకు ఒక అవకాశమని చెప్పారు.
జాతీయ రహదారులు, రైల్వేలు, లాజిస్టిక్స్ కారిడార్లపై కొన్నేళ్లుగా చేస్తున్న పెట్టుబడులను గుర్తు చేస్తూ.. ఈ రంగానికి కేటాయింపులను రెట్టింపు చేయడం ద్వారా సరఫరా వ్యవస్థ బలపడుతుందని, అంతర్జాతీయంగా పోటీతత్వం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, పోటీతత్వాన్ని పెంచేందుకు, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ప్రయోజనాలను అందించేందుకు స్థిరమైన మౌలిక సదుపాయాల ప్రణాళికలు అవసరమమంటూ పరిశ్రమ ప్రభుత్వానికి సూచించింది.
వినియోగానికి ఊతం..
వినియోగం తదుపరి దశ వృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కీలకమని గోదావత్ గ్రూప్ ఎండీ శ్రేణిక్ గోదావత్ పేర్కొన్నారు. ‘‘రిటైల్ ఆధారిత సదుపాయాల కల్పనకు వచ్చే బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా ఆధునిక గోదాములు, కోల్డ్ చైన్ సదుపాయాలు, మారుమూల ప్రాంతాలకు రవాణా సదుపాయాల విస్తరణ కారిడార్లకు ప్రాధాన్యం ఇవ్వాలి’’అని కోరారు.


