డెట్‌ ఫండ్స్‌కు ఇండెక్సేషన్‌ ప్రయోజనం | Union Budget 2026 AMFI lobbied for its indexation benefit reinstatement | Sakshi
Sakshi News home page

డెట్‌ ఫండ్స్‌కు ఇండెక్సేషన్‌ ప్రయోజనం

Jan 21 2026 7:31 AM | Updated on Jan 21 2026 7:31 AM

Union Budget 2026 AMFI lobbied for its indexation benefit reinstatement

తిరిగి పునరుద్ధరించాలి

కొత్త విధానంలోనూ ఈఎల్‌ఎస్‌ఎస్‌కు మినహాయింపు

ఎన్‌పీఎస్‌ ప్రయోజనాలు ఫండ్స్‌కు వర్తింపజేయాలి

బడ్జెట్‌ 2026–27పై యాంఫి సూచనలు 

మరో 10 రోజుల్లో పార్లమెంట్‌ ముందుకు రానున్న 2026–27 బడ్జెట్‌కు సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల అసోసియేషన్‌ (యాంఫి) కీలక సూచనలు చేసింది. డెట్‌ ఫండ్స్‌లో పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాలకు (మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులపై) గతంలో మాదిరి ఇండెక్సేషన్‌ ప్రయోజనాన్ని (లాభం నుంచి ద్రవ్యోల్బణం మినహాయింపు) పునరుద్ధరించాలని కోరింది. అలాగే, జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌) మాదిరి ప్రయోజనాలతో పెన్షన్‌ ఫండ్స్‌ను ఆఫర్‌ చేసేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలను అనుమతించాలని కోరింది.

ముఖ్యంగా ఈక్విటీ పెట్టుబడులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.25 లక్షలుగా ఉన్న పన్ను రహిత మూలధన లాభాల పరిమితిని రూ.2 లక్షలకు పెంచాలని సూచించింది. అంతేకాదు ప్రస్తుతం ఏడాది మించిన ఈక్విటీ పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్నును అమలు చేస్తుండగా, దీన్ని ఈక్విటీ ఫండ్స్‌కు ఐదేళ్లకు పెంచాలని కోరింది. దీనివల్ల ఇన్వెస్టర్లు దీర్ఘకాలంపాటు పెట్టుబడులను కొనసాగిస్తారని పేర్కొంది

యాంఫి సూచనలు..

  • ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఫండ్స్‌లో పెట్టుబడులకు కొత్త పన్ను విధానంలోనూ పన్ను ప్రయోజనాన్ని కల్పించాలి.

  • ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (ఎఫ్‌వోఎఫ్‌) పథకాలను ఈక్విటీ ఆధారిత పథకాలుగా వర్గీకరించాలి.  

  • ఫ్యూచర్స్, అప్షన్లపై మ్యూచువల్‌ ఫండ్స్‌ లావాదేవీలకు గతంలో మాదిరి సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్‌టీటీ) రేట్లను వర్తింపజేయాలి. ఎందుకంటే ఆర్బిట్రేజ్‌ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌ తమ పెట్టుబడులకు హెడ్జింగ్‌గా ఫ్యూచర్స్, ఆప్షన్లను వినియోగిస్తుంటాయి.

  • రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్‌), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్వీట్‌)లో కనీసం 65 శాతం ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఈక్విటీ పథకాల మాదిరి పన్నును వర్తింపచేయాలి.

  • భారత బాండ్‌ మార్కెట్‌ విస్తరణకు వీలుగా డెట్‌ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (డీఎల్‌ఎస్‌ఎస్‌)ను ప్రవేశపెట్టాలి.

  • మ్యూచువల్‌ ఫండ్‌ – స్వచ్ఛంద పదవీ విరమణ ఖాతాను ప్రవేశపెట్టాలి.

  • ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించి వసూలు చేసే మూలం వద్ద పన్ను (టీడీఎస్‌)పై సర్‌చార్జీకి ఏకరూప రేటును తీసుకురావాలి.

  • మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌ను పంపిణీ చేసే ఆదాయంపై టీడీఎస్‌ అమలు పరిమితిని పెంచాలి.

  • సెక్షన్‌ 54ఈసీ కింద ఎల్‌టీసీజీ మినహాయింపునకు వీలుగా మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లను దీర్ఘకాల ఆస్తులుగా వర్గీకరించాలి.

ఇదీ చదవండి: సహజ వజ్రాలకే ‘డైమండ్’ గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement