ఈక్విటీలపై పన్ను.. క్యాపిటల్‌ మార్కెట్‌ భాగస్వాముల డిమాండ్‌ | Capital market participants pressing govt for tax relief on Budget 2026–27 | Sakshi
Sakshi News home page

ఈక్విటీలపై పన్ను.. క్యాపిటల్‌ మార్కెట్‌ భాగస్వాముల డిమాండ్‌

Jan 20 2026 8:30 AM | Updated on Jan 20 2026 12:10 PM

Capital market participants pressing govt for tax relief on Budget 2026–27

ఈక్విటీ పెట్టుబడులపై పన్ను భారాన్ని తగ్గించాలని క్యాపిటల్‌ మార్కెట్‌ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. 2026–27 బడ్జెట్‌లో దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను (ఎల్‌టీసీజీ) తగ్గించడంతోపాటు, పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని సూచించాయి. దీనివల్ల రిటైల్, దీర్ఘకాల పెట్టుబడిదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నాయి. సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్‌టీటీ) మరింత పెంచకుండా ఉండాలని కోరాయి. వచ్చే ఆర్థిక సంత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న మంత్రి సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే.  

ఎల్‌టీసీజీ మినహాయింపు పెంచాలి..

ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాల లాభం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు మించకపోతే ప్రస్తుతం ఎలాంటి పన్ను లేదు. ఇంతకు మించిన మొత్తంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. రూ.2 లక్షల వరకు లాభంపై పన్ను మినహాయింపును పెంచాలని జేఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రభుత్వానికి సూచించింది. దీర్ఘకాలం అన్న నిర్వచనాన్ని ఈక్విటీలకు 12 నెలలు ఉండగా.. డెట్, బంగారం, రియల్‌ ఎస్టేట్‌ ఇలా అన్ని సాధనాలకు ఒకే విధంగా అమలు చేయాలని కోరింది. దీనివల్ల పన్నలపై స్పష్టత పెరిగి, సంక్లిష్టత తగ్గుతుందని పేర్కొంది. మూలధన నష్టాన్ని ఇతర ఆదాయంతోనూ సర్దుబాటుకు అవకాశం కల్పించాలని కోరింది.

ఎస్‌టీటీ తక్కువగా ఉండాలి..  

స్పెక్యులేటివ్‌ ట్రేడింగ్‌ను నిరుత్సాహపరిచి, దీర్ఘకాల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా.. డెరివేటివ్స్‌ కంటే ఈక్విటీ డ్రేడ్‌లపై ఎస్‌టీటీ తక్కువగా ఉండాలని ప్రభుత్వానికి సూచించినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీఈవో, ఎండీ ధీరజ్‌ రెల్లి వెల్లడించారు. షేర్ల బైబ్యాక్‌లో కేవలం లాభంపైనే పన్ను ఉండాలన్నారు. ఎస్‌టీటీని మరింత పెంపునకు ప్రభుత్వం దూరంగా ఉండాలని ఫయర్స్‌ సీఈవో తేజాస్‌ ఖోడే పేర్కొన్నారు. దీర్ఘకాల, స్వల్పకాల మూలధన లాభం పన్నును 10 శాతానికి తగ్గించినట్టయితే రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం మరింత పెరుగుతుందన్నారు. బంగారం, వెండిపై దిగుమతుల సుంకాన్ని ప్రభుత్వం మరింత పెంచకపోవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ట్రంప్‌ 2.0.. ఏడాదిలో వచ్చిన ఆర్థిక మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement