
పేరుకు ప్రజాస్వామ్యమైనా రాచరిక వ్యవస్థ, దాని విధేయ సైన్యం, రాజ్యాంగ న్యాయస్థానం థాయ్‌లాండ్ రాజకీయాలను తెర వెనకుండి శాసించటం విడనాడలేదు. పర్యవసానంగా రెండేళ్ల వ్యవధిలో మూడో ప్రధాని రంగప్రవేశం చేశారు. ఇటీవల న్యాయస్థానం ఆదేశంతో పదవి నుంచి వైదొలగిన పేటోన్‌టాన్ షినవత్రా స్థానంలో బీజేటీ పార్టీ అధినేత అనుతిన్ చార్నివిరకుల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ మధ్య థాయ్‌లాండ్–కంబోడియాల సైన్యాల మధ్య నాలుగు రోజులపాటు కొనసాగిన ఘర్షణలు థాయ్‌లాండ్‌లో రాజకీయ దుమారం రేపాయి. ఆ ఘర్షణల్లో ఇరువైపులా 30 మంది మరణించారు. సరిహద్దులపై తలెత్తిన ఈ యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు లొంగి ఇరు దేశాలూ విరమించాయి. ఆ వెంటనే థాయ్ జాతీయవాదులు ఆగ్రహోదగ్రులయ్యారు.
షినవత్రా తప్పుకోవాలంటూ ఉద్యమం నడిచింది. ఈలోగానే కంబోడియా మాజీ అధినేత హూన్‌సేన్‌తో ఆమె ఫోన్ సంభాషణ లీక్ కావటంతో అంతా తలకిందులైంది. ఈ సంభాషణలో తమ దేశ సైనిక జనరల్‌ను ఆమె తప్పుబట్టడం, వివాదం పరిష్కారానికి చొరవ తీసుకోవాలని హూన్‌సేన్‌ను కోరటం నేరంగా పరిగణించి ఆమె వైదొలగాలంటూ కోర్టు ఆదేశించింది.
ప్రధానిగా ఉంటూ, ప్రత్యర్థి దేశానికి చెందిన నాయకుడితో సంభాషించటం, సైనిక జనరల్‌ను కించపరచటం తప్పే అయినా న్యాయస్థానానికి ఏమంత గొప్ప చరిత్ర లేదు. రాచరిక వ్యవస్థకు అనుకూలమైన తీర్పులిస్తూ ఎన్నికైన ప్రభుత్వాలను ఏదో సాకుతో తొలగించి అస్థిరపర్చటం దానికి అలవాటు. అంతేకాదు... రాచరిక అనుకూల నేతలు హత్యలు చేసినా, అవినీతికి పాల్పడినా నిర్దోషులుగా తీర్పునివ్వటం రివాజు.
1932లోనే రాచరిక వ్యవస్థ అంతరించినా అదంతా నామమాత్రం. వ్యవస్థలన్నీ దాని చెప్పుచేతల్లోనే ఉంటాయి. సైనిక కుట్రల ద్వారా లేదా న్యాయస్థానం ద్వారా ప్రభుత్వాలను కూల దోయటం పరిపాటైంది. ఎన్నికైన ఏ ప్రభుత్వమూ పూర్తికాలం అధికారంలో లేదు.
ఇందుకు షినవత్రా తండ్రి తక్సిన్ షినవత్రా ఒక్కరే మినహాయింపు. 2001లో అధికారంలోకొచ్చిన తక్సిన్‌ను పదవీకాలం చివర 2006లో సైనిక కుట్ర ద్వారా తొలగించారు.
గత ఇరవయ్యేళ్లలో షినవత్రా కుటుంబం రెండు సైనిక కుట్రలనూ, మూడు కోర్టు తీర్పులనూ చవిచూసి మూడు ప్రభుత్వాలను కోల్పోయింది. ఈ రెండు దశాబ్దాల కాలంలో అయిదుగురు ప్రధానులు మారారు. తక్సిన్ ఆధ్వర్యంలోని థాయ్ రక్ థాయ్ పార్టీని 2007లో అయిదేళ్లపాటు నిషేధించారు . అటుతర్వాత ఫ్యు థాయ్ పేరిట మరో పార్టీ స్థాపించారు. ఆయన కుమార్తె పేటోన్‌టాన్ పది నెలలపాటు కూటమి ప్రభుత్వాన్ని నడిపారు.
పార్టీలనూ, అధినేతలనూ నిషేధించటం షినవత్రాతో ఆగిపోలేదు. 2020లో ఫ్యూచర్ ఫార్వర్డ్ పార్టీని, 2023లో మూవ్ ఫార్వర్డ్ పార్టీని ఇదేవిధంగా నిషేధించి ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ ఆంక్షలు విధించారు. ఒకరిద్దరు సీనియర్ నేతలపై దశాబ్దంపాటు ఏ పదవీ చేపట్టరాదని తీర్పులిచ్చారు.
నిరుపేదల సంక్షేమాన్ని పట్టించుకుని, వారి జీవితాలను మెరుగుపర్చటానికి ప్రయత్నిస్తే రాచరిక వ్యవస్థకు కడుపుమంట. తక్సిన్ షిన వత్రానైనా, ఇతర అధినేతలనైనా కేవలం ఆ కారణంతోనే ముప్పుతిప్పలు పెట్టారు. 2006లో పదవి నుంచి తప్పించాక తక్సిన్ ప్రవాసానికి వెళ్లి పదిహేడేళ్ల తర్వాత 2023లో స్వదేశానికొచ్చారు. అటుపై అవినీతి, ఇతర నేరాల్లో ఆయన్ను అరెస్టు చేయగా అనారోగ్య కారణం చూపి ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన జైలుశిక్ష సక్రమంగా అనుభవించారా లేదా అన్న అంశంపై ఇప్పుడు తీర్పు రాబోతోంది.
సైనిక జనరళ్ల నియామకాల్లో ప్రభుత్వ ప్రమేయాన్ని పెంచే ప్రతిపాదనను పేటోన్ టాన్ ప్రభుత్వం పరిశీలించింది. సైన్యం ఒత్తిళ్లతో దాన్ని విరమించుకున్నా ఆమెపై పగబట్టారు. అందుకే ఫోన్లపై నిఘాపెట్టి సాగనంపారు. దేశంలో అస్థిరత అలుము కోవటంతో విదేశీ మదుపుదార్లు 2,300 కోట్ల డాలర్ల మేర వెనక్కు తీసుకున్నారు.
అసలే అంతంతమాత్రంగా ఉన్న థాయ్ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత దిగజారింది. ఇలాంటి స్థితిలో కొత్త ప్రధాని అనుతిన్ దేశాన్ని గట్టెక్కించగలరా... అసలు సైన్యం సక్రమంగా పాలించనిస్తుందా అన్నది వేచిచూడాలి.