
విశ్వ గురు
అమెరికన్ మిడిల్ – డిస్టెన్స్ రన్నర్ ఎమ్మా జేన్ కోబర్న్ 3,000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో ప్రపంచ ఛాంపియన్. ఒలింపిక్ కాంస్య పతక విజేత. 10 పర్యాయాలు అమె రికా జాతీయ ఛాంపియన్. ఈ ఏడాది మే 8న కొలరాడో విశ్వవిద్యాలయ 2025 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి కోబర్న్ చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం:
శుభోదయం. 2025 బ్యాచ్ వాళ్ళకు అభినందనలు. నేటితో ఒక అధ్యాయం ముగిసినట్లు కాదు. ఒక పరుగు పందెం పరిసమాప్తమైంది. మరోటి మొదలవుతోంది. అంతే! మీరు విజయ రేఖ దాటే శారు. మిగిలినవాటిని ఎదు ర్కొనేందుకు మరో రేఖ ముందు ఉన్నారు.
ఈ విశ్వవిద్యాలయమే నన్ను తీర్చిదిద్దింది. క్యాంపస్‌లో చేతులు కలిపిన అమ్మ, నాన్నలకి నేను ఇక్కడే బౌల్డర్‌లో పుట్టాను. అథ్లెట్‌గా, మనిషిగా వృద్ధిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తూ తరచుగా ఆలోచించే సంగతులను మీతో పంచుకుంటాను.
‘వెలితి’పై బెంగ వద్దు!
నేను దాన్ని ‘వెలితి’గా పిలుస్తా. మీరు ఇపుడు ఉన్న స్థానానికీ, మీరు చేరుకోవాలనుకుంటున్న స్థానానికీ మధ్యనున్న ఖాళీ. ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితికి చేరుకోవాలనుకుంటున్నారో దానిమధ్య నున్న వ్యత్యాసం. అది ఒక లోపం కాదు. వెనుకబడ్డారనడానికి సంకేతమూ కాదు.
అది మీకంటూ జీవితం పట్ల ఒక దార్శనికత ఉందనడానికి రుజువు. మరింత ఉన్నత స్థితికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కనుకనే ఆ వెలితి ఏర్పడింది. ఆ వెలితిని భరించడం ఒక్కోసారి ఇబ్బందికరంగా, బాధగా కూడా అనిపించవచ్చు. కానీ, సత్యాన్ని గ్రహించండి. ఒత్తిడి, అసౌకర్యం, అపరిచితం ఉన్నచోటనే వృద్ధి సాధ్యమవుతుంది.
మీరు గమనించలేదేమో కానీ, ఒక ‘వెలితి’ని మీరు ఇప్పటికే భర్తీ చేసేశారు. చూస్తూ చూస్తూ ఉండగానే పట్టభద్రులై పోయారు. ఒక్కసారి కాలేజీలో అడుగు పెట్టిన మొదటి రోజును గుర్తు తెచ్చుకోండి. ఆత్మవిశ్వాసం, ఆనందాతిరేకాలతోనే క్యాంపస్‌లో కాలిడి ఉండవచ్చు. ఆడిటోరియం కోసం వెతుకుతూ దారి తప్పి ఉండవచ్చు.
బెంగతో అమ్మకు రెండు మూడుసార్లు ఫోన్ చేసి ఉండ వచ్చు. బుర్ర నిండా ప్రశ్నలే! స్నేహితుల్ని పోగేసుకోవడం ఎలాగో నంటూ ఆలోచన. ఉదయం 8 గంటలకే మొదలయ్యే పాఠాలు వినడంపై తర్జన భర్జన. పరీక్షలో జవాబులు రాయడం, ఇంటెర్న్ షిప్‌నకు దరఖాస్తు చేసుకోవడం తెలియదు. వంటగదిలో పనులు చక్కబెట్టడం ఇప్పటికీ మీలో కొందరికి తెలియకపోవచ్చు.
కానీ, గత కొద్ది ఏళ్ళుగా కొద్ది కొద్దిగా కొత్త నైపుణ్యాలను, కొత్త అలవాట్లను సంతరించుకుంటూ వచ్చారు. మీకు మీరే కొత్త వ్యక్తిగా రూపాంతరం చెందారు. సమయాన్ని వెచ్చించడంపై ఒక అవగాహ నకు వచ్చారు లేదా మీకు మీరు నచ్చజెప్పుకునే విధంగా కాలాన్ని వెచ్చిస్తున్నారు. అవసరమైతే ఇతరుల సహాయాన్ని ఎలా పొందాలో నేర్చుకున్నారు.
వెలితిని భర్తీ చేసుకోవాల్సిన విధానం ఇదే అనుకుంటా! ఒక్క రాత్రిలో కాదు. ఒక్కసారిగా కాదు. కానీ, స్థిరంగా అడుగులు పడాలి. క్యాంపస్ లోకి మొదటి రోజు బెరుకుగా అడుగు లేస్తూ వచ్చిన వ్యక్తి... నేడు నిబ్బరంగా కూర్చున్న వ్యక్తి ఒక్కరే! కానీ, మార్పు యథాలాపంగా రాలేదు. సంతరించుకుంటే వచ్చింది. అది మీరిక్కడ నిశ్శబ్దంగా, ఆర్భాటాలు లేకుండా, శ్రద్ధ పెట్టి చదువు కోవడం వల్ల వచ్చిన మార్పు!
రెండు నియమాలు
కానీ, ఇక్కడ నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి ఏమిటి? కాలేజీలోలాగా గురువులు లేకపోయినా స్వయంగా నిలబడగలగాలి. మీ తప్పటడుగులను మీరే సరిదిద్దు కోవాలి. ‘వెలితి’ని భర్తీ చేసుకోవడంలో రెండు నియమాలు నాకు సహాయపడ్డాయి. అవి మీకూ తప్పకుండా ఉపకరిస్తాయి.
1. ప్రజ్ఞ అవసరం లేనివాటిని మొదట సాధించండి!
త్వరగా నిద్ర లేవడానికి, సమయ పాలనకు, దయతో మెలగేందుకు, ప్రతిస్పందనలను ఆలకిం
చేందుకు, స్థిర బుద్ధితో వ్యవహరించడానికి ప్రజ్ఞా పాటవాలు అవసరం లేదు. అవి ఎవరో కానుకగా ఇచ్చేవి కావు. మనం అలవరచుకుంటే వచ్చేవి.
నేను అత్యంత అదృష్టవంతురాలినో లేదా శక్తి సామర్థ్యాలు ఉన్నదాన్నో కావడం వల్ల పరుగు పందాల్లో గెలవలేదు. చిన్న అడుగులే అయినా స్థిరంగా వేస్తూ వచ్చాను. పరుగెత్తాల్సిన దూరాన్ని తగ్గించుకోలేదు. ఆకర్షణగా లేనివాటిని వదిలేయలేదు. ఎదుటివారు చెప్పింది విన్నాను. శ్రమకోర్చి తర్ఫీదు పొందాను. క్రమశిక్షణను పెంపొందించుకున్నాను. కేవలం శక్తితోనే కాకుండా, ఆ రకమైన క్రమశిక్షణ వల్లనే 2016లో ఒలింపిక్ పతకాన్ని, 2017లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణాన్ని గెలుచుకున్నాను.
2. చెయ్యగలిగింది చేయండి– మీ చేతిలో లేనివాటిని వదిలేయండి.
క్రీడల్లో ఎవరన్నా నన్ను వంచిస్తే, లేదా నాకన్నా మెరుగైన సామర్థ్యాన్ని కనబరిస్తే, లేదా పోటీ రోజు వర్షం పడితే నేను చేయ గలిగింది ఏమీ లేదు. కానీ, నా స్పందనను నియంత్రించుకోగలను. జీవితంలో మార్పునకు లోనయ్యే అంశాలే ఎక్కువగా ఉంటాయి. కానీ, వాటిని తట్టుకోవడంలో సన్నద్ధత మన చేతిలో ఉంటుంది. మన నియంత్రణలో ఉన్నవాటిపై దృష్టి కేంద్రీకరిస్తే, మనం బలంగా తయారవుతాం. మన చేతిలో లేనివాటినే తలచుకుంటూ కూర్చుంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అయిపోతాం.
కొన్నింటిలో విఫలం కావచ్చు. విజేతగా నిలుస్తామనుకున్న చోట ఓడిపోనూ వచ్చు. దానికి డీలా పడనక్కర లేదు. టోక్యో
ఒలింపిక్స్‌లో నేను విఫలమయ్యా. పరుగుపందెంలో ఆఖరి అంచెలో పడిపోయా. అనర్హురాలినయ్యా. దేని కోసం నేను ఏళ్ళ తరబడి శిక్షణ పొందానో, ఏవి నా ఒలింపిక్స్ అని చాటాలనుకున్నానో అందులో విఫలమయ్యా. బహిరంగ వైఫల్యం. నిరాశ చెందా. కానీ, శ్రమించి పెంచుకున్న సామర్థ్యం వల్ల, ఓటమిని దిగమింగుకున్నా.
తదుపరి వేసవిలో నా పదవ అమెరికా జాతీయ ఛాంపియన్‌షిప్ సాధించా. ఒకే పోటీలో పదిసార్లు విజేతగా నిలిచిన రన్నర్ నేను ఒక్కదాన్నే!
ఉద్యోగంలో, ప్రేమలో, జీవితంలో ఎవరైనా విఫలం కావచ్చు. కనుక, తిరిగి పోరాడగల సామర్థ్యాన్ని ఇప్పటి నుంచే పెంచుకోండి. వైఫల్యం లేకపోవడం విజయం కాదు. ఓటమి నుంచి ముందుకు సాగగల సత్తాయే విజయం.
మీ జీవితానికి మీరే జవాబుదారీ. ఉన్న స్థితికీ, చేరుకోవాలను కుంటున్న స్థితికీ మధ్య వెలితిని భర్తీ చేయాల్సింది మీరే! భయం ముప్పిరిగొన్నా, సందేహం వెనక్కి లాగుతున్నా ధైర్యంగా, క్రమ శిక్షణతో చిన్న అడుగులైనా ముందుకు వేస్తూనే ఉండండి.