విశ్వగురు
ఐదు ట్రిలియన్ డాలర్ల విలువైన తొలి, ఏకైక కంపెనీగా ‘ఎన్విడియా’ ఇటీవలే చరిత్ర సృష్టించింది. ఎన్విడియా సహ–వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన తైవానీస్–అమెరికన్ వ్యాపారవేత్త జెన్‌సెన్ హూవాంగ్ కాలిఫోర్నియాలోని ‘క్యాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ (కాల్‌టెక్) పట్టభద్రులను ఉద్దేశించి చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం:
ఇది నిజంగా సంతోషకరమైన రోజు. మీరంతా ‘కాల్‌టెక్’ నుంచి పట్టభద్రులవుతున్నారు. ఈ విద్యాలయంలో చదువుకుని ఉన్నత స్థానాలకు చేరిన వారిలో కొందరు నన్నూ, మా సంస్థనూ ఎంతో ప్రభావితం చేశారు. ‘ఎన్విడియా’లోని ఇద్దరు చీఫ్ సైంటిస్టులు ఇక్కడి నుంచి వచ్చినవారే. నిజానికి, సలహాలు ఇవ్వడమంటే నాకు ఇష్టం ఉండదు. నేను ఇష్టపడిన ఉదంతాలను, జీవితాను భవాలను కొన్ని చెబుతాను. సలహాలు వాటిలోనే అంతర్లీనంగా ఉంటాయి.
ప్రపంచంలో ఒక టెక్ కంపెనీకి ఇంత సుదీర్ఘ కాలంగా సీఈఓగా ఉన్నది బహుశా నేనే అనుకుంటా. నేను ఈ 31 ఏళ్ళ వృత్తి జీవితంలో ఎంచుకున్న రంగం నుంచి బయటపడకుండా చూసు కున్నాను. విసుగు చెందలేదు. ఉద్వాసనకు గురయ్యే పరిస్థితులు తెచ్చుకోలేదు. మేధాపరమైన నిజాయతీ, ఒదిగి ఉండటం మా కంపెనీని కాపాడాయని చెప్పగలను.
ఏఐ వెంట పరుగెత్తాలి!
‘కుడా’ అనే ప్రోగ్రామింగ్ మోడల్ తయారు చేసేందుకు మాకు 20 ఏళ్ళకు పైగా పట్టింది. అది నేడు కంప్యూటింగ్ రంగాన్ని విప్లవా త్మకంగా మారుస్తోంది. టెక్నాలజీ పరంగా ఎన్నో పర్యవసానాలకు దారితీయగల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలోకి దిగాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్లను ప్రోత్సహిస్తాను. ఏకకాలంలో, బహు ముఖాలుగా వికసనం పొందుతూ ముందుకు సాగుతున్న టెక్నాలజీ అదొక్కటే!
ఏఐ వెంట నడవడం కాదు పరుగెత్తండని నేను ‘తైవాన్ యూనివర్సిటీ’ విద్యార్థులకు సూచించాను. ఏఐ విప్లవంతో మమేకం కండని చెప్పాను. ఆ తర్వాత, ఒక ఏడాది గడిచేటప్పటికే అది నమ్మలేనంతగా మారిపోయింది. ఈ అసాధారణ పరిణామాలను మీరు అంతర్ దృష్టితో అవగాహన చేసుకోవాలి. మీ ముందున్న ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్‌గా తీసు కుని ముందుకు సాగండి.
ఆధునిక కంప్యూటింగ్ మూలాలు ఐబీఎం సిస్టమ్ 360లో ఉన్నాయి. నేను పుట్టిన ఏడాది తర్వాత, అది మార్కెట్లోకి వచ్చింది. చిప్‌ల రూపకల్పన నేర్చుకున్న 1980లలోని తొలి తరం వి.ఎల్. ఎస్.ఐ. ఇంజినీర్లలో నేనొకడిని. అప్పటి పాఠ్య పుస్తకాన్ని కాల్‌టెక్‌లో చదివినవారే తయారు చేశారు. ఆ పుస్తకం ఐసీ డిజైన్‌ను విప్లవీకరించింది. మా తరం సూపర్ జైంట్ చిప్‌లు డిజైన్ చేసేందుకు, అంతి మంగా సీపీయూ తయారీకి వీలు కల్పించింది.
కంప్యూటింగ్‌లో బ్రహ్మాండమైన వృద్ధికి సీపీయూ బాటలు పర చింది. ప్రపంచం అంతకు ముందెన్నడూ చూడనంత సామూహిక ఉత్పత్తి మొదలైంది. అది పైకి కనిపించనిది. తేలిగ్గా కాపీ చేయదగి నది. అదే సాఫ్ట్‌వేర్. నేను మీలాగా విద్యార్థిగా ఉన్నప్పుడు అది చాలా స్వల్ప స్థాయిలో ఉంది. సాఫ్ట్‌వేర్‌ను విక్రయించి సొమ్ము చేసు కోవచ్చుననే భావన అప్పట్లో ఒక స్వైర కల్పన మాత్రమే. నేడు అది అత్యంత ముఖ్యమైన వస్తువు అయిపోయింది. ఎన్విడియా తీసుకొచ్చిన ‘కుడా’ ఫలితంగా కంప్యూటింగ్‌లో వచ్చిన వేగం మరింత ముందుకు సాగేందుకు తోవ చూపింది.
అలెక్స్ నెట్‌కు శిక్షణ ఇచ్చేందుకు కొందరు ఎన్విడియాకు చెందిన ‘కుడా జీపీయూ’లను ఉపయోగించుకున్నారు. డీప్ లెర్నింగ్ ఆవిర్భవించింది. ఆ కీలక పరిణామం ఏఐ విప్లవానికి నాంది పలికింది. భారీ జీపీయూ క్లస్టర్లను నిర్మించకుండా డీప్ లెర్నింగ్‌కు ఉన్న పరిమితులను అన్వేషించేదెట్లా? వాటిని నిర్మించడానికి కోట్లాది డాలర్లు అవసరం. అంత ఖర్చు పెట్టినా ఫలితం ఉంటుందా? క్లస్టర్లను నిర్మించకపోతే, అది ఎప్పటికీ మనకు తెలియదు. వేలాది ఇంజినీర్లు డీప్ లెర్నింగ్ పైన, అడ్వాన్సింగ్, స్కేలింగ్ డీప్ లెర్నింగ్ పైన పదేళ్ళపాటు కృషి చేశారు. మా మొదటి ఏఐ సూపర్ కంప్యూ టర్ డీజీఎక్స్–1ను శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్‌కు 2016లో అందించాం. ఏఐపై పనిచేస్తున్న నా స్నేహితుల బృందం ‘ఓపెన్ ఏఐ’ పేరుతో ఆ కంపెనీని నెలకొల్పింది. వాళ్లే ‘చాట్‌జీపీటీ’ తెచ్చారు.
తోటమాలి నేర్పిన పాఠం
ఏఐలో తదుపరి అల రోబోటిక్స్ కాబోతోంది. రోబోలు, రోబో టిక్ వాహనాలు, హ్యూమనాయిడ్ రోబోలు, చివరకు రోబోలు కాప లాగా ఉండి నడిపించే భారీ గిడ్డంగులను నిర్మించే వందలాది కంపె నీలతో మేం కలసి పనిచేస్తున్నాం. కానీ, మా రోబోటిక్స్ పయనంలో చాలా ఎదురుదెబ్బలు తిన్నాం. డీప్ లెర్నింగ్ అంటే ఎవరికీ అర్థం కాని సమయంలో కలన గణితాన్ని ప్రాసెసింగ్ చేసే ప్రపంచపు మొదటి రోబోటిక్ కంప్యూటర్‌ను నిర్మించాం. మేం పరిస్థితులకు తగ్గట్లుగా ఒదిగిపోయే, మార్పు చెందే, చతికిల పడినా తిరిగి లేవ గలిగిన శక్తిని అభివృద్ధి చేసుకున్నాం.
మా పిల్లలు చిన్న వయసులో ఉండగా, ఒక వేసవిని జపాన్‌లో గడిపాం. ఒక వారాంతంలో క్యోటో వెళ్ళి, సిల్వర్ టెంపుల్ చూశాం. అది ఆకర్షణీయమైన మోస్ గార్డెన్‌కు ప్రసిద్ధి. అక్కడ ఒక ఒంటరి తోటమాలిని గమనించాను. అక్కడ ప్రపంచంలో దాదాపు ప్రతి రకం నాచునూ పెంచుతారు. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాను. ‘నిర్జీవంగా మారిన నాచును తొలగిస్తున్నాను’ అని జవాబిచ్చాడు. ‘కానీ మీ గార్డెన్ చాలా పెద్దది కదా!’ అన్నాను. ‘నేను 25 ఏళ్ళుగా ఈ తోట ఆలనాపాలనా చూస్తున్నాను. నాకు కావలసినంత సమయం ఉంది’ అని జవాబిచ్చాడు. జీవితంలో నేను నేర్చుకున్న అత్యంత సునిశితమైన పాఠాలలో అదొకటి. ఈ తోటమాలి తనకు వచ్చిన కళకు అంకితమయ్యాడు. మనమూ అదే బాటలో నడిస్తే, మనకు కావాల్సినంత సమయం ఉంటుంది.
నేను చేయవలసిన పనుల ప్రాధాన్య క్రమాన్ని రాసుకుని, ప్రతి రోజూ ఉదయం, ఆ జాబితాలోని మొదటి పనితో ప్రారంభిస్తా.ఏ పని తర్వాత ఏ పని చేయాలన్న విషయంలో చాలా స్పష్టతతో ఉంటాను. నేను పనిలో ఉండగా ఎవరన్నా వచ్చి ఏదో చెప్పి లేదా అడిగి అవాంతరం కల్పించినా ‘నాకు చాలా సమయం ఉంది. నా పని పూర్తి చేసుకోగలను’ అని చెబుతాను.
సూపర్ పవర్స్
మనం పడే వేదనలు, కష్టాలు మన వ్యక్తిత్వాన్ని పటిష్ఠ పరు స్తాయి. ఒకటి కాకపోతే మరొకటి ప్రయత్నించి చూద్దామనే లక్షణం అలవడుతుంది. నా సామర్థ్యాలలో నేను ఎక్కువ విలువ ఇచ్చు కునేది నా ఇంటెలిజెన్స్‌కు కాదు. కష్టనష్టాలను భరించగల నా సహనశీలతకు; ఒకదాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ పనిపై సుదీర్ఘమైన కాలం పనిచేయగల నా పట్టుదలకు; ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడగల శక్తికి; త్వరలోనే మరో అవకాశం రాబోతోందనే నా ఆశాభావానికి! వాటినే నేను నా ‘సూపర్ పవర్లు’గా పరిగణిస్తాను.
మీకు కావాల్సింది కనుగొనగలరని భావిస్తున్నాను. మొదటి రోజునే ఒక నిర్ణయానికి వచ్చేయాలని అనుకోవద్దు. తక్కువ కాలంలోనే దాన్ని కనుగొనగలగడం కూడా ముఖ్యం కాదు. కానీ, మీ జీవిత కాలాన్ని అంకితం చేయడానికి ఒక పనిని మీరు కనుగొన గలరని ఆశిస్తున్నాను. మీ నైపుణ్యాలకు దానిలో పదును పెట్టుకోండి. అది మీ జీవితకాల కృషి కావాలి.
చివరగా, చెప్పేది ఒక్కటే. జీవితంలో దేని తర్వాత ఏమిటో నిర్ణయించుకోవాలి. జీవితంలో అనేక సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. చేయవలసిన పనులు అనేకం ఉంటాయి. కానీ, ప్రాధాన్య క్రమాన్ని ఏర్పరచుకోండి. ముఖ్యమైన పనులు చేసేందుకు కావలసినంత సమయం చిక్కుతుంది.


