‘కాప్–30’ శిఖరాగ్ర సమావేశాలు నవంబర్ 10 నుంచి 21 వరకు బ్రెజిల్‌లో జరగనున్నాయి
సందర్భం
బ్రెజిల్‌లోని బెలేమ్ నగరంలో ఈ రోజు (నవంబర్ 10) నుంచి ‘సీఓపీ30’ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనిలో 100కు పైగా దేశాల ప్రతి నిధులు పాల్గొననున్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికలను అప్‌డేట్ చేసుకునేందుకూ, పుడమి తాపాన్ని నిరోధించే చర్యల అమలును ముందుకు తీసుకెళ్ళేందుకూ ఈ సమావేశాలు నిర్ణయాత్మక మైలురాయి కానున్నాయని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఆతిథ్యమిస్తున్న దేశంగా బ్రెజిల్ దీన్ని ఫలితమిచ్చిన శిఖరాగ్ర సమావేశంగా మలచాలని కోరుకుంటోంది. నడుం బిగించేందుకు ఇదే సమయమని సమావేశాల అధ్యక్షుడు ఆంద్రే కొర్రియా దొ లాగో అన్నారు.
అయినా పెరిగిన భూతాపం
వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ప్యారిస్ ఒప్పందం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం కూడా దీనికి కలసి వస్తోంది. అది కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకునే లక్ష్యంగా కుదిరిన గొప్ప ఒప్పందం. కానీ, దాని లక్ష్యసాధన దిశగా తీసుకుంటున్న చర్యలు ఇప్పటికీ అరకొరగానే ఉంటున్నాయి. పుడమి సగటు ఉష్ణో గ్రత పారిశ్రామిక విప్లవం ముందు రోజుల కన్నా, 1.5 సెంటిగ్రేడ్ దాటకుండా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 2024లో అది మొదటిసారి దాన్ని దాటేసింది.
తీవ్ర వాతావరణ ఉపద్రవాలు పెరుగుతూ పోతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడంతో 80కి పైగా దేశాలలో సముద్రపు దిబ్బలు నిర్జీవంగా మారాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్పును ఆపడం కష్టమైన ‘నిర్ణయాత్మక దశ’కు పుడమి చేరుకుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సమ తూకానికి ఎంతో ముఖ్యమైన అమెజాన్ సతత హరితారణ్యాలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఓపీ30 సమావేశాలు అమెజాన్‌కు సమీపంలోని నగరంలోనే జరుగుతున్నాయి.
ప్యారిస్ ఒప్పందానికి పరీక్ష
ప్యారిస్ ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు సుముఖంగా ఉన్నాయో లేదో సీఓపీ30 సమావేశాలలో తేలిపోనుంది. దుబాయ్‌లో 2023లో జరిగిన సీఓపీ28 సమావేశాల్లో ప్రపంచవ్యాప్త పరిస్థితిని మొదటిసారిగా సమీక్షించుకున్నారు. శిలాజ ఇంధనాల నుంచి మారడాన్ని ఆ సమావేశాల తుది ప్రకటనలో మొదటిసారిగా ప్రస్తావించారు. అజర్‌బైజాన్‌లో జరిగిన సీఓపీ29 సమావేశాల్లో నూతన వాతావరణ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వార్షిక వాతావరణ ఫైనాన్స్ 2035కల్లా 1.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరేటట్లు చూసుకోవాలని అంగీకారానికి వచ్చారు. జాతీయ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అమలుపరచడం, ఇంతవరకూ తీసుకున్న చర్యలను సమీక్షించడం బెలేమ్ సమా వేశాల్లో జరగనుంది.
వివిధ దేశాలు ఏ మేరకు ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయించుకున్నాయో వాటిని జాతీయ నిశ్చయ వాటాలు (ఎన్డీసీలు)గా పిలుస్తున్నారు. వీటిని ప్రతి ఐదేళ్ళ కొకసారి అప్డేట్ చేసుకుంటున్నారు. ప్యారిస్ ఒప్పందంపై సంతకాలు చేసిన 190కి పైగా దేశాలలో దాదాపు 70 ఇప్పటికే తమ లక్ష్యాలను అప్డేట్ చేశాయి. ప్రపంచ ఉద్గారాలలో మూడో వంతు పైగా వాటాకు మాత్రమే లెక్క తేలే విధంగా అవి ప్రణాళికలు సమర్పించాయి. పుడమి తాపాన్ని 1.5 సెంటిగ్రేడ్ పరిమితికి లోపల ఉంచేందుకు 2030 నాటికల్లా గ్రీన్‌హౌస్ వాయువు (కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటివి)లను సుమారు 31 గిగా టన్నులకు తగ్గించవలసి ఉంది. అయితే, అప్డేట్ చేసిన ఎన్డీసీలను లెక్కలోకి తీసుకున్నా అది 2 గిగా టన్నులకు మించడం లేదు.
అమెరికా తడబాటు – చైనా ఎడబాటు
భౌగోళిక రాజకీయాలు బహు సున్నితంగా ఉన్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ దేశాల మధ్య నమ్మకం కొరవడటం ప్రధాన సమస్యలలో ఒకటిగా పరిణమించింది. ఇది వాతావరణంపై చర్చలకు అవరోధం కానుంది. అంతర్జాతీయ వాతావరణ మార్పు నిరోధక సహాయ కార్యక్రమాలకు అమెరికా నుంచి అందే విరాళాలకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కోత పెట్టారు. ప్రభుత్వ వనరులను సైనిక, భద్రతాపరమైన అంశాలకు మళ్ళిస్తున్నారు.
తలో చేయి వేస్తామని చెప్పిన దేశాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. వాగ్దానం చేసిన మొత్తాలను తగ్గించి ఇస్తున్నాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు క్లైమేట్ ఫైనాన్సింగ్ ఇబ్బందులను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో సామాజిక ఉద్యమాల, పేద దేశాల ప్రతినిధుల హాజరు అంతంతమాత్రంగానే ఉండవచ్చుననిపిస్తోంది. చాలా దేశాలు తమ ప్రతినిధి బృందాల సంఖ్యను కుదించుకున్నాయి.
కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండగల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి మధ్యాదాయ దేశాల నాయకత్వాలు ముఖ్య పాత్ర వహించవలసి ఉంది. ప్రపంచ ఉద్గారాలలో సుమారు సగ భాగం ఈ దేశాల నుంచే ఉన్నాయి. ఇవి తమ దేశాల్లో పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే, మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ పైన కూడా పెద్ద బాధ్యతే ఉంది. వాతావరణ మార్పు ఇంత పెను సమస్యగా పరిణమించడంలో చారిత్రకంగా వాటి బాధ్యత చాలానే ఉంది.
గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలలో ప్రపంచంలో రెండవ పెద్ద పాత్ర అమెరికాదే! ప్యారిస్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియ ట్రంప్ 2025 జనవరిలో తిరిగి అధికారానికి వచ్చాక ఊపందుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించే లక్ష్యాన్ని చేరుకోగల గతిని నీరుగార్చనుంది. నిధుల మంజూరులో ఇచ్చిన మాటను అమెరికా ఎన్నడూ పూర్తిగా నిలబెట్టుకోలేదు.
ఆ లోటును ఫెడరల్ ప్రభుత్వం బదులు, రాష్ట్రాలు, స్థానిక పాలనా సంస్థలు తీరుస్తాయని భావిస్తున్నారు. ఇక తమ గ్రీన్‌హౌస్ వాయువుల విడుదలను 2035కల్లా 7 నుంచి 10 శాతం మధ్యకు తగ్గించుకుంటామని చైనా నాయకుడు షీ జిన్‌పింగ్ గత సెప్టెంబరులో ఐరాస సర్వ ప్రతినిధి సభలో చెప్పారు. ప్రపంచ ఉద్గారాలలో చైనా వాటా సుమారు మూడో వంతుగా ఉంది. దానితో పోలిస్తే, ఆయన చెబు తున్న మాటలు పెద్దగా లెక్కలోకి రావు.
వాతావరణ మార్పును అరికట్టే నాయకత్వం నుంచి అమెరికా, యూరోపియన్ యూనియన్ ఉపసంహరించుకోవడంతో చైనాయే నేతృత్వం వహించాలనే ఒత్తిడి పెరుగుతోంది. కానీ ‘ఏకైక నాయక’ పాత్రను చేపట్టడంలోని బరువు బాధ్యతలు చైనాకు బాగా తెలుసు. అందుకే నాయకత్వ బాధ్యత లను పంపిణీ చేయాలనీ, గ్లోబల్ సౌత్ దేశాల మధ్య సహకారాన్ని పటిష్ఠపరచాలనీ చైనా భావిస్తోంది.
అమందా మగ్నాని
వ్యాసకర్త బ్రెజిల్ పర్యావరణ పాత్రికేయురాలు


