విశ్లేషణ
ఆంగ్ సాన్ సూకీ ఎన్నికల విజయాన్ని మయన్మార్ సైన్యం దుర్మార్గంగా చేజిక్కించుకుని దాదాపు ఐదేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడా సైనిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వ హించ తలపెట్టింది. ఇవి డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి వరకు జరుగుతాయి. ఈ ఎన్నికల ద్వారా తమ పాల నకు చట్టబద్ధత సాధించాలని సైన్యం విఫలయత్నం చేస్తోంది. కానీ దేశంలో ఇప్పటికే నెలకొని ఉన్న అరాచక పరిస్థితి ఈ ఎన్నికలతో మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.
ప్రధాన రాజకీయ పార్టీ ఎన్‌ఎల్‌డీ (నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ) సహా అనేక పక్షాలు సైనిక పాలకులు ప్రకటించిన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. మయన్మార్ ప్రజాస్వామ్య ఆకాంక్షలకు ప్రతిరూప మైన సూకీని జైల్లో పెట్టిన సైనిక ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది. అందుకు నిరసన ప్రకటిస్తూ, కొత్త చట్టం కింద రాజకీయ పార్టీగా నమోదయ్యేందుకు ఆమె పార్టీ ఎన్‌ఎల్‌డీ నిరాకరించింది. దీంతో సైనిక పాలకులు ఆ పార్టీని రద్దు చేశారు.
2020 ఎన్నికల్లో సూకీ నేతృత్వంలోని ఎన్‌ఎల్‌డీ ఘన విజయం సాధించింది. సైనిక ప్రభుత్వం 2008లో ప్రకటించిన రాజ్యాంగం ప్రకారం, జాతీయ పార్లమెంటు ఉభయసభల్లోని 476 స్థానాల్లో 25 శాతం సీట్లు సైన్యానికి రిజర్వు అయ్యాయి. సైన్యం అనుకూల జాతీయవాద పార్టీ యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్ మెంట్ పార్టీ (యూఎస్‌డీపీ) ఆ ఎన్నికల్లో చావుదెబ్బ దెబ్బతింది.
అయిదేళ్ల క్రితం ఆరంభమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేస్తాననీ, అందుకు వీలుగా రాజ్యాంగాన్ని సంస్క రిస్తాననీ 2020 ఎన్నికల్లో సూకీ దేశ ప్రజలకు వాగ్దానం చేశారు. కాబట్టి, పగ్గాలు చేపట్టిన వెంటనే సూకీ సైన్యం తోక కత్తిరిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న సమయంలో సైన్యం తిరుగుబాటు చేసింది. అధికారం హస్తగతం చేసుకుంది.
అదుపు సాధించని సైన్యం
వేల మంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనకారులను సైనిక ప్రభుత్వం జైళ్లలో పెట్టింది. సొంత పౌరుల మీద బాంబులు కురిపించింది. గ్రామాలకు గ్రామాలను తగలబెట్టింది. సూకీని ఎక్కడ నిర్బంధించారో కూడా కచ్చితంగా తెలియదు. ఇంత చేసి కూడా సైన్యం దేశం మీద పట్టు సాధించలేకపోయింది. అనేక ప్రాంతాల్లో ప్రజాస్వామ్య అనుకూల పౌరసేనలు, సాయుధ పోరాట సంస్థలు సైనికులతో పోరు సలుపుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యపడేది కాదు.
‘స్ప్రింగ్ రివల్యూషన్’ పేరిట మయన్మార్‌లో ఉవ్వెత్తున ఎగసిన ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం సైన్యాన్ని పూర్తిగా ధిక్కరించాలని నిర్ణయించింది. ‘నేషనల్ యూనిటీ గవర్నమెంట్’ (ఎన్‌యూజీ)కి అనుబంధంగా పనిచేసే ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ వంటి సాయుధ ప్రతిఘటన సంస్థలు ఇందులో భాగం అయ్యాయి. ఎన్‌యుజి తానే దేశానికి నిజమైన ప్రభుత్వం అని ప్రకటించుకుంది. అజ్ఞాతం నుంచో ప్రవాసం నుంచో పనిచేస్తున్న నాయకులు దీన్ని నడుపుతున్నారు. ఏమైనప్పటికీ, మెజారిటీ స్థానాల్లో సైన్యం అనుకూల యూఎస్‌డీపీ నెగ్గుతుంది. ఇది సైనిక పాలకులకు మద్దతు ఇస్తుంది.
భారత్‌కు భద్రతా సమస్య
భారత్ ఈ ఎన్నికల కోసం ఈవీఎంలు సమకూర్చినట్లు వార్తలు వచ్చాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విష యాన్ని ప్రస్తావించకుండా ఒక ప్రకటన చేసింది: ‘ప్రజాస్వామ్యం దిశగా మయన్మార్ పరివర్తనకు ఇండియా మద్దతు ఇస్తుంది. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు అన్ని రాజకీయ వర్గాల భాగస్వామ్యం కీలకం. మయన్మార్లో శాంతి, చర్చలు, సాధారణ పరిస్థితుల పున రుద్ధరణకు తోడ్పడే అన్ని యత్నాలకూ ఇండియా ఇకమీదట కూడా మద్దతిస్తుంది’.
చాలా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడం లేదనీ, ఇవి స్వేచ్ఛగా, సమ్మిళితంగా జరిగే ఎన్నికలు కావనీ ఇండియాకు తెలుసు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించక పోయినా, కనీసం అక్కడి హింసాకాండకు ఒక రాజకీయ పరిష్కారం చూపించగలిగినా చాలు. నాలుగు ఈశాన్య రాష్ట్రాల వెంబడి మయన్మార్‌తో ఇండియాకు 1,643 కి.మీ. సరిహద్దు రేఖ ఉంది. ఆ దేశంలో ఏం జరిగినా దాని ప్రభావం మన మీద పడుతుంది.
సైనిక తిరుగుబాటు అనంతరం వ్యతిరేక వర్గానికి చెందిన వేల మంది సైనికులు శరణార్థులుగా మిజోరం రాష్ట్రంలోకి పారిపోయి వచ్చారు. చిన్ రాష్ట్రం మీద సైనిక పాలకులు బాంబులు కురిపించి నప్పుడు మిజోరంలోని సరిహద్దు గ్రామీణులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయవలసి వచ్చింది. అంతేకాదు, ప్రజాస్వామ్య అను కూల గ్రూపులతో పోరాడేందుకు మయన్మార్ సైన్యం సగాయింగ్ ప్రాంతం (మయన్మార్) లోని ఈశాన్య రాష్ట్రాల తిరుగుబాటు గ్రూపులతో కలసి పనిచేస్తోంది. ఇది ఇండియాకు భద్రత సమస్య. ఇండియా–మయన్మార్–థాయిలాండ్ త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు కూడా మయన్మార్ అలజడుల కారణంగా అసంపూర్తిగా మిగిలి పోయింది.
పాలు పోని ఇండియా
సూటిగా చెప్పాలంటే, మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ కారుల్లో మన పట్ల ఉన్న గౌరవాభిమానాలను పణంగా పెట్టి క్రూరు లైన ఆ దేశ సైనిక పాలకులతో ఇండియా సంబంధాలు నెరపింది. తద్వారా ఎంత ప్రయోజనం పొందగలిగింది? మణిపూర్ అశాంతికి మయన్మార్ చొరబాటుదారులే కారణమని నిందిస్తూ కూడా ఇలాంటి విధానం ఎందుకు అనుసరిస్తోంది? తాజాగా, మయన్మార్ సరిహద్దుల వెంబడి ఇండియా దృఢమైన కంచె నిర్మిస్తోంది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో డ్యూరాండ్ లైన్ వెంబడి కంచె నిర్మించడం ద్వారా వేలాది కుటుంబాలను, గ్రామాలను, తెగలను వేరు చేసిన బ్రిటిష్ పాలకుల తప్పిదాన్నే ఇండియా పునరావృతం చేస్తోంది. చైనా మాత్రం తన సొంత మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజె క్టులను కాపాడుకునేందుకు తెగల ప్రజలను ఉపయోగించుకుంది. అందుకు ప్రతిగా సైనిక పాలకులకు ఆయుధాలను సమకూర్చింది.
ఎట్టకేలకు, ఇండియా ఇప్పుడు మేల్కొంది. ప్రజాస్యామ్య అను కూల ఉద్యమ గ్రూపులతో మంతనాలు జరుపుతోంది. దేశం నుంచి ఆర్భాటం లేకుండా పనిచేసుకోడానికి వారికి అనుమతించింది. ఎన్ని కల ఫలితాలు ఎలా ఉంటాయనేది తెలిసిన విషయమే. పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యేందుకు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిర్వహించిన రెఫరెండం లాంటిదే ఈ ఎన్నికల తంతు. ఇండియాకు ఎదురవు తున్న సవాళ్లు, ఆ దేశంలో పెరుగుతున్న చైనా ప్రభావం ఇలాగే కొన సాగుతాయి. ‘యాక్ట్ ఈస్ట్’ అనేది కలగానే మిగిలిపోనుంది.
నిరుపమా సుబ్రమణియన్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్


