అభిప్రాయం
ఆర్థిక వృద్ధి, సాంకేతిక ప్రగతి భారత్‌లో అభివృద్ధికి నూతన మార్గాలుగా రూపొందినప్పటికీ ఉపాధి సృష్టి, సమానత్వ సాధనలో వ్యత్యాసాలు పెరగడానికీ కారణమయ్యాయి. ఆధునిక ఆర్థిక వృద్ధి లక్ష్యసాధనలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల మధ్య వనరుల పునఃపంపిణీ ప్రక్రియను నిర్మాణాత్మక మార్పుగా భావిస్తాం. చారిత్రకంగా, వివిధ దేశాలు ఈ నిర్మాణాత్మక మార్పులో భాగంగా రెండు దశలను చవి చూశాయి. వ్యవసాయ రంగం నుండి తయారీ; తయారీ రంగం నుండి సేవా రంగానికి శ్రామికుల బదిలీ.
తక్కువ ఉత్పాదకతతో కూడిన ప్రాథమిక కార్యకలాపాల నుండి ఆధునిక, అధిక ఉత్పాదకతతో కూడిన రంగాల వైపు శ్రామిక, మూలధన, సాంకేతికత లాంటి వనరుల బదిలీ; ఉపాధి పంపిణీ, విలువ జోడించిన పంపిణీ, అంతిమ వినియోగ పంపిణీలో తయారీ, సేవా రంగాల వాటా అధికంగా ఉండటం; భౌతిక, మూల ధన కల్పన; గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వల సలు; జనన, మరణ రేట్లలో తగ్గుదల లాంటి అంశాలను ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పునకు సూచికలుగా భావిస్తాం. భారత ఆర్థిక వ్యవస్థలో 2011–12 తదుపరి కాలంలో ఈ నిర్మాణాత్మక మార్పులలో తగ్గుదలను గమనించవచ్చు.
ఎందుకీ మందగమనం?
గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తి ఏడు రెట్లు పెరిగినప్పటికీ, ఉపాధిలో పెరుగుదల కనీసం రెట్టింపు కాలేదు. శ్రామిక మార్కెట్‌లో దృఢత్వం, పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, సమగ్ర ఆర్థిక విధానాలు అమలు చేయక పోవడం, ఆహారానికి సంబంధించి సాపేక్ష ధరలలో పెరుగుదల, పరపతి వృద్ధి తక్కువగా ఉండటం, తూర్పు ఆసియాలో మాదిరి వ్యవసాయ రంగం నుండి ఇతర రంగాల వైపు శ్రామికుల బదిలీలు తక్కువగా ఉండటం, తక్కువ వేతనంతో కూడిన నిర్మాణ రంగం, అసంఘటిత రంగంలో ఉపాధిలో తక్కువ నైపుణ్యత కల్గిన అధిక శ్రామిక శక్తి కేంద్రీకృతం కావడం లాంటి అంశాలు భారత్‌లో నిర్మాణాత్మక మార్పు ప్రక్రియ నెమ్మదించడానికి కారణాలుగా పేర్కొనవచ్చు.
సంస్కరణల అమలు కాలంలో నిర్మాణాత్మక మార్పు వేగంగా ఉండగలదని భావించినప్పటికీ సప్లయ్ వైపు వ్యవసాయ రంగాన్ని తయారీ రంగం అధిగమించినప్పటికీ, డిమాండ్ వైపు తయారీ రంగం వ్యవసాయ రంగాన్ని అధిగమించలేక పోయింది. తయారీ రంగ ఉత్పత్తి కార్యకలాపాలు ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాలకు బదిలీ అవుతున్నప్పటికీ గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో గ్రామీణ ఉపాధి వృద్ధిలో ఆశించిన పెరుగుదల సంభవించలేదు.
యువతలో ఉపాధి
భారత్ మొత్తం జనాభాలో 15–29 వయో వర్గ జనాభా 27 శాతం కాగా, మొత్తం శ్రామిక శక్తిలో వీరి వాటా 26.9 శాతం. ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం, యువతలో నిరుద్యోగిత 2000 సంవత్సరంలో 5.7 శాతం నుండి 2023లో 10 శాతానికి పెరిగింది. పారిశ్రామిక, సేవా రంగాలతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంపై ఆధారపడిన యువత తక్కువ. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, 2022లో యువతలో నిరుద్యోగిత భారత్‌లో 23.2 శాతం కాగా మొత్తం నిరుద్యోగం 7 శాతంగా అంచనా. అంత ర్జాతీయ శ్రామిక సంస్థ అంచనా ప్రకారం, 2023లో భారత్‌లోని మొత్తం గ్రాడ్యుయేట్‌లలో నిరుద్యోగిత 42.3 శాతం.
నియంత్రణతో కూడిన శ్రామిక చట్టాల వల్ల సంఘటిత రంగంలో ఉపాధి తగ్గుదల, సేవారంగ ఆధారిత వృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం, ఆటోమేషన్ కారణంగా ఉపాధి క్షీణించటం; ఐటీ, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ లాంటి రంగాలలో అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్రీకృతం కావడం, వివిధ అంశాలలో లింగ సంబంధిత అసమానతలు, నాణ్యతతో కూడిన శిక్షణ కొరత, నూతన సాంకే తికతకు అనుగుణంగా తగిన నైపుణ్యత శ్రామికులలో లేకపోవడం వంటివి నిరుద్యోగం పెరుగుదలకు కారణాలుగా నిలిచాయి.
వివిధ దేశాల అనుభవాలు
మానవ మూల ధనం, సేవలు, నవకల్పనలపై అధిక పెట్టు బడుల ద్వారా సింగపూర్ శ్రమ సాంద్రత ఆర్థిక వ్యవస్థ నుండి నాలెడ్జ్ బేస్డ్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఈ స్థితి అధిక వేతనాలు, ఉపాధి నాణ్యత పెరుగుదలకు దారి తీసింది. వృత్తి విద్య, శిక్షణకు జర్మనీ ప్రాధాన్యమిచ్చిన నేపథ్యంలో ఆధునిక తయారీ, అధిక నైపుణ్యత అవసరమైన సేవలలో ఉపాధి అవకాశాలు పెరి గాయి. చైనాలో నిర్మాణాత్మక మార్పులు కొన్ని కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి విముక్తి కావడానికీ, పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాల పెరుగుదలకూ, గ్రామీణ–పట్టణ ప్రాంతాల మధ్య లింకేజెస్ పెరగడానికీ దోహదపడ్డాయి.
మలేషియాలో నిర్మాణాత్మక మార్పుల కారణంగా ప్రాథమిక వస్తువులపై ఆధారపడటం తగ్గి తయారీ, సేవలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో మలేషియా అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఆదాయ స్థిరీకరణ సాధించింది. దక్షిణ కొరియా, తైవాన్ నిర్మాణాత్మక మార్పుల కారణంగా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల నుండి పారి శ్రామిక పవర్ హౌసెస్‌గా రూపాంతరం చెందాయి. తక్కువ ఉత్పా దకతతో కూడిన వ్యవసాయ రంగం నుండి అధిక ఉత్పాదకతతో కూడిన తయారీ రంగానికి శ్రామికుల బదిలీ ఆయా దేశాల ఆర్థిక సామర్థ్య పెరుగుదలకు దారి తీసింది.
యువతలో ఉపాధి పెంపునకు చర్యలు
భారత్‌లో ముఖ్య ఆర్థిక రంగాలకు సంబంధించి ఒక అంచనా ప్రకారం 2030 నాటికి యువతలో ఉపాధి వృద్ధి అధికంగా వ్యవ సాయం, దాని అనుబంధ రంగాలలో ఉంటుంది. ఈ రంగం నైపుణ్యత లేని, తక్కువ నైపుణ్యత కల్గిన శ్రామిక శక్తికి ఉపాధినందిస్తుంది. ప్రస్తుత ఉపాధి వృద్ధిని కొనసాగించడంతో పాటు, పెరుగు తున్న ఉపాధి డిమాండ్‌ను తీర్చాలంటే 2030 నాటికి ప్రతి సంవత్సరం 78.5 లక్షల మందికి వ్యవసాయేతర రంగాలలో ఉపాధి కల్పించాలి.
యువతలో ఆర్థిక అవకాశాలు మెరుగుపర్చడానికి ఇంటర్న్‌షిప్, అప్రెంటిస్‌షిప్, ఆంట్రప్రెన్యూర్‌షిప్‌పై ఆసక్తి కనబరచే విధంగా వారిని ప్రోత్సహించాలి. 2022–23లో గ్రాడ్యుయేట్‌లలో నిరుద్యోగిత 13.4 శాతంగా నమోదైంది. ఉపాధి సామర్థ్య రంగాలైన డిజిటల్ సర్వీసులు, ఫైనాన్షియల్ సర్వీసులు, ఆరోగ్య సేవలు, హాస్పిటాలిటీ, ఈ–కామర్స్; చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలి.
ఉన్నత విద్యలో పరిశ్రమల లింకేజ్‌ను పటిష్టపరచడం ద్వారా, ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా కరికులంలో మార్పులు చేయాలి. నియంత్రణల సడలింపు ద్వారా ప్రైవేటు రంగ అభివృద్ధికి తీసుకొనే చర్యలు యువతలో ఉపాధి అవకాశాలను విస్తృతపరచ గలవు. కృత్రిమ మేధ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి సాంకేతికమైన నవ కల్పనలు యువతలో ఉపాధి క్షీణతకు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో బ్లూ కలర్ ఉపాధి సృష్టికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి. శ్రమ సాంద్రత పరిశ్రమలను ప్రోత్సహించే విధానాల ద్వారా తయారీ రంగాన్ని పటిష్ట పరచాలి.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త వైస్ ఛాన్స్‌లర్ (ఇన్‌చార్జ్), ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, హైదరాబాద్


