
మన దేశంలో చేనేత పరిశ్రమ అత్యంత పురాతనమైన వృత్తి. దీనిని దేశ వారసత్వ సంపదగా కూడా గుర్తిస్తారు. వ్యవసాయరంగం తరువాత దేశంలో ఎక్కువమంది గ్రామీణ ప్రజలు ఆధార పడ్డ రంగం చేనేత రంగం. కానీ ఇటీవల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పుల్లో భాగంగా చేనేత, టెక్స్‌టైల్ రంగంపై ఏకంగా 18 శాతం జీఎస్టీని విధించడంతో ఆ రంగంపై పెను భారం పడనుంది.
రూ. 1,000 కంటే తక్కువ ధర ఉన్న చేనేత వస్త్రాలపై 5 శాతం, ఆ ధర కంటే ఎక్కువ ధర ఉండే చేనేత వస్త్రాలపై 12 శాతం జీఎస్టీని ఇప్పటివరకు విధించారు. నూతన జీఎస్టీలో భాగంగా 2,500 రూపాయల కంటే తక్కువ ధర ఉండే వస్త్రాలపై 5 శాతం, 2,500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉండే చేనేత, ఇతర వస్త్రాలపై ఉన్న 12 శాతం జీఎస్టీని 18 శాతానికి పెంచారు. గత కొన్నేళ్లుగా మార్కెట్‌లో ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా వస్త్రాల ధరలు పెరిగి 5 శాతం స్లాబ్ నుండి 12 శాతం స్లాబ్‌లోకి వచ్చాయి. దీంతో మార్కెట్‌లో డిమాండ్ లేకుండా పోతోంది.
చదవండి: ఖరీదైన ఆస్తిని అమ్మేస్తున్న ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్
ఫలితంగా ఆదాయం కోల్పోయి చాలా కుటుంబాలు చేనేత వృత్తిని వదిలి ఇతర వృత్తులను ఎంచు కుంటున్నాయి. ఇప్పుడు జీఎస్టీని కొన్ని దుస్తులకు పెంచడంతో రానున్న రోజుల్లో చేనేత పరిశ్రమ మరింత నష్టాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడు దేశంలో పేరొందిన పోచంపల్లి, కంచి, బెనారస్, ధర్మవరం, గద్వాల్ చేనేత వస్త్రాలు కేవలం రూ. 2,500 లోపే మార్కెట్‌లో దొరుకుతాయా? ఎటు వంటి శారీరక శ్రమతో పనిలేకుండా కృత్రిమ దారాలతో, యంత్రాల సహాయంతో తయారు చేసే పాలిస్టర్ వంటి వస్త్రాలపై జీఎస్టీని 12 శాతం నుండి5 శాతానికి తగ్గించడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ వస్త్రాలు తక్కువధర లకు లభించడంతో వినియోగదారులు వాటిపై మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఫలితంగా చేనేత పరిశ్రమకు మరింత నష్టాలు వచ్చే అవకాశంఉంది. నిజానికి చేనేత వస్త్రాలు విలాసవంతమైన వస్తువులు కావు. అవి భార తీయ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక. ముఖ్యంగా, లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తులపై జీఎస్టీని తీసివేయాలి.లేదా ధరల సీలింగ్ లిమిట్‌ను హేతుబద్ధీకరించాలి. స్వదేశీ వస్తువులనే ప్రోత్సహించాలి. ‘వోకల్ ఫర్ లోకల్’, స్వదేశంలోనే ప్రతి వస్తువును తయారు చేయాలంటూ ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ అంటున్న కేంద్ర ప్రభుత్వం... స్వదేశీ సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే చేనేత వస్త్రాలపై జీఎస్టీ విషయంపై పునఃసమీక్ష చేయాలి.
ఇదీ చదవండి: నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ
– డా.రామకృష్ణ బండారు
కామర్స్ అధ్యాపకులు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ