
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఆగస్టు 15న అలాస్కాలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పాటు యూరోపియన్ నాయకు లతో 18న వైట్‌హౌస్‌లో ముఖాముఖి చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇక యుద్ధం ముగింపునకు మార్గం సుగమమవుతున్నదనే సూచనలు ప్రపంచానికి ఇచ్చారు. సరిగ్గా మూడు వారాలు గడిచేసరికే పరిస్థితి అయోమ యంగా మారగా, ఆయన సెప్టెంబర్ 6న అదే వైట్‌హౌస్‌లో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులతో మాట్లాడుతూ, యుద్ధాన్ని ఆపలేకపోతున్నట్లు అంగీకరించారు.
ప్రయత్న లోపం లేకపోయినా...
దాని అర్థం ట్రంప్ ప్రయత్నాలు నిలిచిపోతాయని కాదు. ఇందులో తన ప్రయత్న లోపం ఏమీ లేదు. సైద్ధాంతికంగా, భౌగోళిక రాజకీయాల దృష్ట్యా తక్కిన అమెరికన్ అధ్యక్షుల వలెనే ట్రంప్ కూడా రష్యా వ్యతిరేకి. అది తన మొదటి పదవీ కాలంలో (2017–21) స్పష్టంగానే కనిపించింది. కానీ ఈ రెండవ విడతకు వచ్చేసరికి యుద్ధాలకు వ్యతిరేకినని ప్రకటించుకున్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి అయితే ఎన్నికల ప్రచార సమయంలోనే ఆ వైఖరి తీసుకుని 24 గంటలలోనే ఆ స్థితిని ముగింపజేస్తానన్నారు. ఆ మాటను అక్షరాలా తీసుకుని నిందించనక్కరలేదు గాని, ఆ దిశలో ప్రయత్నాలను మాత్రం 24 గంటలలోనే మొదలుపెట్టారు.
అప్పటి నుంచి గత ఎనిమిది మాసాలలో తన ప్రతినిధులను మాస్కో, కీవ్, బ్రస్సెల్స్‌లకు పలుమార్లు పంపారు. కొందరిని వైట్‌హౌస్‌కురప్పించి చర్చించారు. పుతిన్, జెలెన్‌స్కీ తదితరులతో పలుమార్లు టెలిఫోన్ సంభాషణలు జరిపారు. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధి వర్గాల మధ్య ఇస్తాంబుల్‌లో చర్చలు జరిగేట్లు చూశారు. యుద్ధ విరమ ణకు, సమస్య పరిష్కారానికి ఉభయ పక్షాలు తమ తమ ప్రతిపాద నలను ప్రకటించేట్లు చూశారు. ఆంక్షల రూపంలో రష్యాను, ఆయు ధాల సరఫరా నిలిపివేత రూపంలో ఉక్రెయిన్‌ను ఒత్తిడి చేశారు.
ఇంత తక్కువ కాలంలో ఇన్నిన్ని ప్రయత్నాలన్నది సాధారణమైన విషయం కాదు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మూల కారణం ఎక్కడుందనే అవగాహన ట్రంప్‌కు ఉంది. నాటో సైనిక కూటమిని రష్యా సరి హద్దు వరకు విస్తరించజూడటం వల్లనే అభద్రతాభావానికి గురైన పుతిన్ ఈ యుద్ధాన్ని సాగిస్తున్నారని అనేకమార్లు అన్నారాయన. ఉక్రెయిన్, యూరోపియన్ నాయకులకు ముఖాముఖిగా చెప్పటమే గాక, ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకునే ప్రసక్తి లేదని ప్రకటించారు.
మొదట 20 ఏళ్లపాటు అని, తర్వాత ఎప్పటికీ జరగదన్నారు. క్రిమియా, దోన్‌బాస్‌లను రష్యాకు వదలివేయాలనీ చెప్పారు. ఈ ప్రతిపాదనలకు జెలెన్‌స్కీ, యూరోపియన్ నాయకులు సుముఖత చూపకపోవటంతో, ఇక మీ ఖర్మ మీదన్నట్లు మాట్లాడారు. పాశ్చాత్య సామ్రాజ్యవాదానికి, నాటో సైనిక కూటమికీ నాయకత్వ స్థానంలోగల ఒక దేశాధినేత ఇటువంటి వైఖరి తీసుకోవటం మామూలు విషయం కాదు.
యూరప్ మొండితనం
ఇంతకూ పరిస్థితి అలాస్కా నుంచి అయోమయంలోకి వెళ్లటా నికి కారణాలేమిటి? అందుకు బాధ్యత యూరోపియన్ నాయకు లది. ముఖ్యంగా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లది. జెలెన్‌స్కీని అడుగడు గునా రెచ్చగొట్టి రాజీలు జరగకుండా చేస్తున్నది వారే. భూభాగా లను వదులుకునేందుకు జెలెన్‌స్కీ పరోక్షంగా సిద్ధపడగా, ఆ మాటను వారు మార్పించారు. తమకు పూర్తి రక్షణ హామీలు చాలు నన్న ప్రతిపాదనను జెలెన్‌స్కీ ఒక దశలో చేయగా, అందుకు పుతిన్‌ను ట్రంప్ ఒప్పించారు. నాటో ఛార్టర్‌లో 5వ నిబంధన అనేది ఒకటుంది.
ఒక నాటో సభ్య దేశంపై ఇతరులు దాడి జరిపితే మొత్తం అందరిపై దాడి జరిపినట్లుగా పరిగణించి అందరూ ఆ దేశానికి రక్షణగా ముందుకు రావాలని ఆ నిబంధన చెప్తున్నది. ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకపోయినా ఆ నిబంధనను పోలిన రక్షణలు ఇచ్చేందుకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు. అందుకు కూడా అలాస్కాలో అంగీకరించిన పుతిన్, ఉక్రెయిన్ ప్రజలకు రక్షణ అవసరమేనన్నారు. ఈ ప్రస్తావనలన్నీ ఆగస్టు 18 నాటికి వైట్‌హౌస్ చర్చలలో వచ్చాయి.
ఇక త్వరలో పుతిన్, జెలెన్‌స్కీల ముఖాముఖి సమావేశం జరిగి వారొక అంగీకారానికి రానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆ సమావే శానికి తగిన స్థలం కోసం వెతుకుతున్నారని, వారిద్దరి చర్చల తర్వాత ఒకవేళ ఆహ్వానించినట్లయితే తాను కూడా వెళ్ళగలనని అన్నారు.అటువంటి ఆశావహమైన సూచనల మధ్య అంతలోనే అంతా బెడిసిపోయింది. ఆ పరిణామాల మధ్య నుంచే ట్రంప్ సెప్టెంబర్ 6 నాటి నిస్పృహతో కూడిన వ్యాఖ్యలు వినిపించాయి.
‘నాటో’ విస్తరణ ఆగితేనే...
అట్లా బెడియటానికి కనిపించే తక్షణ కారణం, ఉభయ పక్షాల మధ్య ఒప్పందం కుదిరే వరకు దాడులు కొనసాగించగలమనీ, అట్లాగాక ఉక్రెయిన్ పక్షం పట్టుబడుతున్నట్లు ముందుగానే కాల్పుల విరమణ జరిగితే ఆ వ్యవధిని ఉపయోగించుకుని సైన్యాన్ని, ఆయుధాలను సమీకరించుకోగలరనీ రష్యా వాదిస్తుండగా, అటు వంటిదేమీ చేయబోమనే హామీని ఇవ్వని ఉక్రెయిన్ తన దాడులు తాను సాగిస్తుండటం.
ఇందులో ట్రంప్ రష్యా వైఖరినే సమర్థించారు. ఇది తక్షణ కారణం కాగా, కనీసం ట్రంప్ ప్రతిపాదించిన ప్రకారమైనా భూమిని రష్యాకు వదలుకోవటానికి ఉక్రెయిన్ నిరాకరిస్తుండటం ప్రధానమైంది. ఉక్రెయిన్ రక్షణ కోసం యుద్ధ ఆరంభంలో జరిగిన ఒప్పందం మేరకు అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లండ్, జర్మనీ హామీగా నిలిస్తే సరిపోతుందని పుతిన్ అంటుండగా, యూరోపియన్ దేశాలు ఉమ్మడి సేనలను పంపగలవన్నది బ్రస్సెల్స్ వాదన.
ఉక్రెయిన్ భూభాగంలో అటువంటి సేనల ప్రవేశాన్ని ఎంతమాత్రం సమ్మతించబోమని పుతిన్ స్పష్టం చేస్తున్నారు. అలాస్కా వైట్‌హౌస్ చర్చల అనంతరం విషయమంతా ఇక్కడ స్తంభించిపోయింది. అక్కడి నుంచిముందుకు ఎట్లా, ఎప్పటికి కదిలేనో ట్రంప్‌కు బోధపడుతున్నట్లు లేదు. ఆ నిస్సహాయతలో తను చేయగల పని రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే ఇండియా వంటి దేశాలపై సుంకాలు పెంచటం ఒక్కటే గనుక అది మాత్రం అర్థంపర్థం లేకుండా చేస్తున్నారు.
నాటో విస్తరణ సమస్య ఇపుడు కొత్తగా తలెత్తింది కాదు. 1991లో సోవియెట్ యూనియన్ వార్సా కూటమి రద్దయినాక కూడా, ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా వ్యతిరేకతను లెక్కచేయకుండా నాటోను అయిదుసార్లు విస్తరించారు. యుద్ధం మొదలైనాక ఆ పని మరో రెండుసార్లు చేశారు. ఆ చర్యలను రష్యా అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్, ఆ తర్వాత పుతిన్ వ్యతిరేకిస్తూ వచ్చారు.
అయినప్పటికీ అమెరికా అధ్యక్షులు ముఖ్యంగా క్లింటన్‌తో మొదలుకొని బైడెన్ వరకు వేగంగా విస్తరిస్తూ పోయారు. ఇపుడా దేశాల సంఖ్య 32కు చేరింది. ట్రంప్ మినహా ఆ నాయకుల లక్ష్యమంతా ఉక్రెయిన్‌ను కూడా చేర్చుకుని రష్యాను చుట్టుముట్టడం. ఇది పుతిన్‌కు తెలుసు.
-వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
-టంకశాల అశోక్