
ఇంగ్లిష్ దేశాలతో మన దేశ సంబంధాలు గందరగోళంలో ఉన్న రోజులివి. ఒకవైపు ఇండి యన్ యువకుల అమెరికన్ డ్రీమ్‌లపై అమెరికా మట్టికొ డుతున్న రోజులు. మరోపక్క కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లు కూడా ఇమ్మిగ్రే షన్ (వలస)పై తిరుగుబాటు చేస్తున్న రోజులు. ఇందుకు రష్యన్ ఆయిల్‌ను ఇండియా కొనడం ఒక కారణమైతే, ప్రపంచ దేశాలన్నిటిలో మన దేశం ‘ఫస్ట్’ అనే సంకుచిత జాతీయ భావన పెరిగిపోవడం మరొకటి.
ప్రపంచీకరణ ఆచరణలో ఉన్న గత ముప్పయి ఏండ్లలో ‘నా దేశం ఫస్ట్’ అనే నినాదం మన దేశ బీజేపీ ప్రభుత్వమే మొదట ఇచ్చింది. దీనితో పాటు భారతదేశంలో ‘హిందీ ఫస్ట్’ అనే ప్రచారం కూడా మొదలైంది. క్రమంగా వివిధ రంగాలలో ఇంగ్లిష్ భాషను వెనక్కి నెట్టే ప్రక్రియ నడుస్తున్నది.
2025 అక్టోబర్ 5 నాటికి ఇండియాకు ఇంగ్లిష్ భాష ఒక బోధనా భాషగా వచ్చి 208 ఏళ్ళు అవుతుంది. గత కొంత
కాలంగా మనం ఆ రోజును ‘ఇండియన్ ఇంగ్లిష్ దినం’గా జరుపుకొంటున్నాం. ఈ భాష ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో; సివిల్ సర్వీస్ పరీక్షలలో చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ మధ్య ఇంగ్లిష్ దేశాలుగా ఉన్న అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ మీద తీసుకుం
టున్న కఠినమైన నిర్ణయాలు ఇక్కడి ఇంజినీరింగ్ విద్యారంగాన్ని ఏం చెయ్యబోతున్నాయన్న అనుమానం కలుగుతోంది.
గత 30 ఏళ్లుగా ఈ దేశంలో ఐఐటీ, ఎన్‌ఐటీ, వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు కేవలం అమెరికాకో, మరో ఇంగ్లిష్ భాష మాట్లాడే దేశానికో పోవడం కోసమే చదవడం జరిగింది. కానీ ఇకముందు అన్ని రకాల కోర్సులను మన దేశంలో ఉండి ఏదో ఒక పనిచేసి కుటుంబం, దేశం అభివృద్ధి కావడం కోసం చదవాల్సి ఉంటుంది. ఈ స్థితిలో ఈ దేశంలో ఇంగ్లిష్ ప్రాధాన్యం తగ్గుతుందా? తగ్గించే వైపునకు పయనించాలా అనే ప్రశ్న ఎదురౌతుంది.
ఇండియన్ ఇంగ్లిష్ ఇండియా అభివృద్ధికే!
ఇతర ఇంగ్లిష్ దేశాలు భారతదేశం నుండి మొత్తం వలసలను ఆపినా సరే... ఇండియన్ ఇంగ్లిష్‌ను బాగా అభివృద్ధి చేసుకోవలసిందే. భవిష్యత్తులో అన్ని రంగాల్లో రీసర్చి ఇంగ్లిష్ భాష అభివృద్ధి అయిన దేశాల్లోనే పెరుగుతుంది. ఇంగ్లిష్ భాషకు ఉన్న కాన్‌సెప్ట్యువల్ క్లారిటీ ప్రపంచంలోని ఏ ఇతర భాషల్లో రాలేదు. పరిశోధనలో కొత్త ఆవిష్కరణలు జరగాలంటే భూమి మీద ఉన్న పదార్థాలను మానవులు చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. అందుకు దోహదపడే భాష చాలా అవసరం. మన దేశంలోని ప్రాంతీయ భాషల్ని అటుంచండి; చైనా, జపాన్ వంటి సైన్సులో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆ దేశ భాషలకు ఆ పట్టు లేక వాళ్ళు రీసర్చిలో, ఉన్నత చదువుల్లో ఇంగ్లిష్‌ను అభివృద్ధి చేసుకుంటున్నారు.
అందుకే చైనా అతిశక్తిమంతమైన సెర్చ్ ఇంజిన్‌కు ‘డీప్ సీక్’ అని ఇంగ్లిష్ పేరు పెట్టింది. ఈ మధ్యకాలంలో అమెరికా హెచ్ వన్ బీ వీసా ఆంక్షలు విధించగా టాలెంట్ ఉన్నవారికి తాము స్వాగతం పలుకుతామని ఓ కొత్త వీసా ఇవ్వడానికి సిద్ధమయ్యింది చైనా. దానికి ‘కె–వీసా’ అని ఇంగ్లిష్ పేరే పెట్టింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అన్ని స్కీములకూ హిందీ పేర్లు పెడుతున్నది. హిందీలో పెట్టిన ఆ పేర్లన్నీ ఈ దేశంలోని దక్షిణ, ఈశాన్య ప్రాంత పౌరులకు అర్థం కావు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రభుత్వ స్కూళ్లలో తీసెయ్యడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
యూఎన్ 80 ఏండ్ల చరిత్రలో ఇంగ్లిష్ పాత్ర
ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్యసమితి (యూఎన్) తన 80 ఏండ్ల సంబరాలు జరుపుకున్నది. ప్రపంచ దేశాల అధినేతలు అందులో పాల్గొని మాట్లాడారు. దాదాపు 80 శాతం ప్రపంచ దేశ నాయకులు తమ ఉపన్యాసాలు ఇంగ్లిష్‌లోనే ఇచ్చారు. కొద్దిమంది నాయకులు తమ దేశాల భాషల్లో మాట్లాడారు. కానీ వినే వారికి వారి పెదవుల కదలిక మాత్రమే కనిపించింది.
ఇంగ్లిష్ అనువాదకుల మాట మాత్రమే వినిపించింది. అంటే 1945 నుండి 2025 నాటికి ఇంగ్లిష్ భాష ప్రపంచమంతటికీ పాకిందన్నమాట. చాలా దేశాల్లో భాషా సంకుచిత భావం బాగా తగ్గింది. మన దేశంలో భాషా ప్రాతిపదికన ప్రాంతాల మధ్య కొట్లాటలు తగ్గాయి. ఇప్పుడు హిందీని రాష్ట్రాలపై రుద్దుతున్నందువల్ల మళ్ళీ కొన్ని నిరసన ప్రదర్శనలు మొదలవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో సైన్సు అభివృద్ధి కీలకమైంది. ఈ స్థితిలో భారతదేశం వెనుకబడకుండా ఉండాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ భాషను అభివృద్ధి పర్చి శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధి చెయ్యడం తప్ప మరో మార్గం లేదు.
భారత్‌లో ఇంగ్లిష్ ప్రాముఖ్యం
పైన పేర్కొన్న అన్ని రకాల కారణాల వల్ల అక్టోబర్ 5 నాడు దేశం మొత్తంగా ఇండియన్ ఇంగ్లిష్ డే జరపడం చాలా ముఖ్యం. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఇంగ్లిష్ ప్రాముఖ్యాన్ని చర్చించేందుకు అదొక సందర్భం అవుతుంది. ఇంగ్లిష్ దేశాల్లోకి యువత ఇమ్మిగ్రేషన్‌కు ఆటంకాలు ఏర్పడతున్నాయి కదా అని మన విద్యారంగాన్ని ప్రాంతీయ భాషల్లోకి జార్చితే సైన్సు, టెక్నాలజీ అభివృద్ధి సాధ్యం కాదు. ఈ సందర్భంలో చాలా తీవ్రంగా చర్చించాల్సిన అంశం: ‘అసలు మన చదువులు విదేశాల కోసమా, మన దేశం కోసమా?’ ‘మన చదువులు మన దేశంలో మన జీవితాలను, నిర్మించుకునేటందుకు’ అనే ఆలోచన కీలకమైంది. నేను జీవితాంతం ఇంగ్లిష్‌లో రాసింది, చదివింది విదేశాల్లో మార్పు, అభివృద్ధి కోసం కాదు కదా! ‘నా అభివృద్ధి నా దేశంతోనే ముడివడి ఉంది’ అనే ఆలోచనతో. ఈ ఆలోచనతోనే అంబేడ్కర్ విదేశాల్లో చదువుకొని ఇక్కడ ఇంగ్లిష్‌లో రాశారు, మాట్లాడారు. ఆ రోజుల్లో తన కమ్యూనిటీలో గానీ, తన వర్గంలో గానీ ఇంగ్లిష్ అర్థం చేసుకునే వారు గానీ, చదివేవారు గానీ లేరు. ఆ స్థితి ఇప్పుడు కొంతైనా మారింది కదా! అందుకే ఇంగ్లిష్ నేర్చుకోవాలనే పట్టుదలను దేశం వదలకూడదు.
వ్యాసకర్త ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్
ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు
(నేడు ‘ఇండియన్ ఇంగ్లిష్ డే’)